విజయవాడ నగరంలో పేదలకు ఇళ్ళు ఇచ్చేందుకు ఉద్దేశించిన జగనన్న కాలనీలు ఇపుడు జోరుగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ కాలనీల లేవుట్లకు రవాణా సదుపాయాలు కూడా పెరగనున్నాయి. ముఖ్యంగా అజిత్ సింగ్ నగర్ కు కొత్తగా ఆర్టీసీ బస్టాండు మంజూరు అయింది. దీనితో అక్కడి నుంచి జగనన్న కాలనీలకు బస్సులు నడపాలని సంకల్పిస్తున్నారు.
జగనన్న లే అవుట్లలో మౌలిక సదుపాయాలను త్వరితగతిన పూర్తిచేయాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు మల్లాది విష్ణు గారు అన్నారు. సూరంపల్లి, కొండపావులూరు ప్రాంతాలలో నూతనంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీలను సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ గారితో కలిసి ఆయన పరిశీలించారు. పేదలకిచ్చిన ఇళ్లస్థలాల లేఅవుట్లను చదును చేసే ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదేశించారు.
లేఅవుట్లలో తాగునీరు, విద్యుత్, రోడ్లు వంటి కనీస మౌలిక సదుపాయాలకు అత్యధిక ప్రాధాన్యంను ఇవ్వాలని సూచించారు. వారానికి రెండు దఫాలు అధికారులు లేఅవుట్లను పరిశీలించి తగు సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. మరోవైపు సింగ్ నగర్ కు బస్టాండ్ మంజూరు అయిందని.. దీని ద్వారా రాబోయే రోజుల్లో ఆయా లేఅవుట్లకు ప్రయాణం సులభతరం కానుందని వెల్లడించారు. ఎమ్మెల్యే గారి వెంట నార్త్ ఎమ్మార్వో దుర్గాప్రసాద్, నార్త్ డిప్యూటీ తహశీల్దార్ చంద్రమౌళి, హౌసింగ్ డీఈ రవికాంత్, గన్నవరం డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్, గన్నవరం సర్వేయర్ వర్మ, రెవెన్యూ, హౌసింగ్, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.