మే 31 అంటే సూపర్ స్టార్ అభిమానులకు పండుగ రోజు. సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు కావడంతో ప్రతి ఏడాది మే 31న మహేశ్ సినిమాలకు సంబంధించి ఏదో ఒక అప్‌డేట్ విడుదల అయ్యేది. దాంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యేవాళ్లు. ఈ ఏడాది కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట నుంచి స్పెషల్ అప్‌డేట్ వస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఏడాది కరోనా పరిస్థితుల దృష్ట్యా మే 31న సర్కారు వారి పాట నుంచి ఎలాంటి అప్‌డేట్ ఉండబోదని మహేశ్ బాబు టీమ్ క్లారిటీ ఇచ్చింది. మే 31 అన్ని వేడులకను రద్దు చేసినట్లు అధికారికంగా పేర్కొంది.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సర్కారు వారి పాట నుంచి ఎలాంటి అప్‌డేట్‌ను విడుదల చేయకూడదని నిర్మాతలు నిర్ణయించారు. సినిమా అప్‌డేట్ ఇవ్వడానికి ఇది సరైన సమయం కాదని వారుభావిస్తున్నారు. అంటూ మహేశ్ బాబు టీమ్ ప్రకటన విడుదల చేసింది. ఎలాంటి అనధికారిక, తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేయకూడదని కోరింది. ఏదైనా సమాచారం ఉంటే అధికారిక ఖాతాల ద్వారానే వస్తుందని తెలియజేశారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా పరశురాం దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్‌తో కలిసి ఘట్టమనేని మహేశ్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.