ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావోలో వుండే ఆడపిల్లలు వణికిపోతున్నారు. ఎందుకంటే... అక్కడ గత 11 నెలల్లో ఏకంగా 86 అత్యాచారాలు జరిగాయి. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే కామాంధులు కాటేస్తున్నారు. మరోవైపు తనపై అత్యాచారం చేసిన నిందితులకు శిక్ష పడాలని మొక్కవోని ధైర్యంతో కోర్టు చుట్టూ తిరుగుతున్న బాధితురాలుని పొట్టనబెట్టుకున్నారు నిందితులు. ఆమె కోర్టుకు వెళ్తున్న సమయంలో రోడ్డుపై నిప్పుపెట్టారు.
ఐతే, బాధితురాలు మంటలతోనే రోడ్డుపై ప్రయాణించి అంబులెన్సుకి తనే ఫోన్ చేయాల్సిన దీన స్థితి అక్కడ నెలకొంది. ఎంత దారుణం? ఆ దారుణ ఘటనలో ఆమె 90 శాతం గాయాలపాలై నిన్నటివరకూ మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. కానీ నిందితులకు శిక్ష పడేవరకూ విశ్రమించవద్దని తన సోదరుడితో చివరి మాటగా చెప్పింది. ఆమెను పొట్టనబెట్టుకున్న కామాంధులు ఎంతటి సాహసం చేసారంటే, నవంబర్ 27న ఈ కేసులో బెయిల్ పైన బయటకు వచ్చి వెంటనే బాధితురాలికి నిప్పంటించారు. దీన్నిబట్టి అర్థమవుతుంది... ఆ కామాంధుల గుండెధైర్యం ఎంతటిదో?
మరోవైపు వరసబెట్టి యువతులపై అత్యాచారాల పరంపర సాగుతుండటంతో యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ ఉక్కిరిబిక్కిరయిపోతోంది. ఈ నేపధ్యంలో ఈ కేసులో నిందితులను కూడా తెలంగాణ దిశ నిందితుల మాదిరిగా ఎన్ కౌంటర్ చేయాల్సిందేనంటూ మహిళా సంఘాలు కోరుతున్నాయి. మరి యోగి సర్కారు ఏం చేస్తుందన్నది చూడాల్సి వుంది.