దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుళ్ల ఘటన దేశవ్యాప్తంగా విషాదం నింపగా, కొందరు మాత్రం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసి పైశాచిక ఆనందం పొందారు. ఇలాంటి వారిపై అస్సాం ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
ఈ పేలుళ్లకు సంబంధించి సోషల్ మీడియాలో అనుచిత, అవమానకరమైన పోస్టులు పెట్టిన వారిని గుర్తించే పనిలో అస్సాం పోలీసులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఇలాంటి వారిని రాష్ట్ర వ్యాప్తంగా 15 మందిని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వయంగా వెల్లడించారు.
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనను కీర్తిస్తూ పోస్టులు పెట్టిన వారిపై అస్సాం పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఈ ఉదయం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎక్స్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు.
'ఢిల్లీ పేలుళ్లపై అవమానకరమైన పోస్టులు పెట్టినందుకు అస్సాంలో ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేశాం. నిన్న రాత్రి ఆరుగురిని అరెస్టు చేయడంతో ఈ సంఖ్య 15కి చేరింది' అని ఆయన తెలిపారు. అరెస్టయిన వారిలో బొంగైగావ్‌కు చెందిన రఫీజుల్ అలీ, హైలకండికి చెందిన ఫరీదుద్దీన్ లస్కర్, లఖింపూర్‌కు చెందిన ఇనాముల్ ఇస్లాం, ఫిరోజ్ అహ్మద్, బార్‌పేటకు చెందిన షాహిల్ షోమన్ సిల్దార్, రకీబుల్ సుల్తాన్, హోజైకి చెందిన నసీమ్ అక్రమ్, కమ్రాపూర్‌కు చెందిన తస్లిమ్ అహ్మద్, దక్షిణ సల్మారాకు చెందిన అబ్దుర్ రోహిమ్ మొల్లా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
హింసను కీర్తించే వారిపై అసోం పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని, ఈ విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని ఆయన తన పోస్టులో స్పష్టం చేశారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు.