రాష్ట్రవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులలో రూ. 1,10,250 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఏబీసీ క్లీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్(ఎవ్రెన్), యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర నోడల్ ఏజెన్సీ, న్యూ & రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్(NREDCAP) అవగాహన ఒప్పందం (ఎంఓయు)చేసుకుంది. ఎవ్రెన్ అనేది బ్రూక్‌ఫీల్డ్ రెన్యూవబుల్స్, యాక్సిస్ ఎనర్జీల మధ్య వరుసగా 51%:49% జాయింట్ వెంచర్ కంపెనీగా ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో NREDCAP వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎం. కమలాకర బాబు, ఏబీసీ క్లీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్(ఎవ్రెన్) చైర్మన్ కటారు రవి కుమార్ రెడ్డి, యాక్సిస్ ఎనర్జీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్. శ్రీ మురళి ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం, 6,500 MW పవన, 6,500 MW సౌర, 6,500 MWh శక్తి నిల్వ, 0.25 MTPA గ్రీన్ హైడ్రోజన్, 1 MTPA దాని ఉత్పన్నాలను రూ. 1,10,250 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో ఎవ్రెన్ అభివృద్ధి చేయనుంది. ప్రతిపాదిత పెట్టుబడులు రాష్ట్రం యొక్క పునరుత్పాదక ఇంధన ఆశయాలను వేగవంతం చేస్తాయి. భారతదేశం యొక్క విస్తృత డీకార్బనైజేషన్ లక్ష్యాలకు దోహదం చేస్తాయి. ఈ ప్రాజెక్టుల నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్తు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలకు(డిస్కమ్‌లు) అందించే పునరుత్పాదక విద్యుత్ వాటాను తీర్చే ఏర్పాటు కలిగి ఉండవచ్చు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబడుతున్న డేటా సెంటర్లు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ తయారీ వంటి వేగంగా విస్తరిస్తున్న కీలక పారిశ్రామిక రంగాలకు విద్యుత్తును సరఫరా చేయడం కూడా లక్ష్యంగా పెట్టుకుంటుంది.