దేశ రాజధాని దిల్లీ నగరం కాలుష్యం గుప్పిట్లో చిక్కుకుంది. కాలుష్యం కారణంగా వాయునాణ్యత పూర్తిగా క్షీణించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. నవంబరు 5 వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. 50 లక్షల మాస్కులను ప్రజలకు పంపిణీ చేసింది. వాయు నాణ్యత పూర్తిగా క్షీణించడంతో దిల్లీ నగరం, హరియాణా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన సుప్రీంకోర్టు పలు నియంత్రణలు విధించింది.
బాణసంచా వినియోగాన్ని నిషేధించింది. వారం రోజుల పాటు భవన నిర్మాణ పనులు నిలిపివేయాలని ఆదేశించింది. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాజా పరిస్థితిపై స్పందిస్తూ 'దిల్లీ గ్యాస్ చాంబర్'లా మారిందంటూ ట్వీట్ చేశారు.
కాలుష్యం ఏ స్థాయిలో ఉందంటే..
దిల్లీలో ప్రస్తుతం పీఎం 2.5 కాలుష్యం ఘనపు మీటరుకు 533 మైక్రోగ్రాములు ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం 24 గంటల వ్యవధిలో పీఎం 2.5 సగటు 25 మైక్రోగ్రామ్/ఘనపు మీటరుకు దాటరాదు. ప్రజలు తాజా పరిస్థితిపై ఆందోళన చెందుతూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నారు. కాలుష్య తీవ్రతను చెప్పేలా ఫొటోలు తీసి #DelhiAirQuality and #FightAgainstDelhiPollition హ్యాష్‌టాగ్‌లతో పోస్ట్ చేస్తున్నారు.
దిల్లీలో ఏటా నవంబరు, డిసెంబర్ నెలల్లో కాలుష్యం పెరగడానికి పంజాబ్, హరియాణాల్లో రైతులు పంట వ్యర్థాలను పొలాల్లోనే తగులబెట్టడమూ కారణమవుతోంది. భవన నిర్మాణం వల్ల ధూళి, పారిశ్రామిక, వాయు కాలుష్యం కూడా కారణమవుతున్నాయి. సుమారు 20 లక్షల మంది రైతులు 2.3 కోట్ల టన్నుల పంట వ్యర్థాలను ఏటా శీతాకాలంలో తగలబెడుతుంటారు. ఈ పొగలో కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి విషవాయువులుంటాయి.
2012 నుంచి 2016 మధ్య దిల్లీలో ఏర్పడిన కాలుష్యానికి సగం కారణం పంట వ్యర్థాలు కాల్చడమేనని శాటిలైట్ డాటా ఆధారంగా హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనకర్తలు తెలిపారు. నాసా శాటిలైట్ ఫొటోల్లోనూ ఈ పంట వ్యర్థాలు తగలబెట్టడం వల్ల ఏర్పడుతున్న కాలుష్యం కనిపిస్తోంది.
* పీఎం 2.5 అంటే 2.5 మిల్లీ మైక్రాన్ల మేర వ్యాసం ఉన్న పార్టిక్యులేట్ మేటర్(కాలుష్య కారక పదార్థాల సూక్ష్మ రేణువులు)
* పీఎం 10 కాలుష్యం అంటే 10 మిల్లీ మైక్రాన్ల వ్యాసమున్న పార్టిక్యులేట్ మేటర్.
ఇలాంటి అతి సూక్ష్మ రేణువులు శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లో చేరి వ్యాధులకు దారితీస్తాయి.