టీమిండియా సీనియర్ స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వన్డే భవిష్యత్తుపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వీరికి టీమిండియా వన్డే జట్టులో స్థానం దక్కాలంటే.. వారిద్దరూ తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలని స్పష్టం చేసింది. టెస్టులు, టీ20ల నుంచి ఇప్పటికే తప్పుకున్న ఈ ఇద్దరు దిగ్గజాలు ప్రస్తుతం కేవలం 50 ఓవర్ల ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నారు.
ఈ నేపథ్యంలో వారి మ్యాచ్ ఫిట్‌నెస్‌ను నిర్ధారించుకోవడానికే బోర్డు ఈ నిబంధన విధించినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు జట్టు ఎంపిక జరగనున్న నేపథ్యంలో ఈ విషయం ప్రాధాన్యత సంతరించుకుంది.
డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో వీరిద్దరూ ఆడాలని బోర్డు సూచించినట్లు సమాచారం. ఇక బీసీసీఐ ఆదేశాలకు రోహిత్ శర్మ సానుకూలంగా స్పందించాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు తాను అందుబాటులో ఉంటానని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కు సమాచారం ఇచ్చాడు. అయితే, విరాట్ కోహ్లీ మాత్రం తన లభ్యతపై ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.