దీపావళి తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పతాక స్థాయికి చేరింది. దీంతో ఆప్ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని గౌతమ్ గంభీర్ ఇటీవల విమర్శలు గుప్పించాడు. అయితే ఈ కాలుష్య నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై నవంబర్ 15వ తేదీన పార్లమెంటరీ ఫ్యానల్ సమావేశమై చర్చించాలని నిర్ణయించుకుంది.
కానీ.. టెస్టు మ్యాచ్ కామెంట్రీ కారణంగా గౌతమ్ గంభీర్ ఈ మీటింగ్‌కి డుమ్మాకొట్టాడు. ఇదే సాకుగా తీసుకుని ఆప్ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ పోస్టర్లు అతికించేశారు. అదే సమయంలో వీవీఎస్ లక్ష్మణ్‌తో పాటు గౌతీ జిలేబీ తింటున్న ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. దీంతో గంభీర్ సమావేశానికైతే రాలేకపోయాడు కానీ, జిలేబీలు తినడానికి వెళ్తున్నాడంటూ కామెంట్లు వినిపించాయి.
వీటిపై స్పందించాలంటూ మాజీ క్రికెటర్‌ను మీడియా అడిగిన ప్రశ్నకు గంభీర్ తెలివిగా తప్పించుకున్నాడు. ''నేను జిలేబి తినడం వల్లనే ఢిల్లీలో కాలుష్యం పెరిగిందా..? అలా అయితే చెప్పండి. ఇక నేను జిలేబీ తినడమే మానేస్తా" అని చెప్పాడు. పది నిమిషాల్లోనే తనను ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టేశారు. ఈ కష్టమేదో ఢిల్లీ కాలుష్యం నివారించడంపై ఫోకస్ చేస్తే స్వేచ్ఛగా గాలి తీసుకోవచ్చునని గంభీర్ వ్యాఖ్యానించాడు.
ఢిల్లీలో వాయు కాలుష్యానిరి వ్యతిరేకంగా పోరాడేందుకు తగినంత కృషి చేశానని.. ఇందులో తన నియోజకవర్గంలో ఎయిర్ ఫ్యూరిఫైయర్లను ఏర్పాటు చేసే ప్రణాళిక కూడా వుందన్నాడు. కామెంట్రీ కోసం స్పోర్ట్స్ ఛానెళ్లలో కనిపించే గంభీర్, ఇండోర్‌లో పోహా, జలేబీలు తింటూ కనిపించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.