డేటా చోరీకి గురైందంటూ గుండెలు బాదేసుకుంటూ నానా హడావుడి చేసేస్తున్న తెరాసపై శుక్రవారం నాడు నటుడు శివాజీ సంచలన ఆరోపణలు చేసారు. వివరాలలోకి వెళ్తే... తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస సమగ్ర సర్వేను తమ పార్టీ కోసం వాడుకుందని, దీనికి ఈసీ కూడా సహకరించిందనీ నటుడు శివాజీ శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సంచలన ఆరోపణలు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికల్లో తెదేపాని ఓడించి జగన్‌ను సీఎం చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారని ఆరోపించారు.
కాగా... అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను, కేసీఆర్ తెరాస పార్టీకి అనుకూలంగా వాడుకున్నారని ఆరోపించారు. ఈ విషయమై మీడియాతో శివాజీ మాట్లాడుతూ ‘‘గ్రేటర్ పరిధిలో 40 లక్షల మందికి పైగా సెటిలర్లు ఉన్నారు. ఈసీని కలవడానికి ముందే సమగ్ర సర్వే చేసారు. సమగ్ర సర్వేలో ప్రతి ఒక్కరి వివరాలు తీసుకున్నారు.
ఎస్‌ఆర్‌డీహెచ్ అప్లికేషన్ తెలంగాణ పోలీస్ శాఖ తయారుచేసింది. అప్లికేషన్ కోసం టెండర్లు కూడా పిలిచారు. ఈసీ, సీఎస్, గ్రేటర్ కమిషనర్ కలసి పైలెట్ ప్రాజెక్టు చేపట్టాలనుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఈసీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఓట్లను తొలగించడానికి ఓ ప్రణాళికను తయారుచేసారు. ఈసీ వద్ద నుండి ఆధార్ డేటా, ఓటర్ లిస్టును తీసుకున్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న సమగ్ర సర్వే వివరాలను ఈసీ దగ్గరున్న జాబితాతో పోల్చుతూ ఓట్లను తొలగించేసారు’’ అని ఆరోపణలు చేశారు.
‘‘డేటా చోరీ జరిగిందని గుండెలు బాదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం మా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. నిబంధనల ప్రకారమే వెళ్తున్నామంటూ రజత్‌కుమార్ వ్యూహాత్మకంగా కేసీఆర్‌కు సహకరించారు. మర్రి శశిధర్‌రెడ్డి ఫిర్యాదులో వివరాలన్నీ ఉన్నాయి. కేంద్రం నుండి టీఆర్‌ఎస్‌కు పూర్తి సహాయసహకారాలున్నాయి. ఓట్ల తొలగింపు స్మూత్‌గా సాగిపోయింది. అదే తరహాలో ఏపీపై కేసీఆర్ గురిపెట్టారు’’ అంటూ శివాజీ చెప్పుకొచ్చారు. బహుశా ఇదేనేమో బాబుకి కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అంటూ శివాజీ కామెంట్లను విన్నవారు అనుకుంటున్నారు.