Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాచ్ ఫిక్సింగ్‌‌ వ్యవహారంపై టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (15:23 IST)
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతమైన ఎంట్రీ ఇచ్చాడు. 1985లో తన మొదటి మూడు టెస్టుల్లో వరసగా మూడు సెంచరీలు కొట్టాడు. ఆ అద్భుత ప్రదర్శనతో హైదరాబాద్‌కు చెందిన ఈ యువ ఆటగాడు ఒక కొత్త ఎత్తులకు చేరుకున్నాడు. 1990లో భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ అయ్యాక, మూడు ప్రపంచ కప్‌ టోర్నీల్లో జట్టుకు నేతృత్వం కూడా వహించాడు.

 
కానీ 2000లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చినపుడు అజారుద్దీన్ అంతర్జాతీయ కెరియర్ అగాధంలోకి పడిపోయింది. ఆ తర్వాత బీసీసీఐ అతడిపై జీవితకాల నిషేధం విధించింది. కానీ 2012లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అతడిపై జీవితకాల నిషేధం అక్రమం అని చెప్పింది. కానీ అప్పటికే అతడి వయసు 49 ఏళ్లు. దాంతో, అజారుద్దీన్ మళ్లీ పిచ్‌పై దిగడం సాధ్యం కాలేదు.

 
2009లో మొహమ్మద్ అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడి నుంచి ఆయన జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ అంటే రాజకీయ ఇన్నింగ్స్ మొదలైంది. 2009 ఎన్నికల్లో అజార్ మురాదాబాద్ లోక్‌సభ ఎంపీగా గెలిచి, పార్లమెంటులో అడుగుపెట్టారు. ప్రస్తుతం అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉన్నారు.

 
- మ్యాచ్ ఫిక్సింగ్ లేదా ఆ రోజుల గురించి ప్రశ్నలు అడిగితే మీరు ఇబ్బంది పడుతున్నట్టు ఉంటుంది. వాటి గురించి మీరు ఎక్కువ మాట్లాడరు. ఎందుకు?
ఎవరినైనా తప్పుడు ప్రశ్నలు అడిగితే, వారికి ఇబ్బందిగానే ఉంటుంది. కోర్టు నన్ను నిర్దోషి అని చెప్పింది. అందుకే ఇక దాని గురించి ఏదీ మాట్లాడాలని అనుకోవడం లేదు.

 
- దీనికి సంబంధించి మీరు ఏమైనా ప్రజలకు చెప్పాలని అనుకుంటున్నారా? లేక ముందు ముందు ఆ రోజుల గురించి పుస్తకం ఏదైనా రాస్తారా?
నేను దాని గురించి ఏం చెప్పాలని అనుకోవడం లేదు. నేను ఆ పోరాటం ఎలా చేశానో, నాకు మాత్రమే తెలుసు. అవన్నీ బయటపెట్టడం సరికాదనే నాకు అనిపిస్తోంది. నేను ఏదైనా చెబితే, దానిపై వేరే వాళ్లు మరొకటి అనడం, తర్వాత ఎవరో ఇంకేదో అనడం నాకు నచ్చదు. చిన్నతనంలో అందరికీ క్రమశిక్షణ నేర్పిస్తారు. అది నాలో చాలా ఉంది. మా అమ్మనాన్నలు, అమ్మమ్మ, తాతయ్యల నుంచి నాకు చిన్నతనంలో లభించిన శిక్షణ నన్ను అలా ఏదైనా చేయడానికి ఒప్పుకోదు.

 
- కానీ, మీ ఆటకు ఎంత ప్రశంసలు లభించాలో, అంత దక్కలేదని మీకు ఏమైనా దిగులుగా ఉందా?
నాకు ఎలాంటి దిగులు లేదు. నేను పూర్తిగా కష్టపడి నా పనిచేశాను. మీడియాలో నన్ను విమర్శిస్తూ వ్యాసాలు రాస్తే, అది వారి సొంత ఆలోచన. దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడను. ఎందుకంటే నేను పెర్ఫామ్ చేశాను. నేను ఇండియాకు బాగా ఆడాను.


మనం మ్యాచ్‌లు కూడా గెలిచాం. దానికి నేను ఎప్పుడూ సంతోషిస్తా. రాసేవాళ్ల చేతులను, నోళ్లను మనం ఆపలేం. వాళ్లు ఏదైనా రాయగలరు. నాకైతే సృజనాత్మక విమర్శలు చాలా బాగా అనిపిస్తాయి. వాటిలో నేర్చుకోడానికి ఏదైనా ఉంటుంది. కానీ, ఎవరైనా అనవసరంగా విమర్శిస్తే నచ్చదు. ఒకరిని తక్కువ చేసి చూపడానికి విమర్శించడం సరికాదు.

 
- ఈరోజు సోషల్ మీడియాలో క్రికెట్ స్టార్స్‌కు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. మీ కాలంలో ఆటగాళ్లకు ఇంత మాస్ అపీల్ ఉండేదా?
ఆ కాలంలో మాకు ఎంత మాస్ అపీల్ లభించింది అనేదానిపై నేను సంతోషంగానే ఉన్నా. అయితే ఈమధ్య పబ్లిసిటీ బాగా ఎక్కువైంది. ఎక్స్‌పోజర్ ఎక్కువ. సోషల్ మీడియా ఎవరినైనా ఆకాశానికి ఎత్తేయగలదు.

 
-మీరు ట్విటర్‌లో సచిన్ తెందుల్కర్‌ను ఫాలో కావడం లేదా?
నేను తన ట్వీట్స్ చదువుతాను. ఎవరినైనా మనస్ఫూర్తిగా ఫాలో కావాలి.

 
- కపిల్ దేవ్, సునీల్ గావస్కర్, సచిన్ తెందుల్కర్‌తో మీ బంధం ఎలా ఉంటుంది?
ప్రతి ఆటగాడితో నా బంధం చాలా బాగుంటుంది, ఎవరితోనూ చెత్త సంబంధాలు లేవు. నాకు ఏదైనా సమస్య ఉంటే, దాన్ని పరిష్కరించుకోడానికి కూడా సిద్ధంగా ఉంటాను.

 
- హర్షా బోగ్లే తన పుస్తకంలో అజార్ బ్యాటింగ్‌ అర్థం చేసుకోవాలంటే, అతడి నగరం, అతడి పెంపకం గురించి కూడా తెలుసుకోవాలని రాశారు. మీరు మణికట్టుతో అంత అద్భుతమైన షాట్లు కొట్టేలా హైదరాబాద్ నగరంలో అంత ప్రత్యేకత ఏంటి?
నా మణికట్టు గురించి నాక్కూడా మొదట్లో తెలీదు. నేను నా మొదటి సెంచరీ కొట్టినపుడు, మీడియాలో దాని గురించి ప్రస్తావించారు. మేం ఆడేటప్పుడు అంతగా ఎక్స్‌పోజర్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు అండర్-19, అండర్-16లో ఆడే ఆటగాళ్లకు కూడా చాలా ఎక్స్‌పోజర్ వచ్చేస్తుంది. ఇప్పుడు టీవీ, కెమెరా, ప్రెస్ ఎక్కువుంది. నేను సెంచరీ చేసేవరకూ నాకు ఎలాంటి ఎక్స్‌పోజర్ లేదు.

 
అప్పుడు తను మణికట్టుతో ఆడే ఆటగాడని జనం అనేవాళ్లు. నాకు మణికట్టు గురించి అసలేం తెలీదు. అది నేచురల్. నేను దానికోసం ప్రత్యేకంగా ఎలాంటి ప్రాక్టీస్ చేయలేదు. మా మామయ్య నాకు బేసిక్ క్రికెట్ నేర్పించారు. నేను అలాగే ప్రాక్టీస్ చేశాను. నేను నా బేసిక్స్‌ను ఎప్పుడూ వదల్లేదు.

 
- మీకు అత్యంత సవాలుగా అనిపించిన బౌలర్ ఎవరు?
వెస్టిండీస్ బౌలర్ కోర్టనీ వాల్ష్ బౌలింగ్ నాకు ఎప్పుడూ కష్టంగా అనిపించేది. తన బౌలింగ్ యాక్షన్ చాలా కష్టంగా ఉంటుంది. అందుకే తను బంతి లోపలికి వేసినా, బౌన్స్ అయినా, బయటకు వెళ్లినా ఆ బాల్‌ను ఫ్లిక్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అది చాలా సవాలుగా ఉంటుంది. క్రికెట్‌లో బౌలింగ్ యాక్షన్ ఎంత బాగుంటే, బ్యాటింగ్ అంత సులభంగా ఉంటుంది. అతడు మనల్ని మూడునాలుగు సార్లు అవుట్ చేసినా, రన్స్ చేయడం సులభంగా ఉంటుంది. కానీ వాల్ష్ లాంటి యాక్షన్ ఉండే బౌలర్ వచ్చినపుడు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది.

 
- మీరు ఫీల్డ్‌లో అన్నివైపులా ఫోర్లు, సిక్సులూ కొట్టేవారు. కానీ ఫీల్డులో దిగుతున్నప్పుడు మీరు ఎలాంటి షాట్స్ గురించి ఆలోచించేవారు?
అలా డిసైడ్ చేసి ఆడడం ఉండదు. మొదట అందరూ నన్ను లెగ్-సైడ్‌లో బాగా ఆడుతావు అనేవారు. కానీ నేను చేసిన సెంచరీల్లో మంచివన్నీ ఆఫ్-సైడ్ సెంచరీలే. పరిస్థితులకు తగ్గట్టు ఆడేవాడే మంచి ఆటగాడు.

 
- గత మూడు దశాబ్దాలుగా క్రికెట్ చాలా పాపులర్ అయ్యింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల నుంచి వచ్చే వాళ్లంతా క్రికెటర్ కావాలని కలలు కంటున్నారు. మహిళా క్రికెట్ టీమ్ కూడా అద్భుతాలు చేస్తోంది. వీటన్నిటి గురించి మీరు ఏం చెబుతారు?
అత్యంత ముఖ్యంగా కావల్సింది టాలెంట్. మీరు బాగా ఆడగలిగితే, అప్పుడే క్రికెట్‌కు సెలక్ట్ అవుతారు. స్కిల్ లేదంటే, క్రికెట్ గురించి ఆలోచించి ఎలాంటి ప్రయోజనం ఉండదు. స్కిల్ ఉంటే, కష్టపడితే అది మరింత మెరుగవుతుంది. ఇప్పుడు ఎన్ని క్రికెట్ అకాడమీలు ఉన్నాయంటే, వాటి నుంచి వంద, రెండు వందల మంది వస్తుంటారు. వారిలో అందరూ ప్లేయర్ అయిపోవాలంటే కష్టం.

 
- క్రికెట్ నుంచి మీరు రాజకీయాల్లోకి కూడా వచ్చారు. ముందు ముందు మిమ్మల్ని మీరు ఏ స్థాయికి చేరుతారని అనుకుంటున్నారు?
ప్రస్తుతం నేను రాజకీయాల్లో ఉన్నాను. మా పార్టీ 2009లో నన్ను మురాదాబాద్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయించినందుకు సంతోషంగా ఉంది. అది ఒక గోల్డెన్ చాన్స్. ఒక భిన్నమైన అనుభవం. క్రికెట్ ఆడడం ప్రారంభించిన 11-12 ఏళ్లకు నాకు భారత క్రికెట్‌లో చాన్స్ దొరికింది. కానీ, రాజకీయాల్లో ఒక నెలలోనే ఫలితాలు వచ్చేశాయి.

 
మురాదాబాద్ ప్రజలు నాకు చాలా ప్రేమను అందించారు. టికెట్ వచ్చాక, నేను మురాదాబాద్ వెళ్లినప్పుడు నాలుగైదు కిలోమీటర్లు వెళ్లడానికి ఏడెమినిది గంటలు పట్టేది. అంత జనం ఉండేవారు. వారి అభిమానం నేనెప్పటికీ మర్చిపోను.

 
- మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో మీపై విధించిన జీవితకాల నిషేధంపై హైకోర్టు తీర్పు ఇచ్చినపుడు, మీ కేసులో దర్యాప్తునకు ఫాలో-అప్ లేదంది. దేశ క్రికెట్ సంస్థల్లో దీనికి సంబంధించి నిబంధనల్లో భారీ మార్పులు అవసరం అని మీకు అనిపిస్తోందా?
చాలా మార్పులు జరిగాయి. ఇప్పుడు పరిస్థితి చాలా మెరుగైంది. దర్యాప్తు నిష్పాక్షికంగా ఉంటుంది. నిబంధనల ప్రకారం ఉంటుంది. అందుకే, నాకు ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయని అనిపిస్తోంది.

 
- ఇండియా-శ్రీలంక మధ్య ఒక వివాదాస్పద మ్యాచ్ ఉంది. అందులో నిర్ణయం మీరే తీసుకున్నారని చెబుతారు?
నిర్ణయం మొత్తం జట్టు కలిసి తీసుకుంది. అది నా ఒక్కడిదే కాదు. ఏ నిర్ణయం తీసుకున్నామో అలాగే చేశాం. కానీ ఫలితం దక్కలేదు. ఏం ఫర్వాలేదు. ప్రతిదీ ఇలాగే జరగాలని ఉండదు. మనం జరిగిపోయింది ఆలోచిస్తూ కూచుంటే, ముందుకు వెళ్లడం కష్టం.

 
- మీరు ముందు ముందు ఏం చేయాలనుకుంటున్నారు?
నేను ఆసోసియేషన్‌ను ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నా. రంజీ ట్రోఫీలో విజయం కోసం కృషి చేస్తాం. ఏ అసోసియేషన్ అయినా రంజీ ట్రోఫీ గెలవాలనే అనుకుంటుంది. వాటికి ఇది అత్యంత ముఖ్యమైన విషయం. మేం 1987లో రంజీ గెలిచాం.

 
ఆ రంజీ ట్రోఫీలో నేను ఆడలేదు. ఎందుకంటే అప్పుడు నేను టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాను. ఆ సమయంలో నేను చాలా సంతోషించా. ఎందుకంటే ఏ ప్లేయర్ అయినా హైదరాబాద్ తరఫున ఆడుతున్నప్పుడు రంజీ ట్రోఫీ గెలవాలనే కోరుకుంటాడు. నేను కూడా నా పదవీకాలంలో మా టీమ్ రంజీ ట్రోఫీ గెలవాలని అనుకుంటున్నా. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

బహుముఖ ప్రజ్నాశాలి శ్వేతప్రసాద్ కు బిస్మిలా ఖాన్ అవార్డు

సెల్ ఫోన్లు రెండూ ఇంట్లో వదిలేసి రాంగోపాల్ వర్మ పరార్? ఇంటి ముందు పోలీసులు

ఆ ఫ్యామిలీస్ కీ వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ కనెక్ట్ అవుతుంది : డైరెక్టర్ ఇ సత్తిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments