కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. అగ్రరాజ్యాలుగా చెలామణి అవుతున్న అమెరికా, బ్రిటన్, రష్యా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాలు కరోనా దెబ్బకు తల్లడిల్లిపోయాయి. ముఖ్యంగా, అమెరికాలో రెట్టింపు వేగంతో ఈ కరోనా వైరస్ వ్యాప్తిస్తోంది. దీంతో ఆ దేశం వణికిపోతోంది. అలాగే, ఈ కరోనా ప్రభావం ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై కూడా తీవ్ర ప్రభావం చూపింది.
ఈ పరిస్థితుల్లో దేశ ఆర్థిక రంగాన్ని తిరిగి గాడిలోకి తెచ్చి, పరుగులు పెట్టించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేక నిపుణులను సలహాదారులుగా ఎంపిక చేసుకున్నారు. వీరిలో భారతదేశానికి చెందిన ఆరుగురు ప్రముఖులు ఉన్నారు. వీరిలో మన తెలుగోడు సత్య నాదెళ్ళతో పాటు గూగూల్ సీఈవో సుందర్ పిచాయ్‌లు కూడా ఉన్నారు.
వీరితోపాటు ఈ బృందంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్, ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ వంటి ఎందరో ప్రముఖలు అధ్యక్షుడి సలహాదారులుగా వ్యవహరించనున్నారు. ముఖ్యంగా, సత్యానాదేళ్ల, సుందర్ పిచాయ్‌తో పాటు భారతీయ సంతతికి చెందిన అరవింద్ కృష్ట(ఐబీఎమ్), సంజయ్ మెల్హోత్రా(మైక్రాన్)లతో సహా ఇద్దరు ఉన్నారు.
ఒక్కో రంగం అభివృద్ధికి కోసం ఆయా రంగంలోని నిపుణులు ట్రంప్‌కు సూచనలు సలహాల రూపంలో తోడ్పాటునందించనున్నారు. వీరంతా అమెరికా ఆర్థిక వ్యవస్థను పరుగులెత్తించేందుకు ఏం చేయాలనేదానిపై ట్రంప్‌కు సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ట్రంప్‌యే స్వయంగా వైట్ హౌజ్‌లో జరిగిన పత్రికా సమావేశంలో ప్రకటించారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజితం చేసేందుకు సిద్ధమైన ట్రంప్.. ఇందుకు తగిన సలహాలు ఇవ్వాలంటూ అమెరికాలోని పారిశ్రామికవేత్తలు, నిపుణులను కోరారు. వివిధ రంగాలకు చెందిన 200 మంది ప్రముఖులతో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.