ఢిల్లీలో వాయు కాలుష్యానికి వారే కారణం : సుప్రీంకోర్టు

సోమవారం, 4 నవంబరు 2019 (18:24 IST)
ఢిల్లీలో వాయుకాలుష్యం అంతకంతకూ పెరిగిపోవడానికి ప్రధాన కారణం రైతులు, మూడు రాష్ట్రాల ప్రభుత్వాలేనని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతి యేడాది రైతులు ఇష్టానుసారంగా పంటలను తగులబెడుతున్నారనీ, ఈ కారణంగా వాయు కాలుష్యం పెరిగిపోతోందని న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. 
 
గత కొన్ని రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన విషయం తెల్సిందే. ఈ కాలుష్యాన్ని అదుపు చేయలేక విఫలమవుతున్న రాష్ట్ర ప్రభుత్వాలపైన, అధికారులపైన సుప్రీంకోర్టు మండిపడింది. ఈ ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలు పోవడానికి వారి మానాన వారిని వదిలేస్తున్నాయని తీవ్రంగా వ్యాఖ్యానించింది. 
 
ఈ కాలుష్యం కారణంగా పౌరులు తమ అమూల్యమైన జీవన కాలాన్ని కోల్పోతున్నారని, ఈ విధమైన వాతావరణంలో మనం బతకగలుగుతామా అని న్యాయమూర్తులు సూటిగా ప్రశ్నించారు. మనం బతకాలంటే ఇది సరైన మార్గం కాదు.. పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రైతులు పంటలను తగులబెట్టడం ప్రతి యేడాదీ ఆనవాయితీగా మారిందని గుర్తు చేశారు. 
 
తమలో సహనం నశించిందని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ఈ నిర్వాకానికి బాధ్యత వహించాలని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రతి సంవత్సరం ఢిల్లీ ఈ కాలుష్యం బారిన పడుతోందని, కానీ మనం ఏమీ చేయలేక నిస్సహాయంగా చేతులు ముడుచుకుని కూర్చున్నామన్నారు. ఈ నగరమే కాదు.. పంజాబ్, హర్యానా రాష్ట్రాలు కూడా ఈ పొల్యూషన్‌కి గురవుతున్నాయి.. ఆయా ప్రభుత్వాలతో బాటు పంచాయతీలు కూడా ఇందుకు బాధ్యత వహించాల్సిందే అని కోర్టు వ్యాఖ్యానించింది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఎల్వీకి తేరుకోలేని షాకిచ్చిన సీఎం జగన్.. కారణమిదే...