తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ జూలై 27న డిశ్చార్జ్ అవుతారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. జూలై 21 నుండి చెన్నైలోని అపోలో హాస్పిటల్స్‌లో వైద్య సంరక్షణలో సీఎం స్టాలిన్ వున్న సంగతి తెలిసిందే. వాకింగ్ సమయంలో అకస్మాత్తుగా తలతిరగడం వల్ల ఆసుపత్రిలో చేరారు.
ఈ క్రమంలో యాంజియోగ్రామ్‌తో సహా వరుస రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహించారు వైద్యులు. యాంజియోగ్రామ్ ఫలితాలు సాధారణంగా ఉన్నాయని, ముఖ్యమంత్రి ఆరోగ్యం స్థిరంగా ఉందని ఆసుపత్రి విడుదల చేసిన మెడికల్ బులెటిన్ నిర్ధారించింది.
ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జి. సెంగొట్టువేలు నేతృత్వంలోని వైద్య నిపుణుల కమిటీ సిఫార్సు ఆధారంగా జూలై 24న స్టాలిన్ చికిత్స చేయించుకున్నారని ఆ ప్రకటనలో పేర్కొంది.
ఆసుపత్రిలో చేరినప్పటికీ, 71 ఏళ్ల ముఖ్యమంత్రి ప్రభుత్వ వ్యవహారాలను పర్యవేక్షించడం, ఆసుపత్రి నుండి తన విధులను నిర్వర్తించడం కొనసాగించారు. చివరి నిమిషంలో వైద్య పరిశీలనలు మినహా, ముఖ్యమంత్రి ఆదివారం డిశ్చార్జ్ అవుతారని ఆసుపత్రి వర్గాలు సూచిస్తున్నాయి.
డిశ్చార్జ్ అయిన తర్వాత, ఆయన కొన్ని రోజులు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ క్రమంగా పూర్తి అధికారిక బాధ్యతలను తిరిగి చేపట్టే అవకాశం ఉంది. ఇంతలో, సీనియర్ క్యాబినెట్ మంత్రులు ప్రభుత్వం సజావుగా పనిచేయడానికి ఆయనతో సన్నిహితంగా సమన్వయం చేసుకుంటున్నారు.