ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి ధర్మపోరాట దీక్ష ప్రారంభించారు. ఈ దీక్ష రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది. 'నవ్యాంధ్రకు ఇచ్చినవి చట్టబద్ధమైన, న్యాయమైన హామీలు. వ
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి ధర్మపోరాట దీక్ష ప్రారంభించారు. ఈ దీక్ష రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది. 'నవ్యాంధ్రకు ఇచ్చినవి చట్టబద్ధమైన, న్యాయమైన హామీలు. వాటిని పూర్తిగా నెరవేర్చడం కేంద్రం బాధ్యత!' అంటూ సీఎం చంద్రబాబు 'ధర్మ పోరాట దీక్ష'కు దిగారు.
విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఉదయం సరిగ్గా 7 గంటలకు బాబు దీక్ష ప్రారంభించారు. దీక్షా వేదికపై చేరుకోగానే.. మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి చంద్రబాబు నివాళులర్పించారు. రాత్రి 7గంటల వరకు ఈ దీక్ష సాగనుంది. దీక్షా వేదికకు ఇరువైపులా గాంధీ, ఎన్టీఆర్ చిత్రపటాలు ఉంచడం జరిగింది. అలాగే, దీక్షలో చంద్రబాబుతో పాటు.. పలువురు ఎంపీలు పాల్గొన్నారు.
ఇకపోతే, చంద్రబాబుకు మద్దతుగా 13 జిల్లాల్లో మంత్రుల దీక్షలు చేపట్టారు. అన్ని నియోజకవర్గాల్లో సంఘీభావ దీక్షను పార్టీ శ్రేణులు ప్రారంభించాయి. కాగా సీఎం ధర్మ పోరాట దీక్షకు పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఇది ముఖ్యమంత్రి హోదాలో చేస్తున్న దీక్ష కావడంతో ప్రభుత్వ యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది.