వేరుశనగ పల్లీలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వాటిలో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని పేదవారి బాదం అని కూడా పిలుస్తారు. వేరుశనగలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
గుండె ఆరోగ్యం మెరుగుపరుస్తుంది: వేరుశనగల్లో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి సహాయపడతాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది: వేరుశనగల్లో ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీని వల్ల అతిగా తినకుండా ఉండవచ్చు, బరువు అదుపులో ఉంచుకోవచ్చు.
మధుమేహానికి మేలు: వేరుశనగలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. అంటే, ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతాయి. మధుమేహం ఉన్నవారికి ఇది చాలా మంచిది.
మెదడు పనితీరుకు సహాయం: వేరుశనగల్లో విటమిన్ ఇ, నియాసిన్, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో తోడ్పడతాయి.
కండరాల నిర్మాణానికి: వేరుశనగల్లో ప్రొటీన్ ఎక్కువగా ఉండటం వల్ల కండరాల కణజాలం తిరిగి నిర్మించడంలో సహాయపడుతుంది. శాఖాహారులకు ఇది ఒక మంచి ప్రొటీన్ మూలం.
ఎముకల దృఢత్వానికి: వీటిలో మెగ్నీషియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.
చర్మం, జుట్టు ఆరోగ్యానికి: వేరుశనగల్లో ఉండే విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడతాయి.
వేరుశనగలు ఎలా తీసుకోవాలి?
వేరుశనగలను వేయించి, ఉడకబెట్టి లేదా నానబెట్టి కూడా తీసుకోవచ్చు. ఉడికించిన లేదా నానబెట్టిన వేరుశనగలు వాటి పోషకాలను ఎక్కువగా నిలుపుకుంటాయి. కానీ వాటిని మితంగా తీసుకోవడం మంచిది, ఎందుకంటే వాటిలో కేలరీలు అధికంగా ఉంటాయి. ఉప్పు లేదా చక్కెర ఎక్కువగా ఉన్న ప్రాసెస్ చేసిన వేరుశనగ ఉత్పత్తులను కాస్తంత దూరంగా వుండటం మంచిది.