Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దిశ అత్యాచారం, హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్: 'సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా తిరగబడ్డారు' - సజ్జనార్

Advertiesment
దిశ అత్యాచారం, హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్: 'సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా తిరగబడ్డారు' - సజ్జనార్
, శుక్రవారం, 6 డిశెంబరు 2019 (12:59 IST)
దిశ అత్యాచారం, హత్య కేసులోని నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. తెలంగాణ శాంతిభద్రతల అడిషనల్ డిజీ జితేందర్ బీబీసీకి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దీనిపై నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని ఆయన బీబీసీతో అన్నారు.

 
సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ బీబీసీతో మాట్లాడుతూ, "సీన్ రీ కన్ స్ట్రక్ట్ చేస్తుండగా నిందితులు తిరగబడ్డారు. పోలీసుల దగ్గర నుంచి ఆయుధాలు లాక్కోవడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలో పోలీసులు ఎన్‌కౌంటర్ చేయగా నలుగురూ చనిపోయారు. ఇప్పటివరకు ఇదీ మాకు తెలిసిన సమాచారం. మిగతా వివరాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తరువాతే ధ్రువీకరించగలను. ఈ ఘటనలో మా పోలీసులు ఇద్దరికి గాయాలయ్యాయి' అని చెప్పారు.


"నేరం జరిగిన తీరును రీకన్‌స్ట్రక్ట్ చేసేందుకు నలుగురు నిందితులను ఘటనా స్థలానికి తీసుకువచ్చాం. ఆ సమయంలో వారు మా దగ్గరున్న ఆయుధాన్ని లాక్కొని మాపై కాల్పులు ప్రారంభించారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఆ నలుగురు నిందితులూ మరణించారు" అని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి తెలిపారని ఏఎన్ఐ వార్తాసంస్థ వెల్లడించింది.

 
ఎన్‌కౌంటర్ జరిగిన స్థలాన్ని పరిశీలించడానికి సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మొత్తం నలుగురు నిందితులూ చనిపోయారు. షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద ఈ ఘటన జరిగింది.
webdunia
న్యాయం జరగదనుకున్నా: దిశ తల్లి
‘‘ఆ అబ్బాయిలు ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే.. నా అక్క, నా చెల్లిలాంటిదే కదా అని అనుకుని ఉంటే అక్కడ ఆ నలుగురు తల్లులు, ఇక్కడ నేను ఇవాళ ఇంత బాధపడే పరిస్థితి వచ్చేది కాదు’’ అని దిశ తల్లి అన్నారు. ‘‘మా అమ్మాయి ఆత్మ శాంతించింది. పోలీసులకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మాకు న్యాయం జరిగింది. ఇలా జరగదనుకున్నా. కానీ, చేసి చూపించారు. నిర్భయ కేసు ఇంకా అలానే ఉంది’’ అని అన్నారు.

 
ఇలాంటి నేరాలకు పాల్పడినవారిని అక్కడిక్కడే ఉరి తీసేలా చట్టాల్లో మార్పులు రావాలని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్‌కౌంటర్ జరుగుతుందని తాను ఊహించలేదని.. అయితే, భవిష్యత్తులో అత్యాచారాలు జరగకుండా ఇలాంటి కఠిన చర్య అడ్డుకట్ట వేస్తుందని దిశ సోదరి అన్నారు. ‘‘మేం కోర్టు ద్వారా మాకు న్యాయం చేస్తారని అనుకున్నాం. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. ఈ చర్యతో మా సోదరి తిరిగిరాదని తెలుసు. కానీ, కాస్త సాంత్వన దొరికింది. దేశవ్యాప్తంగా చాలా మంది మాకు మద్దతుగా నిలిచారు. అందరికీ కృతజ్ఞతలు. పోలీసులకు కూడా చాలా త్వరగా చర్యలు తీసుకున్నారు’’ అని ఆమె బీబీసీ తెలుగుతో చెప్పారు.

 
ఎన్‌కౌంటర్ ఘటన‌పై కొన్ని చోట్ల మహిళలు స్వీట్లు పంచుకుంటూ, టపాసులు కాల్చుతూ సంబరాలు జరుపుకుంటున్నారు. దిశ కాలనీవాసులు ‘తెలంగాణ సీఎం జిందాబద్, తెలంగాణ పోలీస్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేస్తూ బాణసంచా కాల్చారు. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలో పోలీసులను అక్కడున్న జనాలు ఎత్తుకొని, హర్షం వ్యక్తం చేశారు.
webdunia
ఇదే న్యాయమా? కోర్టులను ఎత్తేద్దామా? : కల్పన కన్నబిరన్
‘‘నలుగురిని క్రూరంగా చంపారు. కోర్టులను ఎత్తేసి, ఈ హంగామా చూద్దామా?’’ అని లా ప్రొఫెసర్, మానవహక్కుల కార్యకర్త కల్పన కన్నబిరన్ ప్రశ్నించారు. ఎన్‌కౌంటర్‌పై ఆమె ఫేస్‌బుక్‌లో స్పందించారు. ‘‘ఆదిత్యనాథ్ ఓ రాష్ట్రాన్ని పాలిస్తుంటే, నిత్యానంద ఓ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉన్నావ్‌లో ఓ అత్యాచార బాధితురాలికి నిప్పటించారు. ఎన్‌కౌంటర్లలో ఎలాంటి న్యాయమూ లేదు. ఈ రక్త పాతాన్ని మనం సమర్థించకూడదు. పోలీస్ రాజ్యంలో భవిష్యత్తు ఉండదు. ప్రజాస్వామ్య ఉద్యమాల పునాదులపై తెలంగాణ నిర్మితమైందన్న విషయాన్ని మనం మరిచిపోకూడదు’’ అని అన్నారు. సుప్రీం కోర్టు, హైకోర్టులు ఈ విషయంపై ఏమని స్పందిస్తాయని కల్పన ప్రశ్నించారు.

 
అసహ్యం.. అనాగరికం: అక్కిరాజు భట్టిప్రోలు
దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్ అసహ్యకరమైన, అనాగరికమైన చర్య అని రచయిత అక్కిరాజు భట్టిప్రోలు వ్యాఖ్యానించారు. ‘‘పోలీసులనే జడ్జీలను చేసేస్తే ఎంత ప్రమాదమో తెలీని ప్రజల అమాయకత్వం. ఎప్పుడు ఆ తుపాకీ నీవైపు ఎందుకు తిరుగుతుందో నీకు తెలీదు. పోయింది నిందితులు మాత్రమే కాదు. నీకూ, నాకూ రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కూడా హత్యకు గురయ్యాయి. ఇది మొదటి సారీ కాదు, చివరిసారి అయ్యే అవకాశమూ లేదు’’ అని ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో వ్యాఖ్యానించారు. కోర్టులద్వారా వేసే ఉరి శిక్షనే అనాగరికమని తొలగించిన దేశాలున్నాయని ఆయన అన్నారు. 'ఎన్ కౌంటర్ చేశారు' అన్న వాక్యమే తప్పని అక్కడిరాజు అన్నారు. ‘‘హత్యలు చేస్తారు. ఎంకౌంటర్లు జరగొచ్చు’’ అని వ్యాఖ్యానించారు.

 
మహిళలు కోరుకునే న్యాయం ఇది కాదు: రెబెకా మమెన్ జాన్
ఈ ఎన్‌కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్, క్రిమినల్ లాయర్ రెబెకా మమెన్ జాన్ స్పందించారు. మహిళలు కోరుకునే న్యాయం ఇది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ‘‘వాళ్లే నేరం చేశారు అనడానికి మన దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయా? ఏ కోర్టు అయినా వాటిని పరిశీలించిందా? ఏ కోర్టు అయినా నేరాన్ని నిర్థరించిందా? ఒకవేళ వాళ్లే నేరం చేశారు అనుకుంటే, అది నిర్థరించడానికి ఓ పద్ధతి ఉంది. దాన్ని తప్పితే, తర్వాత మీ వంతే కావచ్చు’’ అని అన్నారు.

 
‘‘అత్యాచార బాధితులకు సహాయం చేయడం చాలా సుదీర్ఘమైన, కఠినమైన ప్రక్రియ. దాన్ని మీరెప్పుడూ పాటించలేదు. వాళ్లు ఏం కోరుకుంటున్నారో, ఏం ఎదుర్కొన్నారో మీకు అవగాహన లేదు. సిగ్గుతో మీ తలలు దించుకోండి, భయంతో కూడా. ఇది మిమ్మల్ని వెంటాడుతుంది’’ అని ఆమె వ్యాఖ్యానించారు.
webdunia
ఏడేళ్లుగా తొక్కని గడప లేదు: నిర్భయ తల్లి
పోలీసులు అమలు చేసిన ఈ శిక్షపై సంతోషం వ్యక్తం చేస్తున్నానని ‘నిర్భయ’ తల్లి ఏఎన్ఐ వార్తాసంస్థతో చెప్పారు. పోలీసులు గొప్ప పనిచేశారని, దీనికి వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోకూడదని ఆమె కోరారు. ‘‘న్యాయం కోసం ఏడేళ్లుగా నేను తొక్కని గడప లేదు. నిర్భయ కేసులో దోషుల్ని ఉరి తీయాలని ఈ దేశ న్యాయవ్యవస్థకు, ప్రభుత్వాన్ని కోరుతున్నా’’ అని అన్నారు.

 
అత్యాచార నిందితులకు మరణ శిక్ష పడాలని కోరుకున్నామని, పోలీసులు అత్యుత్తమ న్యాయ నిర్ణేతలుగా నిలిచారని జాతీయ మహిళల కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ అన్నారు. ‘‘ఓ సాధారణ పౌరురాలిగా చాలా ఆనందపడుతున్నా. ఇలాంటి ముగింపే మేం కోరుకున్నాం. అయితే, ఇది న్యాయ వ్యవస్థ ద్వారా వస్తుందని అనుకున్నాం. సరైన మార్గాల్లో జరిగుండాల్సింది’’ అని వ్యాఖ్యానించారు.

 
బాధితురాలి మృతదేహాన్ని గుర్తించిన చోటనే..
నవంబర్ 28 ఉదయం చటాన్‌పల్లి వద్దే దిశ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఓ లారీ డ్రైవర్, ముగ్గురు క్లీనర్లను నిందితులుగా భావిస్తూ అరెస్టు చేశారు. దిశ స్కూటీకి పంక్చర్ వేసి, దానిని బాగు చేయిస్తామని చెప్పి, కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, చనిపోయిన తర్వాత పెట్రోలు, డీజిల్ పోసి కాల్చామని ఆ నలుగురు నిందితులు తెలిపారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

 
నవంబర్ 27 సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన దిశపై శంషాబాద్ తొండుపల్లి టోల్ ప్లాజా దగ్గర నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని వెల్లడించారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వారిని చర్లపల్లి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. దిశ అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ జరిగింది.

 
దిశ కేసు దేశమంతా సంచలనం సృష్టించింది. అనేక మంది స్పందించారు. సంతాపం తెలిపారు. రోడ్ల మీదికొచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. కేసు విచారణకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్ వచ్చింది. రాష్ట్ర హైకోర్టు సైతం ఇందుకు ఆదేశాలు జారీ చేసింది. నలుగురు నిందితులను వారం రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ షాద్ నగర్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దిశ నిందితుల ఎన్ కౌంటర్: సీఎం కేసీఆర్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదో ఇప్పుడు అర్థమైంది