Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఐ నాగేశ్వర రావు అరెస్ట్... వివాహితను బెదిరించి, అత్యాచారం చేసిన ఆరోపణల కేసులో కొత్త కోణం

Webdunia
సోమవారం, 11 జులై 2022 (12:37 IST)
మారేడుపల్లి ఇనస్పెక్టర్ నాగేశ్వర రావును పోలీసులు పట్టుకున్నారు. ఎస్వోటీ, వనస్థలిపురం పోలీసులు ఆదివారం రాత్రి 8.30 ప్రాంతంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వనస్థలిపురం ఏసీపీ కేసు విచారిస్తున్నారు. నాగేశ్వర రావు మహిళను బెదిరించాడన్న ఫిర్యాదుపై పలు అనుమానాలు వచ్చాయి. ''వారికి ముందే వివాహేతర సంబంధం ఉంది. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలనుకున్న భర్త టెక్నాలజీ వాడాడు. ఇన్‌స్పెక్టర్ తన మొబైల్ లొకేషన్ ట్రాక్ చేస్తున్నాడని గుర్తించిన ఫిర్యాదుదారు భర్త తన మొబైల్ వదిలేసి నేరుగా వచ్చి పట్టుకున్నాడు'' అని ఒక పోలీసు అధికారి బీబీసీతో చెప్పారు.

 
ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు మీద రేప్, హత్యాయత్నం, ఆయుధాలతో కిడ్నాప్ ప్రయత్నం సెక్షన్ల కింద కేసులు పెట్టారు అభియోగాలు దాఖలయ్యాయి. ఏప్రిల్‌లో రాడిసన్ బ్లూ హోటల్‌లో డ్రగ్స్ కేసు పట్టుకుని, బంజారా హిల్స్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న మరునాడే ఆయనపై ఈ కేసులు నమోదయ్యాయి.

 
రాచకొండ కమిషనరేట్ కథనం...
రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయం చెప్పిన వివరాల ప్రకారం, నాగేశ్వర రావు గతంలో టాస్క్ ఫోర్స్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసేవారు. 2018లో బేగంపేటలో క్రెడిట్ కార్డుల మోసానికి సంబంధించిన కేసు ఒకటి ఆయన డీల్ చేశారు. ఆ కేసులో నల్గొండకు చెందిన, హైదరాబాద్‌లో నివాసం ఉంటోన్న ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. తరువాత అతను బయటకు వచ్చారు. ఆ క్రెడిట్ కార్డు మోసం కేసులో అరెస్టు అయిన వ్యక్తిని తరువాత తన ఫాంహౌస్‌లో పనికి పెట్టుకున్నారు సీఐ నాగేశ్వర రావు. జీతం అతని భార్య అకౌంట్‌లో వేసేవారు. దాదాపు ఏడాదిన్నర పాటు ఆ వ్యక్తి నాగేశ్వర రావు ఫాంహౌస్‌లో పనిచేశారు. 2021 ఫిబ్రవరిలో ఆయన పని మానేశారు.

 
అయితే, సీఐ నాగేశ్వర రావు అప్పటి నుంచి ఆ భార్యాభర్తల కదలికలు గమనిస్తున్నారు. పోలీసులకు సహజంగా సెల్ ఫోన్ లొకేషన్ ట్రాక్ చేయగల అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగించి, ఈ భార్యాభర్తలు వేరువేరు చోట్ల ఉన్న విషయాన్ని గుర్తించాడు. భార్య హైదరాబాద్‌లో, భర్త వేరే ఊరిలో ఉన్నట్టు సెల్ ఫోన్ సిగ్నల్ చూపించడంతో ఒంటరిగా ఉన్న బాధిత మహిళ దగ్గరకు నాగేశ్వర రావు వెళ్లాడు.

 
బాధిత మహిళ చెప్పిన కథనం ప్రకారం, ఆమె భర్త తన పిల్లలను ఊరిలో వదిలి రావడానికి వెళ్లాడు. ఈ విషయం గుర్తించిన సీఐ నాగేశ్వర రావు జూలై 6వ తేదీన మహిళకు వాట్సప్ కాల్ చేశాడు. భర్త ఇంట్లో లేడు కాబట్టి తాను ఇంటికి వస్తున్నట్టు చెప్పాడు. దీంతో ఆ మహిళ ఈ విషయాన్ని వెంటనే భర్తకు చెప్పింది. అది విన్న భర్త వెంటనే ఊరి నుంచి బయల్దేరి హైదరాబాద్ వచ్చాడు. 7వ తేదీ రాత్రి 9.30 ప్రాంతంలో నాగేశ్వర రావు వనస్థలిపురంలో ఉన్న ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. ఆమెను కొట్టి, బలవంతం చేశాడు.

 
సరిగ్గా అదే సమయంలో బాధితురాలి భర్త అక్కడకు వచ్చాడు. లోపలికి వెళ్లి అక్కడ కనిపించిన నాగేశ్వర రావును కర్రతో కొట్టాడు. దీంతో వెంటనే నాగేశ్వర రావు తన వద్ద ఉన్న పోలీసు తుపాకీ తీసి బాధితురాలి భర్తను భయపెట్టాడు. ఆ తుపాకీతోనే ఆమె భర్త తలపై కొట్టాడు. తక్షణం వారు హైదరాబాద్ వదలి వెళ్లాలని బెదిరించాడు. లేకపోతే వారిపై వ్యభిచారం కేసు పెడతానని బెదిరించాడు. వారిని తన కారులో ఎక్కించాడు. బాధితురాలు వెనుక కూర్చోగా, భర్త కారు నడుపుతున్నాడు. సీఐ డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నాడు.

 
అయితే, ఆ కారుకు ఇబ్రహీంపట్నం దగ్గర ప్రమాదం జరిగింది. (ఈ ప్రమాదం గురించి వేరే కేసు ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో నమోదైంది.) ప్రమాదం జరగగానే తను, తన భర్త కారు నుంచి పారిపోయి వచ్చినట్టు 8వ తేదీన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత మహిళ పేర్కొంది. ''ఫిర్యాదు అందుకున్న వెంటనే బాధిత మహిళను వైద్య పరీక్షలకు పంపించాం. నివేదిక రావాల్సి ఉంది. ఆయుధాలను వాడి కిడ్నాప్‌కి ప్రయత్నించడం, అక్రమంగా చొరబడడం, అత్యాచారం కేసులు నమోదు చేశాం. ఐపీసీతో పాటు, ఆయుధాల చట్టం కింద కేసులు పెట్టాం'' అని బీబీసీతో వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్ ఎ. సత్యనారాయణ చెప్పారు.

 
గతంలో కూడా నాగేశ్వర రావు బాధిత మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన మహిళ కథనం ప్రకారం, ఆమె భర్త నాగేశ్వర రావు దగ్గర పనిచేసేప్పుడే, తనపట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. ''ఒకసారి నా భర్త ఫోన్ ఎత్తకపోతే, ఇంటికి వచ్చి నన్ను తన ఫాంహౌస్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. నేను వెంటనే నా భర్తకు సమాచారం ఇచ్చాను. దీంతో నా భర్త నాగేశ్వర రావుకు ఫోన్ చేసి నన్ను వదిలేయాలని బెదిరించాడు. లేకపోతే ఈ విషయం ఆయన భార్యా పిల్లలకు చెబుతానని బెదిరించాడు. దీంతో భయపడ్డ నాగేశ్వర రావు నన్ను వదిలేసి, తన సంగతి ఎవరికీ చెప్పవద్దని వేడుకున్నాడు'' అంటూ పాత సంగతి గురించి ఫిర్యాదులో రాసింది బాధిత మహిళ.

 
అయితే ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న నాగేశ్వర రావు, తమపై కక్ష పెంచుకుని అక్రమ కేసుల్లో ఇరికిస్తానని బెదిరించినట్టు వారు ఫిర్యాదులో రాశారు. ''ఆ ఘటన జరిగిన కొద్ది కాలానికే నా భర్తను వేరే పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. అక్కడ స్టేషన్లో నాగేశ్వర రావు ఉన్నాడు. నా ముందే నా భర్తను కొట్టి, నా భర్త చేతుల్లో గంజాయి ప్యాకెట్లు పెట్టి ఫోటోలు తీశారు. మాట వినకపోతే గంజాయి కేసు పెడతానని బెదిరించారు'' అంటూ గతంలో జరిగిన విషయాలను కూడా బాధిత మహిళ తాజా ఫిర్యాదులో పేర్కొన్నారు.

 
ఇందులో సీఐ నాగేశ్వర రావును ప్లాన్ చేసి ఇరికించారు అన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రెస్ మీట్లు నిర్వహించిన వనస్థలిపురం ఏసీపీని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు... అన్ని కోణాల్లో విచారిస్తున్నాం అని సమాధానం చెప్పారాయన. అయితే సీఐ నాగేశ్వర రావు వార్తల్లో ఉండటం ఇదే మొదటిసారి కాదు. ఏప్రిల్ నెలలో సంచలనం సృష్టించిన రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ కేసు పట్టుకుంది నాగేశ్వర రావే. టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ హోదాలో ఆయన రాడిసన్ హోటల్లో సోదాలు చేసి కేసు పెట్టారు. దీంతో అప్పుడు బంజార హిల్స్ సీఐగా ఉన్న శివచంద్రను డ్రగ్స్ పట్టుకోలేకపోయినందుకు బాధ్యుడిని చేస్తూ బదిలీ చేసి, ఆయన స్థానంలో నాగేశ్వర రావును బంజారహిల్స్ ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు.

 
నాగేశ్వర రావు అక్కడ సరిగ్గా మూడు నెలలు ఉన్నారు. జూన్ 29న నాగేశ్వర రావును బంజార హిల్స్ నుంచి మారేడుపల్లి ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ చేశారు కమిషనర్ సీవీ ఆనంద్. తాజా ఫిర్యాదు నేపథ్యంలో కమిషనర్ ఆనంద్, నాగేశ్వర రావును సస్పెండ్ చేశారు. మరోవైపు నాగేశ్వర రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు కర్నూలుకు చెందిన మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్. పెద్ద వ్యాపారవేత్త అయిన వెంకటేశ్, ఒక కేసులో నాగేశ్వర రావు తన పేరును అక్రమంగా ఇరికించి డబ్బు వసూలు చేసే ప్రయత్నం చేసినట్టు ఆరోపించారు.

 
ప్రస్తుతం మెక్సికో పర్యటనలో ఉన్న టీజీ వెంకటేశ్ అక్కడి నుంచి ఒక వీడియో విడుదల చేశారు. ''ఈ నాగేశ్వర రావు అనే ఇన్‌స్పెక్టర్ చాలా మంది భవిష్యత్తును దెబ్బతీసే తీరులో వెళ్తున్నారు. నా పేరు రాజ్యసభకు రీ నామినేషన్‌కి వెళ్లే ముందు అనవసరంగా ఒక ఆస్తి వివాదంలో నన్ను ఇరికించి, ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు. కేసు పెట్టిన వారే నాకు సంబంధం లేదని రాతపూర్వకంగా ఇచ్చినా ఆ కాగితం పక్కన పెట్టి చాలా రోజులు ఎఫ్‌ఐఆర్‌లో నా పేరు తీయకుండా ఆలస్యం చేశారు. పై అధికారులు, నాయకులకు కోట్లు ఇచ్చి వచ్చాను ఈ పోస్టుకు. నాకు కూడా కోట్ల రూపాయలు కావాలి ఈ పోస్టులో అని ప్రచారాలు చేశాడు. పై అధికారులు, నాయకులకు చెడ్డపేరు తేవడం అతనికి అలవాటే. ఇలాంటి వారికి జీవితఖైదు విధించడం ద్వారా వారు భవిష్యత్తులో ఇలా చేయకుండా ఉంటారు'' అని వీడియోలో అన్నారు టీజీ వెంకటేశ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పీరియడ్స్‌ నొప్పి అని చెప్పినా నటించమని అనేవారు: నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్

తమ 3వ ఎడిషన్‌తో తిరిగి వచ్చిన మ్యూజిక్ ఫెస్టివల్ రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

శాసనసభ్యుడిగా నీటి సమస్యను పరిష్కరించాను : నందమూరి బాలక్రిష్ణ

అజిత్ కుమార్ యాక్ష‌న్ మూవీ పట్టుదల ఫిబ్ర‌వ‌రి రిలీజ్‌

సోను మోడల్ బ్యూటీ పార్లర్ లో ఏం చేశాడనేది లైలా టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments