తెలంగాణ మంత్రి కొండా సురేఖ - హీరో అక్కినేని నాగార్జునల మధ్య జరిగిన వివాదం టీ కప్పులో తుఫానులా ముగిసిపోయింది. కొండా సురేఖ ఓ మెట్టుదిగి వచ్చి క్షమాపణలు చెప్పడంతో పాటు అక్కినేని నాగార్జునపై ఆమె చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. దీంతో నాగార్జున కూడా శాంతి తన కేసును విత్ డ్రా చేసుకున్నారు.
తనపై అసత్య ఆరోపణలు చేసినందుకుగాను తెలంగాణ మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున హైదరాబాద్ నాంపల్లి కోర్టులో పరువు నష్ట దావా వేసిన విషయం తెల్సిందే. నాగచైతన్య - సమంత విడాకులు అవ్వడానికి తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కారణం అని గతంలో కొండ సురేఖ కామెంట్ చేశారు. 2024 అక్టోబరు 2 హైదరాబాద్ నగరంలోని లంగర్ హౌస్‌లో మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ కామెంట్స్ రాజకీయాల్లో అప్పట్లో పెద్ద దుమారం రేపాయి. తన కుటుంబ పరువుకు నష్టం కలిగించారంటూ హీరో నాగార్జున మంత్రి కొండ సురేఖ పై పరువు నష్టం దావా వేశారు. తమ పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడిన సురేఖ పై బీఎన్ఎస్ సెక్షన్ 356 కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. ఇప్పటికే రెండు సార్లు సోషియల్ మీడియా వేదికగా అక్కినేని కుటుంబానికి క్షమాపణ చెప్పిన కొండ సురేఖ తాజాగా మరోమారు బహిరంగ క్షమాపణ చెప్పారు. దీంతో నాగార్జున తన కేసును విత్‌డ్రా చేసుకున్నారు.