Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబు నివాళులు: ఎన్టీఆర్ జీవితం భావితరాలకు దిక్సూచి

Advertiesment
NTR Ghat
, శుక్రవారం, 28 మే 2021 (11:49 IST)
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త‌ ఎన్.టి.రామారావు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ప‌లువురు నేత‌లు ఆయ‌న‌కు నివాళులు అర్పించారు. ముఖ్యంగా, టీడీపీ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తించుకున్నారు.
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఎన్టీఆర్‌ తెలుగు ప్రజల ఆస్తి, వారసత్వమన్నారు. ప్రజల అవ‌స‌రాల‌ను గుర్తించి అందుకు త‌గ్గ‌ పథకాలు రూపొందించారన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్ల వంటి వాటిని దూరదృష్టితో ఆలోచించి తీసుకొచ్చారని గుర్తుచేశారు. 
 
అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో ఎన్టీఆర్‌ పేరు చిరస్థాయిగా నిలిపోతుందన్నారు. ఎన్టీఆర్‌ జీవితం భావితరాలకూ దిక్సూచి అని చెప్పారు. ఆయ‌న  లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత  రాజీ పడకుండా దాన్ని సాధించేవార‌ని గుర్తుచేశారు. 
 
అలాగే నారా లోకేశ్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ జీవితం అప్పుడప్పుడూ స్మరించుకునే చరిత్ర కాదన్నారు. 'ఎన్టీఆర్ గారి జీవితం ప్రతిరోజూ చదవాల్సిన స్ఫూర్తి పాఠం. ఒక సామాన్యుడి స్థాయి నుంచి అసామాన్యుడిగా, అసాధ్యుడిగా, చారిత్రాత్మక నాయకుడిగా ఎదిగేందుకు  కృషి, క్రమశిక్షణ, పట్టుదల, నిజాయతీలను తన వ్యక్తిత్వంలోనూ, జీవితంలోనూ భాగం చేసుకున్నారు' ఎన్టీఆర్ అని లోకేశ్ చెప్పారు.
 
'సాటి మనిషిని నిస్వార్థంగా ఆదుకోవడంలో ఎన్టీఆర్‌గారే నాకు స్ఫూర్తి. బడుగు వర్గాలకు అన్నివిధాలా అండగా నిలిచి, వారి ఎదుగుదలకు ప్రాణం పోసిన మహానాయకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మానవతావాది ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని సమసమాజ స్థాపనకు కృషిచేద్దాం' అని లోకేశ్ ట్వీట్ చేశారు.
 
ఇదిలావుండగా, శుక్రవారం ఉద‌యం ఎన్టీఆర్ ఘాట్‌‌లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. అలాగే, ఎన్టీఆర్ కుమారులు కూడా నివాళులు అర్పించారు. 
 
ఈ సందర్భంగా మాజీ మంత్రి మోత్కుపల్లి మాట్లాడుతూ.. వ్యవస్థ బాగు పడాలని, అవినీతి రహిత పాలన అందించాలని ఎన్టీఆర్ ప‌రిత‌పించేవార‌ని చెప్పారు. తాను ఇప్పుడు ఇత‌ర‌ పార్టీలో ఉన్నప్ప‌టికీ ఎన్టీఆర్‌ శిష్యుడిగా ఆయ‌న‌ జయంతి నాడు ఆయ‌న‌ను స్మరించుకుంటున్నానని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో 2 లక్షల దిగువకు కరోనా కేసులు.. 44 రోజుల కనిష్ట స్థాయికి