ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెళ్ళి సంబంధాలు కుదరడం లేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది.
ఈ వివరాలను పరిశీలిస్తే, హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండానికి చెందిన బూర సురేందర్, రమ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు నరేశ్ (32) హైదరాబాద్ నగరంలోని ఓ బట్టల దుకాణంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కుమార్తెకు వివాహం కాగా, నరేశ్‌కు గత నాలుగేళ్లుగా కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.
అయితే, నరేశ్ ఓ బట్టల షాపులో పనిచేస్తున్నాడనే కారణంతో అతనికి పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలో అనేక సంబంధాలు చూసినప్పటికీ పెళ్లి మాత్రం కుదరలేదు. దీంతో మనస్తాపానికి గురైన నరేశ్... మంగళవారం మధ్యాహ్నం ఘట్‌కేసర్‌లోని మాధవరెడ్డి ఫ్లై ఓవర్ సమీపంలో గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.