మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈ నెల 10న జరగనున్నాయి. శివాజీరాజా, నరేష్ అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. పోటాపోటీగా ప్రచారం చేయడంతో… ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుండటంతో ఈసారి ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. శివాజీరాజా ప్యానల్ ప్రెస్ మీట్ పెట్టి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
ఈ ప్రెస్ మీట్లో శివాజీరాజా మాట్లాడుతూ… మా ఇంట్లో ఫస్ట్ టైమ్ ఇక చాలండి. మనకు ఉన్న దాంట్లోనే తృప్తి పడదాం. అరుణాచలం వెళ్లిపోదాం అని నా భార్య చెప్పింది. అయితే… శ్రీకాంత్‌కు నాతో ఉన్న స్నేహం వలన నాకు ఏదో చేద్దామని తను మాటలు పడతాడని ఎప్పుడూ అనుకోలేదు.
ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి గొప్ప డైరెక్టరు నువ్వు ఉన్నావ్ కదా.. నేనూ నీతో ఉంటాను అన్నారు. మిగతా వాళ్లు కూడా నాపై చూపిస్తున్న ప్రేమకు కళ్లంట నీళ్లు వచ్చాయి. నేను ఎవరినీ విమర్శించను. ఎవరినీ ఒక్క మాట కూడా అనను. అసలు.. ఈ ప్రెస్ మీట్ పెట్టడం నాకు కానీ, శ్రీకాంత్‌కు కానీ, నాగిరెడ్డికి కానీ.. ఎవరికీ ఇష్టం లేదు. అయినా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాం అంటే… ఎవరు టీవీలకెక్కి చెప్పకూడదని రూల్ ఉన్నా కూడా వాటిని బ్రేక్ చేసి టీవీలకెక్కి ఏదేదో చెబుతున్నారు. నేను ఏమీ చెప్పకపోతే వాళ్లు చెప్పిందే నిజం అనుకుంటారేమో అని ప్రెస్ మీట్ పెట్టాం.
మాపై బురద చల్లినా మేమంతా స్వచ్ఛంగా ఉంటామని తెల్ల చొక్కా వేసుకున్నాం. నేను, నా భార్య వెళ్లి అరుణాచలంలో ఉందామని ఫిక్స్ అయిపోయిన టైమ్‌లో ఈ ఒక్కసారి ఉండమని అందరూ బతిమాలడంతో ఈ ఒక్కసారికి ఒప్పుకోవడం జరిగింది. ఒకటి మాత్రం చెప్పగలను. ఏంటంటే… ప్రాణం పోయినా శ్రీకాంత్, నేను తప్పు చేయం. తప్పు చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు. నరేష్ నా సొదరుడే. నేను ఇప్పటికీ అతనితో అలాగే ఉంటాను. నన్ను అవమానించాడు. ఎంత అన్యాయంగా అవమానించాడంటే…. ప్రెసిడెంట్ పదవినే అవమానించాడే. అది తలచుకుంటే గుండె తరుక్కుపోతుంది.
అతను చాలా బిజీగా ఉన్నాను అని చెబితే.. అతని వర్క్ కూడా నేనే చేసాను. మేము ప్రోగ్రామ్ చేస్తే.. అసలు సహకరించలేదు. అసోసియేషన్ వర్క్ కన్నా తనకు షూటింగ్ ఇంపార్టెంట్ అని చెప్పేవాడు. అసోసియేషన్ గురించి అసలు పట్టించుకోలేదు. ఇదంతా పక్కన పెడితే ఒక విషయం చెప్పాలి. నా పుట్టినరోజు నాడు ఫిల్మ్ ఛాంబర్ దగ్గర కలుద్దామని నరేష్ నుంచి మెసేజ్ వచ్చింది.
మా మిసెస్ గుడికి తీసుకెళ్లమంటే.. తనని గుడిలో దింపి వచ్చాను. ఎంతసేపు వెయిట్ చేసినా అతను రాలేదు. ఆఖరికి తెలిసింది ఏంటంటే… పుట్టినరోజు నాడు చూడు ఎలా వెయిట్ చేయించానో. నాతో పెట్టుకుంటే అలా ఉంటది అని నరేష్ వేరే వ్యక్తితో అన్నారట. అది తెలిసి చాలా బాధపడ్డాను. ఇంట్లో ఈసారి ఎన్నికల్లో పోటీ చేయద్దు అని చెప్పినా మొదలుపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు మధ్యలో ఆగిపోతాయనే ఉద్దేశ్యంతో పోటీ చేస్తున్నాను అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు శివాజీరాజా.