జగిత్యాలలో ఒక విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్ఐ ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. చిల్వకోడూరు సమీపంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయిన కారు చెట్టును ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న మహిళా ఎస్‌ఐ కొక్కుల శ్వేత ప్రాణాలు కోల్పోయింది.
ఆమె గొల్లపల్లి నుండి జగిత్యాలకు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్ రైడర్ కూడా మరణించాడని పోలీసులు నిర్ధారించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు.
శ్వేత ప్రస్తుతం జగిత్యాల పోలీస్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.