Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెత్తను కాల్చితే రూ.లక్ష అపరాధం : రాజధానిని మార్చాలంటూ నెటిజన్ల ట్వీట్స్

చెత్తను కాల్చితే రూ.లక్ష అపరాధం : రాజధానిని మార్చాలంటూ నెటిజన్ల ట్వీట్స్
, సోమవారం, 4 నవంబరు 2019 (18:20 IST)
ఇకపై దేశ రాజధాని ప్రాంతంలో చెత్తను కాల్చితే లక్ష రూపాయల మేరకు అపరాధం విధించనున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఢిల్లీలో కాలుష్యం మితిమీరిన నేప‌థ్యంలో సోమవారం ఈ మేరకు కీలక తీర్పును వెలువరించింది. 
 
దేశ రాజ‌ధాని ప‌రిస‌ర ప్రాంతాల్లో నిర్మాణ ప‌నులు జ‌రిగినా భారీ జ‌రిమానా విధించాల‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం చెప్పింది. చెత్త‌ను డంప్ చేసిన వారికి ఐదు వేల రూపాయల అపరాధం విధించాలని కోర్టు ఆదేశించింది. 
 
త‌మ ఆదేశాల‌ను ఢిల్లీ, పంజాబ్‌, హ‌ర్యానా, యూపీ రాష్ట్రాలు త‌ప్ప‌కుండా పాటించాల‌ని, వాటిని ప్ర‌జ‌ల‌కు చేరేలా చూడాల‌ని కోర్టు పేర్కొంటూ ఈ కేసు తదుపరి తీర్పును ఈ నెల ఆరో తేదీకి వాయిదా వేసింది. 
 
ఇదిలావుంటే, దేశ రాజధానిని ఢిల్లీ నుంచి వేరే చోటుకు మార్చాలనే డిమాండ్‌ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. దేశ రాజధానిగా ఢిల్లీ ఏమాత్రం అనువైన ప్రాంతం కాదని, ఢిల్లీ నుంచి రాజధానిని వేరే నగరానికి మార్చే సమయం ఆసన్నమైందంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. 
 
ఢిల్లీ నగరం డేంజర్‌గా మారుతోందని, రాజధానిని వెంటనే బెంగళూరు లేదా చెన్నైకు తరలించాలని కొందరు డిమాండ్ చేస్తుంటే.. మరికొంతమందేమో ఛత్తీస్‌ఘర్, దౌల్తాబాద్, నాగపూర్‌లకు తరలించాలని అభిప్రాయపడ్డారు. 
 
ఇదిలావుంటే, ఢిల్లీలో వాయు కాలుష్యం తారా స్థాయికి చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) రోజురోజుకూ దారుణంగా పడిపోతోంది. ఆదివారం మూడేళ్ల కనిష్టాని(494)కి పడిపోయింది. ధూళి, పొగమంచుతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. గృహాల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. 
 
ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోతోంది. నేటి నుంచి వాహనాల సరి-బేసి విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. గతంలో కూడా రెండుసార్లు సరి-బేసి విధానాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం అమలు చేసింది. అయినా ఢిల్లీలో కాలుష్యం మాత్రం తగ్గలేదు సరికదా.. మరింత విజృంభిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తహసీల్దార్‌తో మాట్లాడతానని వెళ్లి.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు..