Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జీవ సమాధికి ప్రవేశించుటకు ముందు రోజు రాత్రి ఏం జరిగింది?

Advertiesment
Sri Veerabrahmendra Swamy

సిహెచ్

, సోమవారం, 10 నవంబరు 2025 (22:35 IST)
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒక సుదినమున తన ధర్శపత్నియైన గోవిందమ్మను పిలిచి, ఈ జగత్తు నందు భౌతికముగ ఉండుటకు నాకు ఆసక్తి క్షీణించినది. మన పెద్ద కుమారుడైన గోవిందయ్యాచార్యులకు మా వారసులుగా పీఠము భాద్యతలు అప్పగించి ఒక శుభ ముహూర్తమున జీవసమాధిని స్వీకరించెదను అని స్వామి వారు చెప్పగా ఆమె కన్నీరు పర్యంతమై, మీరు లేని నా జీవితము వ్యర్ధము, నేను జీవించి ఉండలేను అని విలపించ సాగినది. అంతట స్వామి వారు, నీ బాధ్యత ఈ లోకమును ఇంకా మిగిలి ఉన్నది అని ఆమెకు నచ్చచెప్పి, గోవిందయ్యాచార్యులుని పిలిపించమన్నారు. గోవిందయ్యాచార్యులు వచ్చి, విషయము తెలుసుకుని, హతాశుడయి, తండ్రీ! అంత పెద్ద బాధ్యతను తలకెత్తుకుని నిర్వర్తించగలిగే సామర్థ్యము నాకు లేదు అని అసక్తతను ప్రదర్శించగా, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారు, మా ఆశీర్వాదము ఎల్లవేళలా నీకుంటాయి. నీ శాయశక్తులా మనసు పెట్టి పీఠమును నడిపించు. తప్పక పీఠాధిపత్యము నిర్విఘ్నంగా అందరూ శ్లాఘించే విధంగా నిర్వహించగలుగుతావు. సిద్దయ్యను కూడా పిలువు చివరిగా బోధించ వలసిన విషయములు ఉన్నాయి అని నచ్చజెప్పారు.
 
సిద్ధయ్య వచ్చిన తరువాత ఇద్దరికీ కలిపి వేదాంతసారము, ఉపనిషత్తులలోని విషయాలు, భవిష్యత్తుని  దర్శించు విధానములు కూలంకుశముగా బోధించి, వారికి వచ్చిన ఆద్యాత్మిక సందేహములన్నీంటినీ తొలగించారు. తన జీవసమాధి తరువాత నిర్వర్తించవలసిన కార్యక్రమాలకు మనసా వాచా కర్మణా  సిద్ధమైయ్యే విధంగా వారిని మలచారు.
 
స్వామి వారు జ్యేష్ట పుత్రుని పట్టాభిషేకమునకు దేశము లోని భక్తులకు, ఋషిపుంగవులకు, వేద పండితులకు, పాలకులకు ఆహ్వాన పత్రికలు పంపించడం జరిగింది. ఆ ఆహ్వానం పత్రికలో తన జ్యేష్ట తనయుని పీఠాధిపత్యము స్వీకరించిన తరువాత మూడురోజులకు జీవసమాధిని పొందుతానని, ఈ లోపల తనను దర్శించుకోవాలనుకునే వారు దర్శించుకుని ఆశీర్వచనములు పొందవచ్చునని, కాలజ్ఞాన విశేషములు వినవచ్చునని, రాలేని వారు  తనను నమ్మి తాను ప్రకటించిన, ఓం, హ్రీం, క్లీం, శ్రీం, శివాయ బ్రహ్మణే నమః అను మూల మంత్రమును జపించిన ఈతిబాధలు నుండి రక్షింపబడి సుఖసంతోషములతో ఉంటారని ప్రకటన చేసారు.
 
ఊరంతా పుష్పతోరణములతో అలంకరించబడగా, అంబారీ ఏనుగు మీద ఊరేగుతు వచ్చి, వైశాఖ శుద్ద సప్తమి గురువారంనాడు ప్రముఖులు, భక్తుల సమక్షంలో వేదపండితుల మంత్రోచ్చారణలు చేస్తుండగా, ఋషివర్యుల మంగళా శాసనాల మధ్య, ఘనంగా శ్రీ గోవిందయాచార్యులవారు పీఠము యొక్క బాధ్యతలు స్వీకరించారు.
 
శ్రీ శ్రీ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు సమాధి చెందుట
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జీవ సమాధికి ప్రవేశించటకు ముందు రోజు రాత్రి అనగా నవమి నాటి రాత్రి స్వామివారి ఆజ్ఞానుసారం మాత గోవిందమ్మ సిద్దయ్యను పిలిచి బనగానపల్లె వెళ్లి పుష్పములు తెమ్మని సెలవిచ్చారు. సిద్దయ్య ఆమె వద్ద సెలవు తీసుకుని, నిద్రలో ఉన్న స్వామివారి పాదములకు నమస్కరించి, బయలుదేరాడు.
 
క్రీ.శ. 1694 సంవత్సరము, వైశాఖ శుద్ధ దశమి ఆదివారము పగలు రెండున్నర గంటలకు స్వామి వారు జీవ సమాధిని పొందుటకు ముహూర్తము నిర్ణయించబడినది. ఆనాటి వేకువజామున కాలకృత్యములు ముగించుకుని సమాధి ప్రదేశమునకు చేరుకున్నారు. అప్పటికే భక్తి జనులు, బంధుపరివారము, నవాబులు ఆ ప్రాంగణమునకు చేరుకున్నారు. గోవిందయాచార్యులను తన చెంతకు పిలిపించుకుని, నాయనా ఇకనుండి రాగ ద్వేషములకతీతముగా, ఎవరిపైనా కోపము చెందక, సర్వ జీవులయందు సమాన భావము కలిగి, పిన్నలు పెద్దలు అను భేద భావము చూపక సహనముతో పామరులను దైవోన్ముఖులను చేయుము. దుష్ట చింతన గల వారిని సజ్జనులుగా మార్చు. నీకు సద్గుణవతియు, మహా మహిమాన్వితురాలు అగు బిడ్డ జన్మిస్తుంది. ఆమెకు ఈశ్వరమ్మ అని నామకరణము చేయుము. ఆమె నోట రాలిన వాక్కు సత్యమవుతుంది. జనులను ధర్మనిష్ఠ వైపు నడిపిస్తూ వీరమాతయై జీవ సమాధి చెందుతుంది అని సెలవిచ్చారు.
 
గోవిందమ్మను ఉద్దేశించి, మేము సమాధి చెందినను, సౌభాగ్యమునకు చిహ్నములైన పసుపు కుంకుమలు, మట్టెలు గాజులు తీయవద్దు. పన్నెండు సంవత్సరముల ప్రాయము నుండి మిమ్ములను సేవిస్తూ వస్తున్న సిద్ధయ్యకు మా చేతి బెత్తము, శిఖాముద్రిక, సింహపాదుకలు, యోగదండము అప్పజెప్పు అని పలికారు. అక్కడకు వచ్చిన జనసంద్రమునుద్దేశించి, నాయనలారా, ఈ మఠము నందు సూర్యచంద్రులు ఉన్నంత వరకు పూజలు జరుగును. ప్రస్తుత మఠాధిపతియైన గోవిందయాచార్యులకు అయిదుగురు ఆడబిడ్డలు జన్మిస్తారు. వారిలో ఈశ్వరమ్మ మహిమాన్విత మాతయై వర్థిల్లుతుంది. మా పుత్రిక యైన వీరనారాయణమ్మ గర్భమున జన్మించిన వారు మా మఠమునకు ధర్మకర్తలై వర్థిల్లుతారు. మా శిష్యుడైన సిద్దయ్య, మహా జ్ఞాన సంపన్నుడు. సిద్దత్వమును సాధించినవాడు. మా తత్వమైన అద్వైతమును బోధిస్తూ, కాలజ్ఞానమును ప్రచారముచేస్తూ, అందరినీ జ్ఞానవంతులను చేస్తూ రాజర్షియై భాసిల్లును. మమ్ములను ఆశ్రయించిన వారు సంతోషవంతమైన జీవనము పొందుదురు అని సెలవిచ్చారు.
 
అనంతరము భక్తుల కోరిక మేరకు కాలజ్ఞాన ప్రభోదము చేసి, శుభముహుర్తము సమీపించుటతో అందరినీ ఆశీర్వదించి, సమాధి లోపలకు వెళ్ళి, అందు అమర్చిన అఖండ జ్యోతిని తన చూపుతో ప్రజ్వలింపజేసి, జ్యోతి ప్రక్కన పద్మాసనముపై ఆశీనులై యోగనిద్రకుపక్రమించారు. జయజయధ్వానాల నడుమ, మంగళవాయిద్యాలు వాయిస్తుండగా సమాధిని భక్తులు మూసివేసారు. అప్పటి నుండి ఆ దివ్య సమాధి పూజలందుకుంటూ భక్తులు పాలిట కల్పవల్లిగా వర్థిల్లుతున్నది. (ఇంకా వుంది)
 
- కొమ్మోజు వెంకటరాజు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి దివ్య ఆశీస్సులతో అన్నప్రసాదానికి ఆధునిక వంటశాల: ముకేష్ అంబాని