సత్తెనపల్లి: తెలుగునాట నాట్స్ సేవా కార్యక్రమాలను ముమ్మరంగా చేస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని మొల్లమాంబ వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. గత ఎనిమిదేళ్లుగా వృద్ధాశ్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులను శ్రీహరి మందాడి ప్రశంసించారు.
మొల్లమంబ వృద్ధాశ్రమానికి నాట్స్ తన వంతు చేయూత అందిస్తుందని శ్రీహరి భరోసా ఇచ్చారు. కన్న తల్లిదండ్రులను ఎవరూ విస్మరించకూడదని శ్రీహరి అన్నారు. పేద వృద్ధులకు మానవత్వంతో సాయం చేయడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. అమెరికాలో నాట్స్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుందని, ముఖ్యంగా పేదల ఆకలి బాధలు తీర్చేందుకు తన వంతు కృషి చేస్తుందని శ్రీహరి తెలిపారు.