ఈమధ్య కాలంలో పెళ్లి చేసుకున్న జంటలు పట్టుమని 10 నెలలు కూడా గడవకముందే కీచులాటలో లేదంటే ఒకరిపై ఒకరు అనుమానాలు... ఇత్యాది కారణాలతో తమ కాపురాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. తాజాగా బెంగళూరులోని గిరినగర్‌లో కూడా ఇలాంటి ఘటన జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఎనిమిది నెలల క్రితం గగన్ అనే బ్యాంకు ఉద్యోగితో మేఘనకు వివాహం అయ్యింది. మేఘన-గగన్ పెళ్లి నిశ్చితార్థం అయిన దగ్గర్నుంచి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ప్రీ-వెడ్డింగ్ షూట్ కూడా చేసుకున్నారు. వాటిని తమ సోషల్ మీడియా పేజీల్లో షేర్ చేసుకున్నారు.
అలా ఎంతో సందడి సందడిగా గడిపిన వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక ఇద్దరూ బెంగళూరు లోని గిరినగర్ లో కాపురం పెట్టారు. పెళ్లైన కొద్దిరోజులు ఇద్దరూ ఒకరంటే ఒకరు విడిచిపెట్టలేనంతగా వున్నారు. ఐతే రెండుమూడు నెలలు గడవగానే ఇద్దరి మధ్య చిన్నచిన్న గొడవలు తలెత్తడం ప్రారంభమైంది. చిన్న తగాదాకే మేఘన భర్తపై అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది.
ఐతే ఆమె తల్లిదండ్రులు ఎలాగోలా ఒప్పించి తిరిగి గగన్ వద్ద విడిచిపెట్టి వెళ్లారు. ఐతే ఈ గ్యాపులో గగన్ మరో యువతితో సంబంధం పెట్టుకున్నాడంటూ మేఘన ఆరోపించింది. తనను భార్య అలా అనుమానించేసరికి ఓర్చుకోలేని గగన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కోడలు మేఘన వేధింపుల వల్లనే తన కొడుకు ప్రాణాలు తీసుకున్నాడంటూ గగన్ తల్లిదండ్రులు ఆమెపై కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.