అటవీ భూములను బొక్కేస్తున్న పెద్దల బాగోతం ఒక్కొక్కటిగా వెలుగుచూస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అటవీ భూములను కొందరు కబ్జా చేసారంటూ ఏపీ అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ చలపతి రావు మీడియా సమావేశంలో చెప్పారు. చిత్తూరు జిల్లా మంగళం పేటలో ఏకంగా 32.63 ఎకరాల భూమిని పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించుకున్నదని ఆయన చెప్పారు. ఆ భూమిని స్వాధీనం చేసుకుంటామనీ, ఎక్కడ ఆక్రమణలు జరిగినట్లు తేలినా ఆ భూములన్నింటినీ వెనక్కి తీసుకుంటామని అన్నారు.
ప్రస్తుతం కొన్ని రిట్ పిటీషన్లపై కోర్టులో వాదనలు జరుగుతున్నట్లు వెల్లడించారు. పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల పేర్లతో మొత్తం 74 ఎకరాలు వుండగా ఈ భూములను ఆనుకుని వున్న 32.63 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుని అందులో మామిడి, ఉద్యాన పంటలు సాగుచేసినట్లు గుర్తించి వాటన్నిటినీ తొలగించనట్లు చెప్పారు. అటవీ భూముల వివరాలన్నింటినీ వెబ్ ల్యాండులో పెడతామనీ, అటవీ భూములకు సంబంధించి సంపూర్ణ వివరాలు ప్రజలకు తెలిసేటట్లు చేస్తామని ఆయన అన్నారు.