మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈ నెల 10 జరగనున్నాయి. ఈసారి అధ్యక్ష పదవికి శివాజీరాజా, నరేష్ పోటీపడుతున్నారు. గెలుపుపై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఒకరు చిత్రపురిలో ప్రచారం చేస్తుంటే... మరొకరు ఫిల్మ్ నగర్లో ప్రచారం చేస్తున్నారు. ఇలా పోటాపోటీగా సినీ ప్రముఖులను కలిసి మద్దతు తెలియచేయాలని కోరుతున్నారు. దీంతో అధ్యక్ష పదవిని ఎవరు సొంతం చేసుకుంటారో అనే ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఇదిలా ఉంటే... నరేష్ ప్యానల్ ప్రెస్ మీట్ పెట్టి తాము గెలిస్తే ఏం చేయనున్నామో తెలియచేసారు.
ఫిల్మ్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నరేష్ మాట్లాడుతూ... మాలో సాధారణంగా ఎన్నికలు కోరుకోం. అందరూ ఒకటే కుటుంబం. గతంలో ఒకటి రెండుసార్లు ఎన్నికలు జరిగాయి. భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్యం. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచనలు వేరు అయినప్పుడు మెంబర్స్ అభిప్రాయం బట్టి ఎవరు ఉండాలనేది నిర్ణయించబడుతోంది. గతంలో రాజేంద్రప్రసాద్, శివాజీరాజా నేను ఉండగా, అందరం ఒక్కొక్క టర్మ్ ఉంటే బాగుంటుంది అని శివాజీరాజా అంటే, నా మిత్రుడు రాజేంద్రప్రసాద్ చాలా గౌరవంగా.. చాలా హూందాగా... ఒక టర్మ్ చేసి తప్పుకోవడం జరిగింది.
అప్పుడు నన్ను అధ్యక్షుడిగా ఉండమంటే.. శివాజీరాజా నువ్వు చెయ్.. బాగా ఇంట్రస్ట్ ఉందా కదా అని చెప్పి అధ్యక్షుడిని చేయడం జరిగింది. కానీ.. ఇప్పుడు మళ్లీ ఒకసారి శివాజీరాజా పోటీ చేస్తా అన్నారు. నాకే అభ్యంతరం లేదు కానీ.. వందలమంది మెంబర్స్ నాకు ఫోన్ చేసి మీ కుటుంబం లక్ష రూపాయలు డోనేట్ చేయడమే కాకుండా మాకు అండగా ఉంది. మిమ్మల్ని ఒక్కసారి అధ్యక్షుడిగా చూడాలని ఉందన్నారు. అందరూ చెప్పడంతో సరే అని అంగీకరించాను. పెద్దలందరి ఆశీర్వాదం ఉంది. అందరూ మా వెంట ఉన్నాం అన్నారు. విజయం మాదే అని తెలియచేసారు నరేష్.