Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రీన్ ట్యాక్స్: తెలంగాణలో 500.. ఆంధ్రపదేశ్‌లో 6,660. ఏపీలో భారీ పన్నులపై వాహనదారుల గగ్గోలు

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2023 (11:40 IST)
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ ఇటీవల ‘వారాహి యాత్ర’లో పర్యటిస్తుండగా ఓ లారీ డ్రైవర్ ఆయన దగ్గరకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ ట్యాక్స్ వసూళ్ల మీద ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్ ట్యాక్స్ తెలంగాణలో రూ.500గా ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తమ వద్ద రూ. 6 వేలు వసూలు చేస్తున్నారని ఆయన పవన్ కల్యాణ్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఆరు వేలా, అంత దారుణమా అని పవన్ ప్రశ్నించారు.
 
తమిళనాడులో రూ. 200, తెలంగాణలో రూ. 500 మాత్రమేనని, కానీ, ఏపీలో ఏకంగా రూ.6,660 వసూలు చేస్తున్నారని, చాలా బాధగా ఉందని ఆ లారీ డ్రైవర్ వాపోయారు. ఆ వీడియో వైరల్ అయ్యింది. ముఖ్యంగా ప్రైవేట్ వాహనదారులు ఈ ట్యాక్స్ మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు, తెలంగాణతో పోలిస్తే ఏపీలో వాహనదారుల నుంచి గ్రీన్ ట్యాక్స్ పేరుతో భారీగా వసూలు చేస్తున్నారా అనే అంశాన్ని బీబీసీ పరిశీలించింది.
 
కొత్త చట్టం ప్రకారం..
ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ రూపొందించిన ‘‘ఏపీ మోటార్ వెహికల్ టాక్సేషన్ సవరణ బిల్లు-2021’’కు ఆ ఏడాది నవంబర్ 24న అసెంబ్లీలో ఆమోదం దక్కింది. ఆ తర్వాత వాహనాల మీద పన్నులు సవరించారు. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం, దేశంలోని 5-6 శాతం వాహనాల నుంచే 65 శాతం వరకు కాలుష్య కారకాలు వెలువడుతుండటంతో, వాటిని నియంత్రించడానికి పాత వాహనాలను అదుపు చేసే చర్యల్లో భాగంగా గ్రీన్ ట్యాక్స్ పెంపుదల చేస్తున్నట్టు ఆ బిల్లులో పేర్కొన్నారు. దాన్ని అనుసరించి వివిధ పన్నులు పెంచారు. అందులో లైఫ్ టైమ్ ట్యాక్స్, షార్ట్ టైమ్ ట్యాక్స్, క్వార్టర్లీ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, బోర్డర్ ట్యాక్స్, కాంపోజిట్ ట్యాక్స్ వంటివి ఉన్నాయి.
 
2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పన్నులు పెంచడంతో ప్రభుత్వానికి ఆదాయం భారీగా పెరిగింది. అధికారిక లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ ఆదాయం 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 39.15 శాతం పెరిగింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో రూ. 2,130 కోట్లు వసూలైంది. అంతకుముందు సంవత్సరం అదే కాలానికి వసూలైన పన్నుల మొత్తం కేవలం రూ.1,531.29 కోట్లు మాత్రమే. వాహనాల మీద ఏ మోతాదులో పన్నుల భారం పెరిగిందో ఈ తేడాను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ పన్నుల్లో కేవలం లైఫ్ టైమ్ ట్యాక్స్ ద్వారానే 38.88 శాతం మేర ఆదాయం పెరిగింది. అది 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రూ.1, 215.51 కోట్లకు చేరింది. అదే కాలంలో అంతకుముందు ఏడాది కేవలం రూ.875.20 కోట్లు మాత్రమే వసూలైంది. 2006 నాటి పన్నులను సవరించి కొత్త చట్టం అమలులోకి రావడంతో వాహనాలపై దాదాపుగా అన్ని పన్నులు పెరిగాయి. దానికి తగ్గట్టుగానే రవాణా శాఖ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. అదే సమయంలో వాహనదారులకు ఇది భారంగా మారింది.
 
గ్రీన్ ట్యాక్స్ మాటేమిటి?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రవాణా శాఖ వెబ్ సైట్‌లను పరిశీలిస్తే అధికారికంగా పన్ను సవరణ జరగలేదని కనిపిస్తోంది. చట్ట సవరణ చేసి కొత్త పన్నుల వసూళ్లు జరుగుతున్నా వెబ్‌సైట్లు అప్‌డేట్ చేయలేదని అర్థమవుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ రిజిస్ట్రేషన్ నాటి నుంచి ఏడేళ్లకు మించని వాహనాలకు ఏడాదికి రూ. 200 చొప్పున గ్రీన్ ట్యాక్స్ విధిస్తున్నట్టు వెబ్‌సైట్లలోని సమాచారం చెబుతోంది. ఏడేళ్ళు నిండిన వాహనాలకు మోటార్ సైకిళ్లయితే అయిదేళ్లకు రూ. 250, ఇతర వాహనాలకు అయితే రూ. 500 చొప్పున వసూలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆచరణలో మాత్రం ఇది భిన్నంగా ఉంది.
 
తెలంగాణలో కూడా గ్రీన్ ట్యాక్స్ పెరిగింది. ఏపీలో చట్ట సవరణ చేసి గ్రీన్ ట్యాక్స్‌ను భారీగా పెంచారు. ఆ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సమయంలో, 2021లో నాటి రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ రూ.408 కోట్ల అదనపు పన్నులు రాబట్టబోతున్నట్టు తెలిపారు. సవరించిన పన్నుల ప్రకారం రిజిస్ట్రేషన్ సమయం నుంచి ఏడేళ్లు నిండిన వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ పెరిగింది. 7-10 ఏళ్ల వయసులో ఉన్న వాహనాలకు క్వార్టర్లీ ట్యాక్స్‌పై 50 శాతం మేర గ్రీన్ ట్యాక్స్ వసూలు చేయాలని నిర్ణయించారు. 10-12 ఏళ్ల వయసు వాహనాలకు క్వార్టర్లీ ట్యాక్స్‌తో సమానంగా, 12 ఏళ్లు పైబడిన వాహనాలకు క్వార్టర్లీ ట్యాక్స్‌‌కు రెట్టింపు మొత్తంలో గ్రీన్ టాక్స్ ఉండాలని నిర్ణయించారు.
 
ప్రస్తుతం 16 టైర్లున్న పెద్ద లారీకి క్వార్టర్లీ ట్యాక్స్ రూ.15,400గా ఉంది. అదే ఆరు టైర్ల లారీకి రూ. 4,790 వరకూ ఉంది. దాంతో గ్రీన్ ట్యాక్స్ సగటున ఏడాదికి రూ.2,395 నుంచి రూ. 30,820 వరకూ చెల్లించాల్సి వస్తోంది. పాత వాహనాలకు గ్రీన్ ట్యాక్స్‌తో పాటు కొత్త వాహనాలకు వాటి ఖరీదు రూ. 5 లక్షల లోపు ఉంటే ఒక శాతం, రూ.10 నుంచి 20 లక్షల మధ్య ఉండే వాహనాలపై 3 శాతం, రూ. 20 లక్షల కంటే ఎక్కువ ధర ఉండే లగ్జరీ వాహనాలపై మూడు శాతం చొప్పున పన్ను పెంపుదల జరిగింది. లగ్జరీ వాహనాలపై మొత్తం పన్నులు 18 శాతం వరకూ ఉంటాయి.
 
తెలంగాణలో ఎంత?
తెలంగాణలో కూడా గ్రీన్ ట్యాక్స్ విధించడం కోసం చట్ట సవరణ చేసి ఏపీలో మాదిరిగానే స్లాబులు మార్చారు. 7-10 ఏళ్లు ఒక స్లాబ్, 10-12 ఏళ్లు మరో స్లాబ్, 12 ఏళ్లు నిండిన వాహనాలకు మరో స్లాబ్‌ పెట్టారు. తెలంగాణలోని లారీ యజమానుల సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఏడేళ్ల నుంచి 12 సంవత్సరాలు నిండిన వాహనాలకు ఏడాదికి రూ. 1,500, ఆపై వాహనాలకు రూ. 3 వేలు చొప్పున వసూలు చేస్తున్నారు.
ఏపీలో మూడు స్లాబులు కొనసాగుతున్నాయి. పైగా పన్నులు కూడా ఎక్కువ.
 
లారీ యజమానుల గగ్గోలు
ఆంధ్రప్రదేశ్‌లో ఆటోలు, ఇతర సరుకు రవాణా వాహనాలతో కలిపి ఏడేళ్లు పైబడిన రవాణా వాహనాలు మొత్తం 4.17 లక్షలున్నాయి. మరో 20.31 లక్షల వాహనాలు 15 ఏళ్ల కాలం నిండినవి ఉన్నట్టు అసెంబ్లీలోనే ప్రభుత్వం ప్రకటించింది. వాటి నుంచి 2019-20లో వసూలైన మొత్తం గ్రీన్ ట్యాక్స్ కేవలం రూ. 4.85 కోట్లు మాత్రమే. కొత్త చట్టం అమలులోకి రావడంతో 2022 తర్వాత గ్రీన్ ట్యాక్స్ రూపంలో సుమారుగా రూ.50 కోట్ల పైబడి వసూలవుతోందని రవాణా శాఖ చెబుతోంది. సుమారు 15 ఏళ్ల తర్వాత ఒక్కసారిగా పెరిగిన ఈ పన్నుల భారం మోయలేనంతగా ఉందని లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అంటున్నారు.
 
"నాకు 12 టైర్ల లారీ ఉంది. 11 ఏళ్ల క్రితం కొన్న నా లారీకి పెంచిన పన్నుల వల్ల మూడు నెలలకు ఓసారి రోడ్ ట్యాక్స్ కింద రూ. 43 వేలు కడుతున్నాను. దీనికి అదనంగా పెరిగిన గ్రీన్ ట్యాక్స్ ప్రకారం ఏడాదికి రూ. 22 వేలు కట్టాలి. నేషనల్ పర్మిట్‌కు మరో రూ. 17 వేలు కట్టాలి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కోసం రూ. 50 వేలు అవుతుంది. అన్నీ కలిపితే పన్నులకే ఏడాదికి రూ. 3 లక్షలు అయిపోతుంది. పన్నులు ఇంతగా పెంచేస్తే లారీలు నడపడమే కష్టమవుతోంది. అందుకే చాలా మంది వెహికల్స్ అమ్మేశారు. మేం కూడా ఉన్న లారీలు ఒక్కోటి తగ్గించేస్తున్నాం" అని విజయవాడకు చెందిన లారీ యజమాని వేమూరి రాజేశ్వర రావు చెప్పారు. ముప్పై ఏళ్లుగా ట్రాన్స్‌పోర్ట్ రంగంలో ఉన్న తనకు ఎన్నడూ ఇంతటి గడ్డు పరిస్థితి రాలేదని ఆయన బీబీసీతో అన్నారు. ప్రభుత్వాలు అన్ని పన్నులు పెంచుకుంటూ పోతే తమ కుటుంబాలు నడవడం ఎలా అన్నది అంతుబట్టడం లేదని వాపోయారు.
 
క్యాబ్ ఓనర్లపై మోయలేని భారం: సంఘం
గ్రీన్ ట్యాక్స్ భారం గురించి ప్రభుత్వానికి విన్నవించినా స్పందించడం లేదని ఏపీ ట్యాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ముచ్చకర్ల సత్యనారాయణ అన్నారు. "గ్రీన్ ట్యాక్స్ పేరుతో వసూళ్లు చేసి ఆ నిధులను ప్రభుత్వాలు దేనికి ఉపయోగిస్తున్నాయో అర్థం కావడం లేదు. ఇతర రాష్ట్రాలు గతం కన్నా స్వల్పంగా పెంచి అక్కడ వాహనదారులకు ఊరట కల్పించాయి. కానీ, ఏపీలో మాత్రం ఏడాదికి ఫోర్ ఇన్ ఆల్ క్యాబ్స్‌కు , ఆటోలకు రూ. 4 వేలు చొప్పున, మ్యాక్సీ క్యాబ్‌‌కు రూ. 6,700 వరకూ గ్రీన్ టాక్స్ వసూలు చేస్తున్నారు. ఇతర వాహన పన్నులన్నీ 14 శాతం పెంచేసి, అదనంగా గ్రీన్ ట్యాక్స్ ఈ రీతిలో వసూలు చేయడం దారుణం. కిరాయిలు లేని సమయంలో ట్యాక్స్ చెల్లించలేని వారి మీద అదనపు వసూళ్లు కూడా చేస్తుండటం ఆందోళనకరం" అని ఆయన బీబీసీతో అన్నారు. ఇష్టారాజ్యంగా పెంచిన పన్నులు క్యాబ్ ఓనర్లకు పెనుభారంగా మారాయని, ఈ నిర్ణయం ఉపసంహరించకపోతే ఉద్యమించాల్సి ఉంటుందని సత్యానారయణ తెలిపారు.
 
‘పన్నుల పేరుతో లారీ యజమానుల మనుగడకే ముప్పు తేవొద్దు’
రాష్ట్రంలో రవాణా పన్నుల భారం మోయలేనంతగా ఉందని ఏపీ లారీ యజమానుల సంఘం కార్యదర్శి వైవీ ఈశ్వరరావు అన్నారు. ప్రభుత్వాలు పునరాలోచన చేయాలని కోరారు. "పెరుగుతున్న పన్నులతో లారీల నిర్వహణ కష్టమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో లారీల సంఖ్య తగ్గిపోయింది. అయినప్పటికీ గ్రీన్ ట్యాక్స్ అమాంతంగా పెంచేశారు. తమిళనాడు సహా పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో చాలా ఎక్కువ కట్టాల్సి వస్తోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి నివేదించాలని ప్రయత్నిస్తున్నాం. కానీ ఆయన అవకాశం ఇవ్వడం లేదు. లారీ యజమానుల గురించి ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పటికే నష్టాలతో సతమతమవుతున్న లారీ యజమానులు ఆందోళనతో ఉన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే కార్యాచరణకు పూనుకుంటాం" అని ఆయన బీబీసీకి చెప్పారు. పాత వాహనాలను తాము కూడా ప్రోత్సహించబోమని, అయితే పన్నుల పేరుతో లారీ యజమానుల మనుగడకే ముప్పు తీసుకురావద్దంటూ ఈశ్వరరావు అభిప్రాయపడ్డారు.
 
కేంద్రం మార్గదర్శకాల వల్లే పెంచాం: మంత్రి విశ్వరూప్
గ్రీన్ ట్యాక్స్ పెంపుదల ద్వారా పాత వాహనాలు రోడ్లపైకి రాకుండా నియంత్రించగలమని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. తద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని నాటి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి ఈ బిల్లును ప్రతిపాదించిన సమయంలో అసెంబ్లీలో అన్నారు. "గ్రీన్ ట్యాక్స్ పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఒకటి రెండు రాష్ట్రాలు పెంచకపోవడంతో వారి మీద కేంద్రం నుంచి ఒత్తిళ్లున్నాయి. జాతీయ స్థాయిలో విధానపరంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం లారీ యజమానుల సంక్షేమానికి తోడ్పడుతుంది’’ అని ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు.
 
రవాణా వాహనదారుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన బీబీసీతో అన్నారు. కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల శాఖ ఆధ్వర్యంలో 2021 నాటి గైడ్ లైన్స్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య గ్రీన్‌టాక్స్ లాంటి పన్నుల విషయంలో ఇంత వ్యత్యాసం ఎందుకుందని అడగ్గా, దేశంలో ఒకట్రెండు రాష్ట్రాలు మాత్రమే టాక్స్ పెంచలేదని, వాటిపై కూడా కేంద్రం ఒత్తిడి తెస్తోందని మంత్రి సమాధానమిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న నిర్మాతలు

పవన్ కల్యాణ్ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్‌ వైరల్

అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి: నవ్వొచ్చినా.. ఏడుపొచ్చినా ఆపుకోలేదు..

షారూఖ్ ఖాన్ సరసన సమంత.. అంతా సిటాడెల్ ఎఫెక్ట్

బైరెడ్డితో పెళ్లి లేదు.. అవన్నీ రూమర్సే.. ఆపండి.. శ్రీరెడ్డి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments