Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యా, అమెరికా, బ్రిటన్, చైనాల్లో అణ్వాయుధాలను నొక్కే బటన్ ఎవరి అధీనంలో ఉంటుంది?

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (11:47 IST)
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్‌పై సైనిక చర్యలు చేపడుతున్నట్లు ఫిబ్రవరి 24న ప్రకటించారు. సరిహద్దుల్లో అంతకుముందే మోహరించిన రష్యా సైన్యంతో యుక్రెయిన్ మీదకు దండెత్తారు. పరిమాణం ప్రకారం చూస్తే రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. యుక్రెయిన్ పెద్ద దేశాల్లో 45వ స్థానంలో ఉంటుంది. యుక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇవ్వకూడదని, యూరప్ తూర్పు దేశాల్లో నాటో దళాలను మోహరించకూడదని రష్యా కోరుకుంటోంది. కానీ, యుక్రెయిన్ నాటో సభ్యదేశం కావాలని, దాని సహకారం పొందాలని అనుకుటోంది.

 
రష్యా చర్యలను ఐక్యరాజ్యసమితి, పశ్చిమ దేశాలు తీవ్రంగా ఖండించాయి. దానిపై కఠిన ఆర్థిక ఆంక్షలు విధించాయి. నాటో రష్యా చుట్టూ ఉన్న తన సభ్య దేశాల్లో సైన్యం మోహరింపును పెంచింది. యుక్రెయిన్‌కు తనను తాను రక్షించుకోడానికి పూర్తి హక్కు ఉందని చెప్పింది. ఆ తర్వాత ఫిబ్రవరి 27న రష్యా అధ్యక్షుడు తమ అణ్వాయుధాలను 'స్పెషల్ అలర్ట్‌'లో ఉంచాలంటూ ఆదేశాలు ఇచ్చేశారు. ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధ నిల్వలు రష్యా దగ్గరే ఉన్నాయి. రష్యా ఈ ప్రకటన వల్ల ఒక విశ్వ సంక్షోభం తలెత్తవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే రష్యాతోపాటూ అమెరికా, చైనా, బ్రిటన్ సహా చాలా దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి.

 
అణ్వాయుధాలను వినాశనం సృష్టించే ఆయుధాలుగా చెబుతారు. అలాంటప్పుడు రష్యా చేసిన ఇలాంటి ప్రకటనతో ఉద్రిక్తతలు ఏర్పడడం సహజం. కానీ, అసలు అణ్వాయుధాల ఉపయోగించడానికి ఎలాంటి ప్రొటోకాల్స్ ఉన్నాయి. వినాశనం సృష్టించే ఈ ఆయుధాన్ని ప్రయోగించే తాళం చెవి ఎవరిదగ్గర ఉంటుంది. రష్యా, అమెరికా, చైనా, బ్రిటన్‌లో ఈ అణ్వాయుధాలు ప్రయోగించడానికి బటన్ ఎవరు నొక్కుతారు అనేది ఒక అంతుపట్టని ప్రశ్న.

 
అమెరికా: న్యూక్లియర్ ఫుట్‌బాల్
బ్రూస్ బ్లా అమెరికాకు చెందిన ఒక మాజీ మిసైల్ లాంచ్ అధికారి. ఆయన ఇప్పుడు లేరు. 70వ దశకంలో ఆయన అమెరికా రహస్య అణు క్షిపణుల స్థావరాల్లో పనిచేశారు. "మమ్మల్ని 'మినిట్ మాన్' అంటారు. ఎందుకంటే ఆదేశాలు రాగానే మేం ఒక నిమిషంలోపే అణు క్షిపణులను లాంచ్ చేయగలం" అని బ్రూస్ బ్లా ఒకసారి చెప్పారు. మిసైల్ లాంచ్ చేయాలని ఏ క్షణమైనా ఆదేశాలు వచ్చే అవకాశం ఉండడంతో బ్రూస్, ఆయన సహచరులు ఒక కంప్యూటర్ మానిటర్‌ మీద ఎప్పుడూ కన్నేసి ఉంచేవారు.

 
"అమెరికా వ్యవస్థలో అణ్వాయుధాలు ఉపయోగించాలనే అధ్యక్షుడు మాత్రమే ఆదేశాలు ఇవ్వగలరు. అందుకే అమెరికా అధ్యక్షుడితో ప్రతి క్షణం కొందరు ప్రత్యేక వ్యక్తులు ఉంటారు. వారి దగ్గర ఒక బ్రీఫ్‌కేస్ కూడా ఉంటుంది. దానిని న్యూక్లియర్ ఫుట్‌బాల్ అంటారు" " అని బ్రూస్ చెప్పారు. ఆ నల్లరంగు బ్రీఫ్‌కేస్ చూడ్డానికి మామూలుగానే ఉంటుంది. కానీ దానిలోపల ప్రత్యేక పరికరాలు ఉంటాయి. దాని ద్వారా అధ్యక్షుడు తన సీనియర్ సలహాదారులతో, కొంతమంది అత్యంత ముఖ్యమైన వ్యక్తులతో ఎప్పుడైనా మాట్లాడ్డానికి వీలుంటుంది.

 
"ఆ బ్రీఫ్‌కేసులో కార్టూన్ పుస్తకంలా ఉండే ఒక పేజీ కూడా ఉంటుంది. అందులో గ్రాఫిక్స్ ద్వారా వార్ ప్లాన్, అణు క్షిపణులు, వాటి లక్ష్యాల వివరాలు ఉంటాయి. అణు క్షిపణి ప్రయోగిస్తే ఎంతమంది ప్రజలు చనిపోవచ్చు అనేది కూడా అందులో ఉంటుంది. అధ్యక్షుడు అవన్నీ క్షణాల్లో తెలుసుకోవాల్సి ఉంటుంది" అంటారు బ్రూస్. ఒక అంచనా ప్రకారం 2022 ప్రారంభం నాటికి ప్రపంచంలోని 9 దేశాల దగ్గర దాదాపు 12,700 అణు క్షిపణులు ఉన్నట్లు ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్ ఒక రిపోర్టులో చెప్పింది.

 
వీటిలో అత్యధిక క్షిపణులు రష్యా దగ్గరే ఉన్నాయి. అమెరికా రెండో స్థానంలో ఉంది. ఈ రెండింటి దగ్గరా 5 వేలకు పైగా అణు క్షిపణులు ఉన్నాయి. ఈ రిపోర్ట్ ప్రకారం రష్యా 5977, అమెరికా 5428, చైనా 350, ఫ్రాన్స్ 290, బ్రిటన్ 225, పాకిస్తాన్ 165, భారత్ 160, ఇజ్రాయెల్ 90, ఉత్తరకొరియా 20 అణు క్షిపణులను సిద్ధంగా ఉంచాయి.

 
అమెరికాలో మిసైల్ లాంచ్ ప్రక్రియ మొదట పెంటగాన్ వార్ రూమ్ నుంచి జరిగేది. కానీ లాంచ్ కోసం వార్ రూమ్‌కు అధ్యక్షుడి ఆదేశాలు అవసరమయ్యేవి. కానీ, అధ్యక్షుడు మిసైల్ లాంచ్ ఆఫీసర్‌కు తన ఒక ప్రత్యేక కోడ్ చెప్పినపుడే ఆయన ఆ ఆదేశాలను అమలు చేయగలరు. అధ్యక్షుడి దగ్గర ఆ కోడ్ ఒక ప్లాస్టిక్ కార్డులో ఉంటుంది. అధ్యక్షుడు ఎప్పుడూ ఆ కార్డ్‌ తన దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ కార్డు వల్లే అమెరికా అధ్యక్షుడిని ప్రపంచంలోనే అత్యంత బలవంతుడని చెబుతారు. అధ్యక్షుడు ఆదేశించిన తర్వాత కొన్ని నిమిషాల్లోపే అణు క్షిపణులను లాంచ్ చేస్తారు.

 
"అధ్యక్షుడి ఆదేశాలు రాగానే భూమిపైనున్న అణు బాంబులను, లేదా జలాంతర్గామిలోని మిసైళ్లను మినిట్ మాన్ ఆ లాంచ్ కోడ్‌ ద్వారా ఓపెన్ చేస్తారు. వాటిని దాడికి సిద్ధం చేస్తారు" అని బ్రూస్ బ్లా చెప్పారు. ఆయన వివరాల ప్రకారం ఏ వ్యక్తికైనా న్యూక్లియర్ మిసైల్ లాంచ్ చేయాలంటే, ఇద్దరి అవసరం ఉంటుంది. వారిద్దరూ తమ కోడ్ చెప్పాల్సి ఉంటుంది. అంటే చెప్పాలంటే ఈ ఇద్దరూ ఆ మిసైల్ లాంచ్‌కు తాళం చెవి లాంటివారు. "నా మొత్తం కెరియర్‌లో ఒక్కసారి మాత్రమే ఇలా జరిగింది. నాకు అప్పుడు అణు యుద్ధం వస్తుందనే అనిపించింది. అప్పుడు నాది చాలా చిన్న వయసు. ప్రపంచంలో ఏం జరుగుతోందనేది తెలీదు. ఆ సమయంలో మాకు అణు యుద్ధానిది సిద్ధం కండి అని డెఫ్‌కాన్ 3(DEFCON 3) అలర్ట్ అందింది" అంటారు బ్రూస్.

 
మిసైల్ లాంచ్ కోడ్‌తో బ్రూస్ ఆయన సహచరుడు టిమోతీ కుర్చీలో రెడీగా కూర్చుని ఉన్నారు. మిసైల్ లాంచ్ ఆఖరి ఆదేశం కోసం ఎదురుచూస్తున్నారు.. కానీ లాంచ్ చేసే పరిస్థితి ఎప్పుడూ రాకపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. "అది 1973లో జరిగింది. అప్పుడు అరేబియా, ఇజ్రాయెల్ యుద్ధంలో ఉన్నాయి. కానీ అప్పుడు అణ్వాయుధాలు ఉపయోగించాల్సిన పరిస్థితి రాలేదు. అంతకు ముందు 1960వ దశకంలో క్యూబా క్షిపణి సంక్షోభం సమయంలో అమెరికా, సోవియట్ యూనియన్ అణు యుద్ధానికి చాలా దగ్గరగా వచ్చేశాయి.." అని బ్రూస్ తెలిపారు. కానీ ఏ ప్రమాదం లేకపోయినా, ఎవరూ రెచ్చగొట్టకపోయినా అమెరికా అధ్యక్షుడు మిసైల్ లాంచ్‌కు ఆదేశాలు ఇవ్వవచ్చా?

 
"ఆ పరిస్థితుల్లో జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ, ఆయన ఆదేశాలు అమలు చేయడానికి ఒప్పుకోకపోవచ్చు. కానీ, అలా జరిగే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే అధ్యక్షుడి కింద పనిచేసేవారికి, ఆయన అదేశాలు పాటించేలా ట్రైనింగ్ ఇవ్వడం చేస్తారు. అందుకే అధ్యక్షుడు అణు క్షిపణి లాంచ్ చేయమని ఆదేశాలు ఇస్తే, ఇక దాన్ని ఆపడం చాలా కష్టమనే లెక్క" అని బ్రూస్ సమాధానం ఇచ్చారు.

 
రష్యా: న్యూక్లియర్ బ్రీఫ్‌కేస్
ఇగోర్ సజెగెన్ ఒక ఆయుధ నిపుణులు. రష్యాకు చెందినవారు. ఒకప్పుడు ఆయన అక్కడి ప్రభుత్వం కోసం పనిచేశారు.
1999లో లండన్‌లోని ఒక కంపెనీకి ఆర్మీకి సంబంధించిన రహస్య సమాచారం ఇచ్చారని రష్యా ఆయనపై ఆరోపణలు చేసింది. ఇగోర్ తనను నిర్దోషిగా చెప్పుకున్నారు. కానీ ఆయనను 11 ఏళ్లు జైల్లో పెట్టారు. 2010లో జైలు నుంచి విడుదలయ్యాక, ఆయన లండన్‌లో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. ఇగోర్ ఇప్పుడు బ్రిటిష్ డిఫెన్స్ థింక్‌టాగ్ రష్యాలో సీనియర్ ఫెలో.

 
"అమెరికాకు న్యూక్లియర్ ఫుట్‌బాల్ లాగే, రష్యా అధ్యక్షుడి దగ్గర కూడా అణు క్షిపణి కోడ్ ఉండే న్యూక్లియర్ బ్రీఫ్‌కేస్ ఉంటుంది. ఈ బ్రీఫ్‌కేస్ ఎప్పుడూ అధ్యక్షుడికి సమీపంలోనే ఉంటుంది. ఆయన నిద్రపోతున్నా అది ఆయనకు 10-20 మీటర్ల పరిధిలో ఉంటుంది. రష్యాపై ఏదైనా దాడి పరిస్థితి వస్తే బ్రీఫ్‌కేసులోని అలర్ట్ అలారం మోగుతూ, ఫ్లాష్‌లైట్ వెలుగుతుంది. దాంతో అధ్యక్షుడు వెంటనే బ్రీఫ్‌కేస్ దగ్గరకు వెళ్లి ప్రధాని, రక్షణ మంత్రిని సంప్రదించాల్సి ఉంటుంది" అని ఇగోర్ చెప్పారు.

 
ఇలాంటి మరో రెండు బ్రీఫ్‌కేసులు రష్యా ప్రధానమంత్రి, రక్షణమంత్రి దగ్గర కూడా ఉంటాయి. కానీ, అణు దాడి ఆదేశాలు ఒక్క అధ్యక్షుడు మాత్రమే ఇవ్వగలరు. "ఆయనే సుప్రీం కమాండర్‌గా ఉంటారు. ఈ బ్రీఫ్‌కేస్ ఆయన బాధ్యత. అత్యవసర స్థితిలో ఆయన ఈ బ్రీఫ్‌కేస్ ద్వారా ఆర్మీ కమాండర్లు, ప్రధానమంత్రి, రక్షణ మంత్రితో మాట్లాడవచ్చు. ఆయనకు ఎలాంటి ఫోన్లూ అవసరం ఉండదు" అంటారు ఇగోర్. అలాంటి సందర్భం ఒక్కసారే వచ్చింది. అప్పుడు రష్యా అధ్యక్షుడు తన బ్రీఫ్‌కేస్ తెరిచి కోడ్ యాక్టివ్ చేయాల్సి వచ్చింది.

 
"1995 జనవరి 25న బ్రీఫ్‌కేస్ అలారం మోగింది. లైట్ ఫ్లాష్ అవుతోంది. అధ్యక్షుడి డెస్క్ మీద రెండో వార్నింగ్ లైట్ వెలుగుతోంది. ఆ సమయంలో బోరిస్ ఎల్సిన్ అధ్యక్షుడుగా ఉన్నారు" అని ఇగోర్ చెప్పారు. అప్పుడు రష్యా రాడార్లకు సరిహద్దుల్లో బారెంట్స్ సముద్రం మీద ఒక మిసైల్ కనిపించింది. అధి వేగంగా రష్యా వైపు దూసుకొస్తోంది. సమయం చాలా తక్కువగా ఉంది. బోరిస్ ఎల్సిన్ తన బ్రీఫ్‌కేస్ యాక్టివ్ చేశారు. ప్రధాని, రక్షణమంత్రితో ఏం చేద్దాం అని అడుగుతున్నారు. అప్పుడు ఆయనకు పది నిమిషాల సమయం కూడా లేదు.

 
ఎదురుదాడికి సిద్ధంగా ఉండాలని రష్యా జలాంతర్గాములకు ఆదేశాలు వెళ్లాయి. అయితే తర్వాత అది ఫాల్స్ అలారం అని తేలింది. అది నిజానికి నార్వేకు చెందిన ఒక రాకెట్. ఒక సైంటిఫిక్ మిషన్ మీద దానిని ప్రయోగించారు. అదే రాకెట్‌ను రాడార్లు రష్యా వైపు వస్తున్న మిసైల్‌గా అనుకోవడంతో అలారం మోగింది. ఆ సమయంలో బోరిస్ ఎల్సిన్ అణు దాడులకు ఆదేశాలు ఇచ్చుంటే, యుద్ధ చరిత్రలో ఎన్నో కొత్త పేజీలు చేరిపోయేవి. "మిసైల్ లాంచ్ సన్నాహాలు ఎంత పక్కాగా ఉన్నాయో చూడ్డానికి రష్యాలో తరచూ డ్రిల్స్ జరుగుతుంటాయి. క్షిపణులపై నిఘా పెట్టేవారికి చాలాసార్లు తప్పుడు లాంచ్ కోడ్ ఇచ్చి దాడికి సిద్ధం కావాలని చెబుతారు. ఒకవేళ నిజంగానే యుద్ధం వస్తే వారు అణు దాడి చేయడానికి వెనకాడ్డం ఏమైనా జరుగుతుందా అని పరీక్షిస్తారు" అని ఇగోర్ చెప్పారు. అమెరికా లాగే రష్యా సిస్టమ్‌లో కూడా అధ్యక్షుడు ఆదేశాలు ఇస్తే అణు దాడి కచ్చితంగా జరిగి తీరేలా నిర్ధరించారు.

 
బ్రిటన్ ట్రైడెంట్ క్షిపణులు
ద సైలెంట్ డీప్ అనే పుస్తకానికి ప్రొఫెసర్ పీటర్ హెనెసీ సహ రచయిత. బ్రిటిష్ సైన్యం దగ్గర ట్రైడెంట్ అణు క్షిపణులను ప్రయోగించగలిగిన సామర్థ్యం ఉన్న నాలుగు శక్తిమంతమైన జలాంతర్గాములు ఉన్నాయి. వాటిలో ఒకటి ఎప్పుడూ నార్త్ అట్లాంటిక్ మహాముద్రంలో మోహరించి ఉంటారు. చిన్న సంకేతం అందినా అది అణు దాడి చేయగలదు" అని ఆయన చెప్పారు. నార్త్ అట్లాంటిక్ జలాల్లో ఎప్పుడూ ఎక్కడో ఒకచోట ఆ జలాంతర్గామి ఉంటుంది. దాని గురించి ఎవరికీ తెలీదు. వేరేవారు దాని గురించి తెలుసుకోవడం కూడా సాధ్యం కాదు" అన్నారు.

 
"బ్రిటన్ సిస్టమ్‌లో అణు క్షిపణి లాంచ్ చేయాలనే ఆదేశం ప్రధానమంత్రి మాత్రమే ఇవ్వగలరు. ఆయన ఒక్క ఆదేశం ఇవ్వగానే రాయల్ నేవీ వాన్‌గార్డ్ క్లాస్ జలాంతర్గామి అణు దాడులు చేయగలదు" అని ప్రొఫెసర్ పీటర్ చెప్పారు. దానికోసం నౌకాదళానికి చెందిన ఇద్దరు అధికారులకు బ్రిటన్ ప్రధాని మిసైల్ లాంచ్ కోసం తన స్పెషల్ కోడ్ చెబుతారు. ఆ ఇద్దరు అధికారుల దగ్గర కూడా ఒక స్పెషల్ కోడ్ ఉంటుంది. వారు కూడా తమ కోడ్స్ చెప్పాల్సి ఉంటుంది. కోడ్ చెప్పే ఈ ప్రక్రియ లండన్ బయటున్న ఒక బంకర్‌లో ముగుస్తుంది. అక్కడ నుంచే మహాసముద్రంలో మోహరించిన జలాంతర్గామికి అణు క్షిపణిని లాంచ్ చేయాలని ఆదేశిస్తారు. "జలాంతర్గామిలోని ఇద్దరు అధికారులకు కూడా వైర్‌లెస్ ద్వారా ఈ మెసేజ్ అందుతుంది. తర్వాత తమ కోడ్స్ కలిపి మిసైల్ లాంచ్ కోసం వారు సన్నాహాలు చేస్తారు" అని ప్రొఫెసర్ పీటర్ హెనెసీ చెప్పారు.

 
అణు బాంబులు రెండు రకాలు
ఒకటి ఫిషన్ బాంబ్. అందులో నూక్లియర్ ఫిషన్(Nuclear fission) ఉయోగిస్తారు. ఇందులో ఒక న్యూటాన్ ఆటంను ఢీకొన్నప్పుడు దానివల్ల ఆ ఆటం రెండుగా విడిపోతుంది. ఆ ప్రక్రియలో భారీ స్థాయిలో శక్తి, వెలుగు ఉత్పత్తి అవుతుంది.
రెండోది థెర్మోన్యూక్లియర్ లేదా హైడ్రోజన్ బాంబ్. ఇందులో న్యూక్లియర్ ఫ్యూజన్(Nuclear fusion) ఉపయోగిస్తారు. ఇందులో అత్యధిక ఉష్ణోగ్రత దగ్గర హైడ్రోజన్ ఐసొటోప్స్ ఒకదానితో ఒకటి కలిసి హీలియం ఏర్పడుతుంది. ఆ ప్రక్రియలో శక్తి, వెలుగు ఉత్పత్తి అవుతుంది.

 
జలాంతర్గామి నుంచి మిసైల్ టెస్ట్ ఫైర్ చూసే అవకాశం లభించిన కొద్ది మందిలో ప్రొఫెసర్ పీటర్ ఒకరు. "కెప్టెన్ ఒక తెల్లటి పొగలాంటి దాన్ని చూపించగానే సముద్రంలోంచి ఒక గ్యాస్ గోళంలా వేగంగా పైకి దూసుకొచ్చింది. కొన్ని సెకన్లలోనే చాలా భారీ పేలుడు జరిగింది. సముద్ర జలాలపై ఆ గ్యాస్ ఒక పెద్ద మేఘంలా కనిపించింది. అదంతా చాలా డ్రమెటిగ్గా, సముద్రం లోతుల్లోంచి ఒక రాక్షసుడు పైకొచ్చినట్టు నాకు అనిపించింది" అన్నారు. అణు క్షిపణి లాంచ్ చేయడం అంటే శత్రువు వినాశనం అని అర్థం. అందుకే ఆ పనిని చాలా బాధ్యతాయుతంగా చేస్తారు.

 
"బ్రిటన్‌లో ఒకరు ప్రధానమంత్రి కాగానే, స్వయంగా తన చేత్తో నాలుగు జలాంతర్గాములకు లేఖలు రాస్తారు. ఆ లేఖలను 'లెటర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్' అంటారు. ఆ లేఖను జలాంతర్గామిలోని లాకర్‌లో ఉంచుతారు. ప్రొటోకాల్ ప్రకారం బ్రిటన్ ఏదైనా దాడిలో పూర్తిగా నాశనం అయినప్పుడు మాత్రమే వాటిని చదవాల్సి ఉంటుంది" అని ప్రొఫెసర్ పీటర్ హెనెసీ చెప్పారు.
ఆ 'లెటర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్‌'లో జలాంతర్గామి కమాండర్ల కోసం ప్రధాని ఎలాంటి ఆదేశాలు రాశారు, రాస్తారు అనేది ఇప్పటివరకూ ఎవరికీ తెలీదు. బ్రిటన్‌లో ప్రధాని మారినపుడు, ఆ లేఖలను తెరవకుండా, చదవకుండా కాల్చేస్తారు. కొత్త ప్రధానమంత్రీ జలాంతర్గామి కమాండర్లకు మళ్లీ కొత్తగా లేఖలు రాస్తారు. బ్రిటన్‌లో ఎన్నో ఏళ్ల నుంచీ ఇదే పరంపర కొనసాగుతోంది.

 
చైనా- లోతైన సొరంగాలు
టాంగ్ జావో బీజింగ్‌లోని కార్నెగీ చిన్హువా సెంటర్ ఫర్ గ్లోబల్ పాలసీ ఫెలోగా ఉన్నారు. ఇది మన మానవాళి ఎదుర్కుంటున్న అత్యంత తీవ్రమైన అంశమని ఆయన చెప్పారు. అణ్వాయుధాలకు, అణు యుద్ధానికి నేరుగా మనిషి ఉనికితోనే సంబంధం ఉంటుందన్నారు. చరిత్రలో ఇలాంటి ఎన్నో సందర్భాలు వచ్చాయి. ఆ సమయంలో మనం అణు యుద్ధానికి చాలా దగ్గరగా వెళ్లాం. మొత్తం మానవాళికే ముప్పు వచ్చింది. చైనా ప్రపంచంలో అణుశక్తి ఉన్న దేశాల్లో ఒకటి. కానీ మొదట అణు దాడి చేయకూడదు అనేది దాని పాలసీ. దీని వెనుక ఒక పెద్ద కారణం ఉందంటారు టాంగ్ జావో. చైనా దగ్గర ప్రస్తుతం తమపై జరిగే అణు దాడులను ముందే గుర్తించగలిగే సామర్థ్యం లేదని చెప్పారు.

 
"చైనా వేచిచూస్తుంది. మొదట అణు దాడి నిజంగానే జరిగిందా అనేది తెలుసుకుంటుంది. ధ్రువీకరించుకున్న తర్వాత పరిస్థితిని అంచనా వేస్తుంది. దాడి ఎలాంటిది, ఎంత పెద్దదో తెలుసుకోడానికి ప్రయత్నిస్తుంది. ఆ తర్వాతే అది ఎదురుడాదికి ఏయే ప్రత్యామ్నాయాలు ఉన్నాయో ఆలోచిస్తుంది" అని ఆయన చెప్పారు. కానీ, దాడిలో ఒకవేళ చైనా అగ్ర నేతలు, సైనిక కమాండర్లు అందరూ చనిపోతే లేదా శత్రువు దాడిలో చైనా అణు క్షిపణులే ధ్వంసమైతే, అలాంటి పరిస్థితిలో చైనాకు ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉంటాయి?

 
అణు దాడిలో తమ నేతలను కాపాడ్డానికి, అణు క్షిపణులను ధ్వంసం కాకుండా చూసుకోడానికి చైనా ముందే సన్నాహాలు చేసుకుంది. దానికోసం అది లోతైన సొరంగాల నెట్‌వర్క్ నిర్మించింది. కొన్ని సొరంగాలను పర్వత ప్రాంతాల్లో భూగర్భంలో వందల మీటర్ల లోతులో నిర్మించారు" అని టాంగ్ చెప్పారు. అంటే, భూమిపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు.. భూగర్భంలో లోతైన సొరంగాల్లో ఉన్న నేతలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంటారు. కానీ చైనాలో అణు దాడి జరపాలనే అంతిమ నిర్ణయం ఎవరి చేతుల్లో ఉంటుంది?

 
"ఇదంతా చాలా రహస్యం. కానీ చైనా సైన్యం ఏం చేయాలి అనే నిర్ణయం కమ్యూనిస్ట్ పార్టీ పోలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ తీసుకుంటుందని ప్రజలు భావిస్తారు. అంతిమ నిర్ణయం కమిటీదా లేక అధ్యక్షుడిదా అనేది నిజంగా ఎవరికీ తెలీదు" అంటారు టాంగ్. చైనా తమపై అణు దాడి జరిగిన వారాలు లేదా నెలల తరబడి మౌనంగా ఉండి, తర్వాత ఎదురుదాడి చేయచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే, మొదట దాడి చేయాలనే పశ్చిమ దేశాల విధానాన్ని చైనా ఎప్పటినుంచో వ్యతిరేకిస్తూ వస్తోందని చెబుతున్నారు.

 
"చైనా అణ్వాయుధాల సత్తా పొందినప్పుడు, అణు దాడుల విషయంలో తాము ఒక బాధ్యతాయుతమైన దేశంగా నిలవాలని ఆ దేశ నేత మావో జెడాంగ్ నిర్ణయించారు. హీరోషిమా-నాగసాకిలో ఏం జరిగింది అనేది ఆ సమయంలో చైనా నేతలకు చాలా బాగా తెలుసు" అంటారు టాంగ్. కానీ ఇది ఒకప్పటి మాట. చైనా తీరు ఇప్పుడు మారుతోంది. పశ్చిమ దేశాల ఆలోచనల ప్రభావం దానిపై కూడా పడింది. 2015లో చైనా భూభాగంలో అణు, సంప్రదాయ క్షిపణులను తయారుచేసే బ్రాంచ్‌ను అది శాశ్వతంగా తమ సైన్యంలో కలిపేసింది. దానికి 'పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్' అని పేరు పెట్టింది. మిగతా చాలా దేశాల్లాగే చైనా కూడా హైపర్‌సోనిక్ టెక్నాలజీపై పనిచేస్తోంది. తన అణ్వాయుధ నిల్వలను పెంచుకునే ప్రయత్నంలో ఉంది.

 
"అమెరికా లేదా రష్యా అధ్యక్షుల్లాగే చైనా అధ్యక్షుడి దగ్గర కూడా అణు దాడికి ఆదేశాలిచ్చే అధికారం ఉంటుందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. శత్రువు దాడి చేసే అవకాశాలను చూసి తమ రక్షణ కోసం ఆయన ముందే ఆదేశాలు జారీ చేయవచ్చని చెబుతున్నారు. అందుకే చైనా ఈమద్య శక్తివంతమైన రాడార్లు అభివృద్ధి చేస్తోంది. సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులను తయారుచేస్తోంది" అని టాంగ్ జావో చెప్పారు. రాబోవు కొన్నేళ్లలో చైనా కూడా మొదట అణ్వాయుధాలు ప్రయోగించకూడదనే తమ నియమాన్ని మార్చుకునే అవకాశం ఉందని నిపుణులు అంగీకరిస్తున్నారు.

 
మీరు ఈ కథనం చదువుతున్న సమయానికి ప్రపంచంలో ఒక మూల కొందరు ఒక ప్రత్యేక కంప్యూటర్ స్క్రీన్‌ను నిశితంగా గమనిస్తూ ఉంటారు. ఇంకొందరు ఎక్కడో ఒక బంకరులో కూర్చుని తమ నేతల ఆదేశాల కోసం ఎదురుచూస్తుంటారు. మరో జలాంతర్గామి కమాండర్ 'లెటర్ ఆఫ్ లాస్ట్ రిసార్డ్' చదవాల్సిన పరిస్థితి రాకుండా ఉంటే బాగుంటుందని ఆలోచిస్తుంటారు. అమెరికా, రష్యా, బ్రిటన్, చైనాకు సంబంధించిన ఈ ఉదాహరణలతో అణు దాడి చేయడానికి మన దగ్గర ఎలాంటి కమాండ్, కంట్రోల్ సిస్టమ్ ఉండాలి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దాని సాయంతో ఎక్కడనుంచైనా, ఎప్పుడైనా అణు దాడులకు ఆదేశాలు ఇవ్వవచ్చు.

 
అయితే, ఆ అణు దాడుల ఫలితం ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి, ఏ నేతల మనసులోనూ అలాంటి ఆలోచనలు రావని నిపుణులు భావిస్తున్నారు. హీరోషిమా నాగసాకిపై అణు దాడుల తర్వాత ప్రపంచం ఎన్నోసార్లు అణుయుద్ధం అంచుల వరకూ వెళ్లింది. కానీ ఏ నేతా ఇప్పటివరకూ అణు దాడుల బటన్ నొక్కలేదు. కానీ, అణ్వాయుధాలను హైఅలర్ట్‌లో ఉంచాలనే రష్యా అధ్యక్షుడి ఆదేశాలు మరోసారి ప్రపంచాన్ని అణు యుద్ధం గుమ్మంలో నిలబెట్టింది. ఆ గుమ్మానికి అవతలివైపు వినాశనం మాత్రమే ఉంది. అణు బటన్ నొక్కాలని ఒక నేత తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం మొత్తం ప్రపంచాన్నే సర్వనాశనం చేయగలదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments