Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాకే భారతికి ఐదు ఎకరాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు ఇచ్చారా? ఈ వార్తలపై ఆమె ఏమన్నారు?

image
, సోమవారం, 31 జులై 2023 (21:59 IST)
ఇటీవల పీహెచ్‌డీ పట్టా అందుకున్న సాకే భారతికి ఐదు ఎకరాల పొలం, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు ఇచ్చినట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై ఆమెతో బీబీసీ సోమవారం (జులై 31న) మాట్లాడింది. అనంతపురం కలెక్టర్ గౌతమి తమను పిలిపించి రెండు ఎకరాల పొలం పట్టా ఇచ్చారని, జూనియర్ లెక్చరర్ పోస్టు ఇస్తామని చెప్పారని బీబీసీతో భారతి చెప్పారు. "పీహెచ్‌డీ చేస్తున్నప్పుడే ఎస్‌కే యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బ్యాక్ లాగ్ కింద అప్లై చేశాను. ఆ పోస్ట్ ఇవ్వాలని అడుగుతున్నాను. బ్యాక్ లాగ్‌లో కూడా ఆ పోస్టు ఇంకా ఖాళీ ఉంది. కానీ కలెక్టర్ గుత్తిలో జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. దానికి నేను ఏమీ చెప్పలేదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు కావాలని అడిగితే, వీసీని కలవండని చెప్పారు. మేము ఇంకా వీసీని కలవలేదు’’ అని ఆమె తెలిపారు.
 
పీహెచ్‌డీ పట్టా అందుకున్న నేపథ్యంలో జులై 21న బీబీసీ అందించిన కథనం ఇది!
పూతలు వేయని నాలుగు గోడలున్న ఒక చిన్న గది. లోపల సగం మట్టి నింపి, సగం గుంతలా ఉంది. దాని ముందు వాలుగా దించిన రేకులు. వాటికి అడ్డం పెట్టిన సిమెంటు రేకులు. అందులోనే వారు వంట చేసుకోవడం, రాత్రైతే పడుకోవడం కూడా అక్కడే. పీహెచ్‌డీ చేసిన పేద మహిళగా ఇటీవల వార్తల్లో నిలిచిన సాకే భారతి ఉంటున్న ఇల్లు ఇది. భర్త శివప్రసాద్, కూతురుతో కలిసి ఆమె అందులోనే జీవిస్తుంటారు.
 
అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని మారుమూలన ఉండే పల్లె నాగుల గుడ్డంలోని ఈ ఇరుకైన గదిలోనే కింద మట్టిపై కూర్చుని ఇన్నాళ్లూ చదువుకుంటూ వచ్చారు భారతి. ఇప్పుడు పీహెచ్‌డీ అందుకుని తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. స్లిప్పర్స్ వేసుకుని వెళ్లి గవర్నర్ చేతులమీదుగా పీహెచ్‌డీ అందుకున్నారు భారతి. ఇన్నాళ్లూ ఎవరూ పట్టించుకోని ఆమె కుటుంబం ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. సాకే భారతి గురించి మీడియాలో వార్తలు రావడంతో స్థానికులు, ఇతర నాయకులు వారికి అండగా ఉంటామని, ఆర్థిక సాయం అందిస్తామని వస్తున్నారు. పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు ఆమెను అభినందిస్తున్నారు.
 
ఆమె ఇంటి దగ్గర స్థానిక నాయకులు, కుల నాయకులు, మీడియా ప్రతినిధులతో సందడిగా ఉంది. అన్నం తినడానికి కూడా సమయం లేకుండా, వచ్చిన వారితో మాట్లాడుతూనే ఉన్నారు భారతి, ఆమె కుటుంబ సభ్యులు. భారతి తండ్రికి ముగ్గురు ఆడపిల్లలు. ఆయన వారిని పోషించలేని పరిస్థితుల్లో వాళ్ల అమ్మమ్మ ఊరు నాగులుగుడ్డంకు ఆరేళ్ల బిడ్డప్పుడే తీసుకొచ్చాడు ఆమె తాత (తల్లి తండ్రి). దీంతో భారతి చిన్నతనం నుంచే అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరిగారామె. అక్కడే అమ్మకు సొంత తమ్ముడైన శివప్రసాద్‌ను పెళ్ళి చేసుకున్నారు. తర్వాత చదువు కొనసాగించారు.
 
రేషన్ బియ్యం, కారం మెతుకులు
‘‘అమ్మకు ముగ్గురు ఆడపిల్లలు. నాన్న తాగుడుకు బానిస. ఆడపిల్లలను ఎందుకు కన్నావని అమ్మను వేధించేవాడు. దీంతో అమ్మ కూలి పనులకు వెళ్తుండేది. ఇవన్నీ చూసి మా తాత అంటే అమ్మ వాళ్ల నాయన, నన్ను ఆరేళ్ల వయసులోనే తన ఇంటికి తీసుకొచ్చేశాడు. మా తాతయ్యే పదో తరగతి వరకూ చదివించాడు. 2006లో పదో తరగతి ఫలితాలు రాగానే మా మేనమామతో పెళ్లి చేశారు. పెళ్లి అయ్యాక కూడా ఒక రోజు కూలికి, మరో రోజు కాలేజీకి వెళ్లేదాన్ని. లేదంటే పూట గడవని పరిస్థితి. కారం మెతుకులు, రేషన్ బియ్యంతోనే గంజి కాసుకుని తాగేవాళ్లం.’’ అంటూ తన చిన్ననాటి పరిస్థితులు గుర్తు చేసుకున్నారు భారతి.
 
ఒకవైపు చూసుకోవాల్సిన వృద్ధులు, భర్త, కుటుంబం. కూలికి వెళ్లకపోతే ఇల్లు జరగడం కష్టం. మరోవైపు చదువు కొనసాగించాలనే తపన. కాలేజీకి వెళ్లాలంటే ఆటో చార్జీలు, పుస్తకాలు ఫీజుల లాంటి ఖర్చులు...వీటి మధ్యే వెనకడుగు వేయకుండా కష్టపడ్డారు భారతి. ‘‘అక్క అంత కష్టపడింది కాబట్టే ఇప్పుడు ఈ స్థాయికి చేరుకోగలిగిందని’’ భారతి చెల్లెలు జ్యోతి అన్నారు. అంతకు ముందు తమ బాగోగులు కూడా పట్టించుకోనివారు, ఇప్పుడు మాత్రం మెచ్చుకుంటున్నారని అన్నారు.
 
‘‘చాలా తిప్పలు పడింది. ఎవరూ పడలేదు. చిన్నప్పట్నుంచి కష్టాలే. కూలికిపోతూ ఇంట్లో కష్టపడుతూనే కాలేజీకి వెళ్లేది. ఇక్కడ ఉన్న అందరూ ఇంతకు ముందు ఎగతాళి చేసిన వారే. ఇలా ఉన్నారేంటి, ఇలా చేస్తున్నారేంటి అన్నవాళ్లే. ఇప్పుడు మా అక్క ఇంత సాధించిన తర్వాత బాగా మాట్లాడుతున్నారు. ఇన్నాళ్లూ ఆమె పడిన కష్టాలు ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఇప్పుడు అక్క సాధించిన దానిని చూసి సంతోషంగా ఉంది. ఆమె కష్టానికి ఫలితం దక్కింది’’అని జ్యోతి చెప్పారు
 
తాత పంతం
‘‘నీ ఇంటి ఆడపిల్లనే తీసుకెళ్లి చదివిస్తా’’ అంటూ భారతి తండ్రితో శపథం చేశాడు ఆయన మామ. ఐదవ తరగతి వరకూ నాగులగుడ్డంలో చదివారు భారతి. పదో తరగతి శింగనమలలో పూర్తి చేశారు. ఇంటర్ పామిడిలో, డిగ్రీ, పీజీ అనంతపురం ఎస్ఎస్‌బీఎన్‌లో, తర్వాత పీహెచ్‌డీని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో చేశారు. ఎన్నో ఏళ్లగా అటు కూలి పనులు, ఇటు చదువు బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన భారతి ఉదయం 9 గంటలకు వెళ్తే సాయంత్రం 6 గంటలకు ఇల్లు చేరేవారు. ఆ తర్వాత ఇంటి పనులన్నీ చేసుకునేవారు. తాత పట్టుబట్టి చదివించడం వల్లే ఇప్పుడు ఈ స్థాయికి చేరానంటారు భారతి.
 
‘‘చదువుకుంటే ఇలా అవుతావు. చదువుకోకపోతే మీ అమ్మలా కూలి పనికి వెళ్లాల్సి ఉంటుంది అని మా తాత చిన్నప్పటి నుంచీ మాకు చెబుతూ వచ్చాడు. చదువుకుంటేనే నీ కాళ్ల మీద నువ్వు నిలబడి నీ బిడ్డలకు కూడా మంచి దారి చూపించగలవు అన్నాడు. నీ ఇంట్లో ఆడపిల్లనే తీసుకెళ్లి నేను చదివించి నిరూపిస్తాను చూడు అని మా నాన్నతో శపథం చేశాడు. ఆయన ప్రోత్సాహంతో కూలీనాలికి వెళ్తూ నేను చదువు కొనసాగించా’’ అంటూ వివరించారు భారతి.
 
భారతి భర్త శివ ప్రసాద్‌కి భారతి కంటే ఎక్కువ వ్యూహం ఉంది. చదువు ప్రాధాన్యత బాగా తెలిసిన శివ ప్రసాద్ భార్య చదువు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఆమెను చదివించాడు. ఆమెకు సీటు తెప్పించడం కోసం తన ప్రయత్నాలు చేశాడు. అటు శివ ప్రసాద్ తండ్రి అంటే భారత తాత, మామ కూడా కోడల్ని చదువు విషయంలో ప్రోత్సహించేవాడు. ఎఱుకుల తెగ కావడం, మరో పక్క పేదరికం, అందులోనూ పెళ్లి తర్వాత కాలేజీకి వెళ్లి చదువుకుంటూ ఉండటంతో ఎన్నో అవమానాలు భరించారు భారతి. కానీ తమ తాతయ్య అవన్నీ పట్టించుకోవద్దని.. చదువుపై దృష్టి పెట్టమని చెప్పేవాడని తెలిపారు.
 
‘‘ఎంతైనా క్యాస్ట్ ఫీలింగ్ ఉంటది కదా సర్..’’ అంటూనే నాతో బాగానే మాట్లాడేవారు.. అంటూ చెప్పుకొచ్చారు భారతి. ‘‘పెళ్లి చేసుకున్నాక, చదువెందుకు. ఇంట్లో మూల కూర్చోక ఎక్కడకు పోతున్నావ్. ఇప్పుడు చదివి ఏం ఉద్ధరించాలి అనేవాళ్లు. మేమంతా ఉద్ధరించింది చాలదా, చదువు తర్వాత పెళ్లిళ్లు, పిల్లలతో పొలం పనులు చేసుకుంటున్నాం, ఇప్పుడు నీకు చదువెందుకు అనేవాళ్లు. దాంతో నాకు చాలా బాధేసేది. నేను మా తాతతో చిన్న వయసులోనే నాకు ఎందుకు పెళ్లి చేశారు. నేను ఇప్పుడు చదువుకుంటే సూటిపోటి మాటలు అంటున్నారు. చదువుకున్న తర్వాతే పెళ్లి చేసుకునేదాన్ని కదా అని చెప్పి ఏడ్చేదాన్ని’’
 
పార్ట్ టైమ్ ఉద్యోగం కూడా ఎందుకు చేయలేకపోయారు?
ఇప్పుడు భారతి కథ చూసిన వారిలో చాలా మంది ఈ ప్రశ్న వేస్తున్నారు. పై చదువులు చదువుతున్న సమయంలో కుటుంబ భారం కూడా తనపై ఉండడంతో ఉద్యోగం వెతుక్కునే అవకాశం కూడా లేకపోయిందని భారతి చెప్పారు. ‘‘పనికిపోయి సంపాదించాలి, కాలేజీకి వెళ్లాలి.. మధ్యలో ప్రిపరేషన్ అనేదే లేకుండా పోయింది. స్టడీస్ కంప్లీట్ చేయడమే భారంగా మారింది. అందుకే వేరే ఉద్యోగాల గురించి ఆలోచించలేదు. అలాగే పీహెచ్‌డీ కంటిన్యూ చేశాను. పీజీ చేసేటప్పుడే పాప పుట్టింది. అప్పడికి తాత, అవ్వ వాళ్లు పెద్దోళ్లయిపోయారు. పిల్లని నేనే చూసుకోవాల్సి వచ్చింది. ఇంట్లోకి అన్నీ తెచ్చుకోవాలి, పనికి పోవాలి,కాలేజీకి వెళ్లాలి. దాంతో ఉద్యోగం వెతుక్కోవడం కష్టమైపోయింది’’ అన్నారామె.
 
కంకర కొడుతూ భార్యను చదివించిన భర్త
పదో తరగతిలో భారతి స్కూల్ ఫస్ట్ వచ్చినా, మేనమామ శివప్రసాద్‌తో పెళ్లి చేశారు. కానీ భారతికి చదువుపై ఉన్న ఆసక్తిని చూసి ఆయన ఆమెను చదివించారు. ఐదు సార్లు పదో తరగతి ఫెయిల్ అయిన తనకు చదువు విలువ తెలుసని శివప్రసాద్ చెప్పారు. ‘‘ఐదు సార్లు పది ఫెయిలైనప్పుడు నాకు ఇక చదువు రాదని నిర్ణయించుకున్నా. నా భార్య 9వ తరగతి వచ్చినపుడు లెక్కలు బాగా చేస్తుంది. నోట్స్ చూస్తే అక్షరాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. సరే ఈయమ్మను ముందుకు చదివించాలి అనుకున్నా. ఎవరికీ చెప్పలేదు. బాగానే చదువుతోంది అనుకున్నా. సార్‌ను కూడా అడిగా. పదో తరగతిలో పోటీపడి చదవమని చెప్పాను. చూద్దాం అనింది. పనులకు కూడా వెళ్తూ వచ్చింది. అయినా రాత్రిళ్లు వేరే వాళ్ల నోట్స్ తెచ్చుకుని చదువుకునేది. అలా పదో తరగతిలో ఫస్ట్ క్లాస్ వచ్చింది. దాంతో నేను ఈమెను చదివించడం ఆపకూడదనుకున్నా. పది కాగానే పెళ్లైంది. కానీ చదువు మాత్రం ఆపకూడదని మా నాయన, నేనూ నిర్ణయించుకున్నాం’’అని భారతి భర్త చెప్పారు.
 
శివప్రసాద్ మొదట్లో కంకర కొట్టడం, చెట్లు కొట్టడం లాంటి కూలి పనులకు వెళ్లేవారు. ఇప్పుడు రెడ్ ఆక్సైడ్ వెలికి తీసే పనులకు నైట్ డ్యూటీలకు కూడా వెళ్తుంటారు. భారతిని చదివించడానికి ఎంతో కష్టపడ్డానని ఆయన చెబుతున్నారు. ‘‘ఇంత చదువుకు ఉద్యోగం చేస్తేనే కదా ఫలితం. 20 సంవత్సరాలు చదివిన చదువుకు ప్రభుత్వం ఏం చేస్తుందా అని నేను ఆలోచిస్తున్నా. నా భార్య చదువుకోవడం అనేది ఒక రోజు కష్టం కాదు. 20 ఏళ్ల పాటు వరసగా కష్టాలే. మాకు ఇప్పటికీ కడుపునిండా తినలేని పరిస్థితి. ఒక్కోసారి ఏమీ ఉండదు. ఇవన్నీ చెప్పుకోలేని పరిస్థితి. ఒక్కోసారి ఏం తినేవాడ్ని కాదు. రెండు గంటలే నిద్రపోయేవాడిని. పడుకుంటే తను కాలేజీకి వెళ్లాలి కదా అనిపించేది. చదివించడానికి అందరం కష్టపడ్డాం’’ అన్నారు శివప్రసాద్.
 
భారతి చదువుకుంటుంటే అయినవారు, ఊళ్లో వాళ్లు ఎన్నో మాటలు అనేవారని శివప్రసాద్ కూడా చెప్పారు. ‘‘మనకు ఎవరు ఉద్యోగాలిస్తారు. కూలి పనులకు పోతే జరిగిపోతుందిగా.. మళ్లీ నీకు చార్జీలు, అన్నీ ఖర్చులు వేస్ట్ కదమ్మా అని చాలా మంది అన్నారు. కానీ ఆమె ఏం మాట్లాడేది కాదు, వాళ్లకు సమాధానం చెప్పేది కాదు. చెప్పినా అర్థం చేసుకునేవాళ్లు కాదు. నాతో కూడా అనేవారు కానీ నేను పట్టించుకునేవాడ్ని కాను. ఏం తీసుకొస్తుంది నీకు.. వృథా ఖర్చులు ఎందుకు పెడతావ్ అనేవాళ్లు. పోనీలే చూద్దాం అనేవాడ్ని. చదువు అన్నం పెడుతుంది అనుకున్నాం. ఇక వేరే ఆశలేమీ లేవు’’అంటారు శివప్రసాద్.
 
ప్రొఫెసర్ కావాలనే ఆశ:
కెమిస్ట్రీలో ‘‘ఎ స్టడీ ఆఫ్ బైనరీ లిక్విడ్ మిక్చర్స్’’ అనే అంశంపై ప్రొఫెసర్ శుభ నేతృత్వంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు భారతి. ప్రొఫెసర్ కావాలనేది ఆమె కల.
‘‘నాకు ప్రొఫెసర్‌గా ఉద్యోగం వస్తే మా పాపను మా లాంటి పేదలకు ఎవరికైనా అనారోగ్యం చేస్తే, చికిత్స అందించేలా డాక్టరును చేయాలని అనుకుంటున్నా. మా వాళ్లు కూడా డబ్బులు లేక, డాక్టరుకు చూపించుకునే స్థోమత లేక చనిపోయారు సర్.. డబ్బు ఉంటే నేనే డాక్టర్ చదివేదాన్ని, కానీ ఏదో ఒకటి చదువుకుంటే రాణించవచ్చని అనుకున్నా’’ అని భారతి చెప్పారు.
 
తను పీహెచ్‌డీ పూర్తి చేయడానికి ప్రొఫెసర్ డాక్టర్ శుభ, ఆమె భర్త తనకు ఎంతో సాయం చేశారని భారతి చెప్పారు. పేదరికంలో ఉన్న తనకు ఒక్కోసారి ఖర్చులకు ఇచ్చేవారని, తోటి విద్యార్థులు, ఇతర ప్రొఫెసర్లు అందరూ సాయం చేయడం వల్లే పీహెచ్‌డీ పూర్తి చేయగలిగానని తెలిపారు. ఆడపిల్లలను ఎవరూ తక్కువచేయవద్దని భారతి చెబుతున్నారు. ‘‘ఆడపిల్లలు పుట్టారని హీనంగా చూడకుండా తల్లిదండ్రులు వాళ్లను చక్కగా చదివించాలి. చిన్నప్పుడే పెళ్లి చేయకండి. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడిన తర్వాతే చేయండి. ఆడపిల్లలు కూడా తల్లిదండ్రులు చెప్పినట్లు చదువుపై దృష్టి పెట్టి శ్రద్ధగా చదువుకోవాలి. అప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుంది.’’ అని ఆమె చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగళూరు ప్రజా రవాణా, BMTC అధునాతన ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది