ప్రేమికుల రోజును ప్రపంచ వ్యాప్తంగా లవర్స్ హ్యాపీగా జరుపుకుంటున్నారు. అయితే కొందరు ప్రేమోన్మాదులు తమ ప్రేమను అంగీకరించని వారిపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేమను అంగీకరించలేదని.. నిరాకరించిందనే కోపంతో యువతి తలపై కత్తితో పొడిచాడు. అంతటితో ఆగకుండా మొహంపై యాసిడ్ పోశాడు.
గౌతమి అనే యువతిపై గణేష్ అనే యువకుడు ఈ అమానుష చర్యకు దిగాడని పోలీసులు తెలిపారు. యువతికి పెళ్లి నిశ్చయం కావడంతో పాటు ఆమె అతడి ప్రేమను నిరాకరించిందని.. అందుకే తలపై కత్తితో పొడిచి.. ముఖంపై యాసిడ్ పోశాడని పోలీసుల విచారణలో తేలింది.
బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ ఆమెను పరిశోధించిన వైద్యులు యువతి పరిస్థితి విషమంగా వుందని చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు దారితీసిందని విచారణలో వెల్లడి అయినట్లు తెలుస్తోంది. కాగా, వచ్చే ఏప్రిల్ 29న బాధితురాలికి వివాహం నిశ్చయించారు. రెండు నెలల్లో పెళ్లి జరగనుండగా ఈ ఘోరం జరిగిందని యువతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.