Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గద్దర్ మృతి: రాడికల్ ఉద్యమాల నుంచి రాజకీయ పార్టీల వరకు

gaddar
, ఆదివారం, 6 ఆగస్టు 2023 (22:43 IST)
ప్రజా యుద్ధ నౌకగా అభిమానులు పిలుచుకునే ప్రముఖ గాయకులు గద్దర్ మరణించారు. హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ కాలం అతివాద వామపక్ష మద్దతుదారుగా కొనసాగిన గద్దర్ జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. చివరి దశలో ప్రజాస్వామ్య రాజకీయ వాదిగా మారిన తరువాత పలు రాజకీయ పార్టీల్లో పనిచేశారు. అటు వామపక్ష ఉద్యమం, ఇటు తెలంగాణ ఉద్యమం రెండింటినీ ఉర్రూతలూగించిన పాటలు గద్దర్ సొంతం.
 
తిరుగుబాటునే పేరుగా మార్చుకుని..
హిందీ భాషలో గదర్ అంటే తిరుగుబాటు, సైనిక తిరుగుబాటు అనే అర్థాలున్నాయి. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో కమ్యూనిస్టు భావజాలంతో గదర్ పార్టీ కూడా పనిచేసింది. ఆ తిరుగుబాటు అనే పదాన్నే తన వృత్తి పేరుగా తీసుకున్నారు గద్దర్. 1971లో విడుదలైన తన మొదటి ఆల్బం పేరు ఇది. 1948లో మొదక్ జిల్లా తూప్రాన్ దగ్గర జన్మించిన గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. ఆయన దళిత కులంలో పుట్టారు. ఇంజినీరింగ్ చదివారు. ఇంజినీరింగ్ తరువాత బ్యాంకు ఉద్యోగిగా కొంత కాలం పనిచేశారు. ఆయనకు భార్య విమలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. మరొక అబ్బాయి మరణించాడు.
 
బ్యాంక్ ఉద్యోగాన్ని వదిలి విప్లవ బాటలోకి..
మావోయిస్టు పార్టీగా ఏర్పడక ముందు పీపుల్స్ వార్ గ్రూప్ మద్దతుదారుగా సుదీర్ఘ కాలం పనిచేశారు గద్దర్. కొంత కాలం అండర్ గ్రౌండ్‌లో ఉన్నారు. 1975లో బ్యాంకు క్లర్కుగా ఉద్యోగం ప్రారంభించిన గద్దర్, 1984లో ఉద్యోగం వదిలిపెట్టారు. ఆ తరువాత పూర్తి స్థాయిలో జన నాట్య మండలి తరపున పనిచేశారు.
 
ప్రతి పాటా చిరస్మరణీయమే
1980లలోనే గద్దర్ సినిమాల్లో కనిపించారు. బి.నర్సింగ రావు తీసిన మా భూమి సినిమాలో బండెనక బండికట్టి పాట పాడుతూ ఆ సినిమాలో కనిపిస్తారు గద్దర్. నర్సింగ రావు గద్దర్‌ని ప్రోత్సహించారు. 1995లో ఆర్ నారాయణమూర్తి తీసిన ఒరేయ్ రిక్షా సినిమాలో నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మో పాట రాసింది గద్దరే. ఈ పాటకు గానూ ఆయనకు నంది అవార్డు రాగా, ప్రభుత్వ అవార్డులు తీసుకోరాదన్న సిద్ధాంతంతో ఆయన దాన్ని తిరస్కరించారు.
 
2009-2014 నాటి తెలంగాణ ఉద్యమంలో గద్దర్ రాసిన ‘‘అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా..’’ అనే పాట ఎందరినో కదలించింది. 2011వ సంవత్సరంలో దర్శకులు శంకర్ తీసిన జైబోలో తెలంగాణ సినిమాలో పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా పాటకీ అంతే పేరొచ్చింది. తనను ఎన్నడూ వెంటాడుతూనే ఉంటారని సెటైర్లు వేస్తూనే, పోలీసు శాఖలో కింది స్థాయి సిబ్బంది మీద రాసిన పాట ప్రత్యేకంగా నిలిచింది.
 
చనిపోయేవరకు శరీరంలో బుల్లెట్లు
2002వ సంవత్సరంలో మావోయిస్టులు (అప్పట్లో నక్సలైట్లు) అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చల సమయంలో మావోయిస్టుల ప్రతినిధులు గద్దర్, వరవరరావులు వ్యవహరించారు. కేవలం తెలంగాణ మాత్రమే కాకుండా మావోయిస్టు ప్రభావం ఉన్న ఇతర రాష్ట్రాల్లో గద్దర్ హిందీ ప్రదర్శనలు ఇచ్చేవారు. 1997లో గద్దర్ పైన హత్యాయత్నం జరిగింది. ఆ క్రమంలో కొన్ని బుల్లెట్లు ఆయన శరీరంలోనే ఉండిపోయాయి. 1969 తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిగానూ, 2009 తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ గాయకుడిగానూ తన వంతు పాత్ర పోషించారు. 1987 కారంచేడు దళితుల ఊచకోత తరువాత వచ్చిన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.
 
చివర్లో అనేక రాజకీయ పార్టీలతో కలిసి..
ప్రజా జీవితంలో గద్దర్ అనేక రాజకీయ పార్టీల వేదికలపై కనిపించారు. దేవే౦దర్ గౌడ్ నవతెలంగాణ ప్రజా పార్టీ, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ, కాంగ్రెస్-తెలుగుదేశం కూటమి వేదికపైనా కనిపించారు. చివర్లో కేఏ పాల్ పార్టీలో కూడా చేరి, మళ్లీ తప్పుకున్నారు. చివర్లో గద్దర్ ప్రజా పార్టీ పేరుతో ఒక రాజకీయ పార్టీ కూడా ప్రకటించారు. సుదీర్ఘ కాలం ప్రజాస్వామ్య వ్యతిరేక పోరాటంలో ఉన్న గద్దర్ మొదటిసారి ఓటు వేయడం, మొదటిసారి గుడికి వెళ్లడం కూడా అప్పట్లో పెద్ద వార్తలుగా, చర్చలుగా నిలిచాయి. గద్దర్ మరణంపై అన్ని పార్టీల నాయకులూ సంతాపం ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రీమ్‌ఫార్మ్ ప్రారంభంతో ఇ-కామర్స్ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేసిన థిన్‌ కిచెన్