సాధారణ నటుడు నుంచి హీరోగా ఎదిగి అనంతరం సూపర్‌స్టార్ కృష్ణగా పేరు తెచ్చుకున్న ఘట్టమనేని కృష్ణ పుట్టిన రోజు ఈరోజే. 31 మే, 1943న బుర్రిపాలెంలో జన్మించారు. ఆయన జీవితాన్ని పరికిస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘటన ఆయనకే దక్కింది. తెలుగు సినిమా జేమ్స్‌బాండ్, కౌబాయ్ ఆయనే. అందుకే ఆయన చిత్రసీమను సాంకేతికంగా మెట్టు ఎక్కేలా చేశారు. ఆయన సాహసానికి మారు పేరు. ఆయన చేసిన అల్లూరి సీతారామరాజు గురించి ఎంత చెప్పినా తక్కవే. అప్పట్లో కలర్ సినిమాలను గొప్పగా చెప్పకునేవారు. అలాంటి టైంలో `సింహాసనం` సినిమాను తొలి 70ఎం.ఎం. చిత్రంగా మలిచిన ఘనత ఆయనదే. బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పిలహరిని తెలుగులోకి ప్రవేశపెట్టింది ఆయనే.
ముందు కొన్ని చిత్రాలలో బిట్ రోల్స్ లో కనిపించారు కృష్ణ, ఆ సినిమాలలో ఆయన నవ్వు చిత్రంగా వుండేది. నటన ఆకట్టుకునేది. అందుకే 1964లో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తెలుగులో కృష్ణను హీరోగా పరిచయం చేశారు. ఆయన దగ్గర అసిస్టెంట్ గా వున్న కె. విశ్వనాథ్ తెలుగు డైలాగ్‌లు ఎలా చెప్పాలో కృష్ణకి నేర్పారు. అలాగే డాన్స్ ఎలా చేయాలో నృత్య దర్శకులు హీరాలాల్ నేర్పించారు. అలా చేసిన సినిమానే `తేనె మనసులు`. ఆ తర్వాత కన్నెమనసులు, పాడిపంటలు, గూఢచారి 116, చుట్టాలున్నారు జాగ్రత్త, అగ్ని పర్వతం, ఈనాడు, వజ్రాయుధం వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలు చేశారు. కృష్ణ సరసన దాదాపు 80 మంది హీరోయిన్లు నటించారు. అందులో 47 సినిమాలలో విజయనిర్మల హీరోయిన్. ఇక అప్పట్లో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు సినీపరిశ్రమతోపాటు ఆయన విరాళాలు అందజేశారు. హీరోగా మాత్రమే నటిస్తానని భీష్మించుకోకుండా తన వద్దకు చేరిన ప్రతీపాత్రను అంగీకరిస్తూ ముందుకు సాగారు కృష్ణ. నాటి మేటి నటులు యన్టీఆర్, ఏయన్నార్ స్థాయి విజయాలను చవిచూడాలని కృష్ణ భావించారు. ఆయన్ను 2009లో కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది.
నిర్మాతలకు వెన్నుదన్నుగా వుండేవారు. తన సినిమాలు కొన్ని ఆడకపోతే మరో సినిమాకు వారికి డేట్స్ ఇచ్చేవారు. నిర్మాతలను ఇబ్బంది పెట్టని హీరోగా మంచి వ్యక్తిత్వం వున్న వాడిగా కృష్ణ పేరు తెచ్చుకున్నారు. ఆయన జీవితంలో వెన్నుదన్నుగా వున్నది ఆయన సోదరులు జి.హనుమంతరావు, జి.ఆదిశేషగిరిరావు. నిర్మాతలుగా పద్మాలయా సంస్థను ఏర్పాటు చేశారు. ఆరంభంలోనే అగ్నిపరీక తీసి చేతులు కాల్చుకున్న అన్నదమ్ములు తరువాత రంగుల్లో సినిమా నిర్మించాలని తపించారు. తెలుగులో తొలి కౌబోయ్ మూవీగా మోసగాళ్ళకు మోసగాడు నిర్మించారు కృష్ణ సోదరులు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. తరువాత ప్రభాకర్ రెడ్డి అందించిన కథతో జయప్రద పిక్చర్స్ పతాకంపై పండంటి కాపురం నిర్మించారు. ఈ సినిమా అనూహ్య విజయం సాధించి, 1972 సంవత్సరం బ్లాక్ బస్టర్ గా నిలచింది. తాము కోరుకున్న విజయం దరి చేరగానే కృష్ణ, ఆయన సోదరులు సంతోషించారు.
అయితే అల్లూరి సీతారామరాజు సినిమా చేశాక ఇలాంటి సినిమా చేశాక నిన్ను మరో పాత్రలో జనాలు చూడలేరని అనేవారు. ఆయన అన్నట్లుగానే తరువాత దాదాపు 12 చిత్రాలు పరాజయం అయ్యాయి. ఆ తరువాత కృష్ణ సొంత చిత్రం పాడిపంటలు (1976)తో మళ్ళీ ఆయన సక్సెస్ ట్రాక్ ఎక్కారు. యన్టీఆర్, ఏయన్నార్ తమ అభిరుచికి తగ్గ చిత్రాలను నిర్మించడానికి సొంత నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేసుకున్నారు. కృష్ణ ఆ బాటలో వెళ్ళి పద్మాలయ స్టూడియోను సంస్థను స్థాపించి ఎందరికో పని కల్పించారు. హిందీలోనూ సినిమాలు నిర్మించారు. కృష్ణ తాను తొలిసారి దర్శకత్వం వహిస్తూ సింహాసనం చిత్రాన్ని హిందీ, తెలుగు భాషల్లో నిర్మించారు. హిందీలో జితేంద్ర హీరో కాగా, తెలుగులో కృష్ణనే కథానాయకుడు.
krishna
కృష్ణ దర్శకత్వంలో రూపొందిన “ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం, మానవుడు-దానవుడు” వంటి చిత్రాలు సైతం పద్మాలయా పతాకంపైనే రూపొందాయి. అదేవిధంగా ఆ సమయంలో తన కొడుకులు రమేష్, మహేష్‌ను కూడా నటనలో దింపారు. ఇక ప్రస్తుతం ఆయన నటనకు దూరంగా వున్నారు. తన వయస్సు సహకరించక ఆయన సినిమాలు మానుకున్నారు. అందుకే సరిలేరునీకెవ్వరూ సినిమాలో కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు క్లిప్‌ను పెట్టుకుని ఆయన నటించిచనట్లు చెప్పుకొచ్చారు.
అందుకే ఎలాగైనా పద్మాలయ పతాకంపై మరలా కృష్ణ ఓ కీలక పాత్రలో నటించేలా చేయాలని మహేష్ చూస్తున్నారు. ఇందుకు న్రమత కూడా సన్నాహాలు చేస్తుందని వినికిడి. అది బహుశా త్వరలో రాబోతుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్ సంస్థ ఓ సినిమా మహేష్‌బాబుతో నిర్మించనుంది. కరోనా తర్వాత సెట్‌పైకి వెళ్ళనుంది. ఆ సంస్థ ఈరోజు కృష్ణకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ విడుదల చేసింది. బహుశా ఈ సినిమాలో కృష్ణ ఏదైనా పాత్ర పోషించనున్నట్లు ఫిలింనగర్‌లో వార్త వినపడతోంది.