Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Boris Johnson: బ్రిటన్‌ కాబోయే ప్రధాన మంత్రి ఎవరు, రిషి సునాక్‌కు ఉన్న అవకాశాలేంటి?

Advertiesment
Rishi Sunak
, శుక్రవారం, 8 జులై 2022 (12:53 IST)
బోరిస్ జాన్సన్ రాజీనామాతో ప్రధాన మంత్రి పదవికి ఎన్నికలు నిర్వహించనున్నారు. తర్వాత ప్రధాన మంత్రి కాబోయేందుకు అభ్యర్థులు మొదటగా ఎంపీల మద్దతు కూడగట్టాలి. మొదటి ఇద్దరు అభ్యర్థులకు ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే, ఇంతకీ బరిలో ఎవరెవరు ఉండొచ్చు?

 
రిషి సునాక్
ఒకప్పుడు కన్జర్వేటివ్ పార్టీ భవిష్యత్ నాయకుడిగా రిషి సునాక్ పేరు వార్తల్లో మార్మోగేది. అయితే, ఆయన భార్య పై పన్ను చెల్లింపుల వివాదం రావడంతో గత కొన్ని నెలలుగా రిషి ప్రతిష్ఠ దెబ్బతింది. మరోవైపు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని ఆయనకు జరిమానా కూడా విధించారు. 2015లో రిషి ఎంపీ అయ్యారు. నార్త్ యార్క్‌షైర్ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ఫిబ్రవరి 2020 నుంచి ఎక్స్‌చెకర్ ఛాన్సెలర్‌గానూ ఆయన పనిచేస్తున్నారు.

 
కరోనావైరస్ వ్యాప్తి నడుమ లాక్‌డౌన్ విధించినప్పుడు ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్లకుండా ఆయన భారీగా నిధులు అందుబాటులో ఉండేలా చూసేవారు. దీంతో ప్రజల్లో ఆయనకు ఆదరణ పెరిగింది. తాజా సంక్షోభం మొదట్లోనే క్యాబినెట్ పదవికి రాజీనామా చేసిన వారిలో రిషి ఒకరు. రిషి రాజీనామాతో ఆయన స్నేహితుడు సాజిద్ వాజిద్ కూడా రాజీనామా చేశారు. వరుస రాజీనామాల నడుమ బోరిస్ జాన్సన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

 
లిజ్ ట్రస్
ప్రధాన మంత్రి పదవికి పోటీ చేయాలని బోరిస్ జాన్సన్ భావించినప్పుడు ఆయనకు ముందుగా మద్దతు పలికిన నాయకుల్లో లిజ్ ట్రస్ ఒకరు. జాన్సన్‌కు గట్టి మద్దతునిచ్చే లిజ్.. ప్రస్తుతం విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్నారు. బ్రిటన్‌ విదేశాంగ మంత్రిగా పనిచేసిన రెండో మహిళ లిజ్. ఇరాన్‌లో బందీగా మారిన నాజనిన్ జఘారీ ర్యాట్‌క్లిఫ్‌ను ఆరేళ్ల తర్వాత విడిపించడం, రష్యాతోపాటు ఓలిగార్క్‌లపైనా ఆంక్షలు విధించడం తదితర విజయాలను ఆమె సాధించారు.

 
2010 నుంచి లిజ్ ఎంపీగా ఎన్నికవుతున్నారు. ప్రస్తుతం సౌత్ వెస్ట్ నార్‌ఫ్లోక్‌కు ఆమె ప్రతినిధ్యం వహిస్తున్నారు. ఆర్థిక, వాణిజ్య అంశాల్లో ఉదారవాద విధానాలతో కన్జర్వేటివ్ పార్టీలో తన కంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, 2015లో చీస్ దిగుమతులపై ఇచ్చిన ఒక ప్రసంగం వల్ల ఆమెను ట్రోల్ చేశారు. ఇది ఆమె కెరియర్‌పై పెద్దగా ప్రభావం చూపలేదు. ఆ తర్వాత వరుసగా ఆమె క్యాబినెట్ పదవులు చేపట్టారు. బ్రెగ్జిట్ అనంతర వాణిజ్య ఒప్పందాల మంత్రిగానూ ఆమె పనిచేశారు.

 
సాజిద్ జావిద్
ప్రస్తుత సంక్షోభంలో మొదట స్పందించింది బ్రోమ్స్‌గ్రోవ్ ఎంపీ సాజిద్ జావిద్. నిజాయితీ ఇక్కడ చాలా ముఖ్యమని తన రాజీనామా సమయంలో చెప్పారు. ‘‘ఈ సమస్య అగ్ర నాయకత్వం నుంచే మొదలైంది’’అని ఆయన వ్యాఖ్యానించారు. 2019లోనూ ఆయన నాయకత్వం కోసం పోటీచేశారు. అయితే, తుది నలుగురు జాబితా వరకు ఆయన చేరుకోగలిగారు. దీంతో జాన్సన్‌కు మద్దతు ప్రకటిస్తూ పోటీ నుంచి ఆయన తప్పుకున్నారు. మొదటగా జావిద్‌కు ఛాన్సెలర్ పదవి దక్కింది. అయితే, ఆరు నెలల తర్వాత ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఆరోగ్య మంత్రిగా నియమితులయ్యారు. ధరలు, అప్పుల పెరుగుదల గురించి జావిద్ తరచూ మాట్లాడేవారు. రోచర్డేల్‌లో 1969లో ఆయన జన్మించారు. బ్రిటన్‌లో స్థిరపడిన పాకిస్తానీ కుటుంబంలో జన్మించిన తొలి తరం నాయకుడు ఈయన. జావిద్ తండ్రి బస్ కండక్టరుగా పనిచేసేవారు. 2010లో తొలిసారిగా ఎంపీగా జావిద్ ఎన్నికయ్యారు.

 
జెరెమీ హంట్
విదేశాంగ మంత్రిగా పనిచేసిన జెరెమీ హంట్‌కు చాలా మంది ఎంపీల మద్దతు ఉంది. 2019లో బోరిస్ జాన్సన్ తర్వాత స్థానం జెరెమీదే. కోవిడ్-19 వ్యాప్తి సమయంలో ప్రభుత్వ విధానాలను జెరెమీ దగ్గరుండి పరిశీలించారు. ఆరోగ్య వ్యవహారాల కమిటీకి నేతృత్వం వహించారు. అయితే, ఇప్పుడు మళ్లీ నాయకత్వ పదవికి పోటీచేస్తే, ఎంపీలు తనకు మద్దతు పలుకుతారని ఆయన భావిస్తున్నారు. గత మూడేళ్లలో ఎంపీల ధోరణిలో చాలా మార్పు వచ్చిందని ఆయన అంటున్నారు. నావికా దళ అధికారి కుమారుడైన జెరెమీ.. హోట్‌కోర్సెస్ పేరుతో ఒక వెబ్‌సైట్ మొదలుపెట్టారు. విద్యార్థులకు మంచి కోర్సులు వెతికిపెట్టడంలో ఈ వెబ్‌సైట్ సాయం చేస్తుంది. 2005 నుంచి సౌత్ వెస్ట్ సర్రే ఎంపీగా జెరెమీ కొనసాగుతున్నారు. 2010లో సాంస్కృతిక శాఖ మంత్రిగా ఆయన ప్రభుత్వంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగానూ పనిచేశారు.

 
మైఖెల్ గోవ్
కన్జర్వేటివ్ నాయకుడి పదవికి మైఖెల్ గోవ్ ఇప్పటివరకు రెండుసార్లు పోటీ చేశారు. 2019లో బోరిస్ జాన్సన్, జెరెమీ హంట్‌ల తర్వాత మైఖెల్ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. అయితే, 2016లోనూ నాయకత్వ పదవికి ఆయన పోటీచేశారు. బ్రెగ్జిట్ ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో జరిగిన నాటి పోటీలో.. యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలని ఆయన గట్టిగా వాదించారు. అయితే, తాజా సంక్షోభంలో ఊహించని స్థాయిలో బోరిస్ జాన్సన్‌పై మైఖెల్ విమర్శలు చేశారు. ‘‘నాయకత్వానికి కావాల్సిన లక్షణాలు బోరిస్ జాన్సన్‌లో లేవు’’అని ఆయన వ్యాఖ్యానించారు. మైఖెల్.. బీబీసీ, టైమ్స్ వార్తా సంస్థల్లో పనిచేశారు. క్యాబినెట్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన నాయకుల్లో మైఖెల్ ఒకరు. 2010లో ఆయన విద్యా శాఖ మంత్రిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత చీఫ్ విప్, న్యాయ శాఖ, పర్యావరణ శాఖల మంత్రిగా పనిచేశారు.

 
నధీమ్ జహావి
ప్రస్తుతం ఛాన్సెలర్‌గా పనిచేస్తున్న నధీమ్ జహావి.. కోవిడ్-19 వ్యాప్తి సమయంలో వ్యాక్సీన్ల మంత్రిగా పనిచేశారు. దేశ వ్యాప్తంగా వ్యాక్సీన్లను అందుబాటులో ఉంచడంపై ఆయన మీద మీడియాలో ప్రశంసలు కురిశాయి. ‘‘నేను నిర్వహించిన విధుల్లో అదే ముఖ్యమైనది’’అని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఆయనకు విద్యా శాఖ మంత్రిగా క్యాబినెట్‌లో చోటు దక్కింది. రిషి సునాక్ రాజీనామా తర్వాత నధీమ్‌కు తాత్కాలికంగా ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే, 24 గంటలు తిరగకముందే, బోరిస్ రాజీనామా చేయాలని నధీమ్ కూడా పట్టుబట్టారు. 1967లో ఇరాక్‌లో నధీమ్ జన్మించారు. సద్దామ్ హుస్సేన్ అధికారంలోకి వచ్చినప్పుడు నధీమ్ కుటుంబం ఇరాక్‌ను వదిలి పరారైంది. కెమికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తిచేసిన నధీమ్.. టెలెట్యూబీస్ బొమ్మలు విక్రయించే సంస్థను ఏర్పాటుచేశారు. ఆ తర్వాత ఆన్‌లైన్ పోలింగ్ కంపెనీ యూగోను మొదలుపెట్టారు. 2010 నుంచి ఎంపీగా ఆయన కొనసాగుతున్నారు. ప్రస్తుతం స్ట్రాట్‌ఫర్డ్-అపాన్-ఎవన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

 
పెన్నీ మోర్డాంట్
మెజీషియన్‌కు అసిస్టెంట్‌గా పెన్నీ మోర్డాంట్ పనిచేసేవారు. అద్భుత విజయాలు సాధించిన వ్యక్తిగా మీడియాలో ఆమెపై ప్రశంసలు కురుస్తుంటాయి. 2019లో బ్రిటన్‌ రక్షణ మంత్రి పదవి చేపట్టిన తొలి మహిళగా పెన్నీ చరిత్ర సృష్టించారు. డెవిడ్ కామెరూన్ ప్రభుత్వంలో సాయుధ బలగాల మంత్రిగానూ ఆమె పనిచేశారు. ఐటీవీ సెలబ్రిటీ డైవింగ్ షో ‘‘స్ప్లాష్’’లో పేదల కోసం విరాళాలు సేకరించారు. మీడియాలో దీనిపై ఆమె మీద ప్రశంసలు కురిశాయి. 2010 నుంచి నార్త్ పోర్ట్స్‌మౌత్ ఎంపీగా పెన్నీ కొనసాగుతున్నారు. ఇదివరకు పార్టీ యువ విభాగం అధిపతిగానూ పనిచేశారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టకముందు, కింగ్స్‌టన్, చెల్సియా కౌన్సిల్‌లలో ప్రెస్ ఆఫీసర్‌గా పెన్నీ పనిచేశారు.

 
టామ్ టుగెన్‌ఢాట్
బోరిస్ జాన్సన్‌కు పూర్తి భిన్నమైన రాజకీయ నాయకుడిగా టామ్ టుగెన్‌ఢాట్ వార్తల్లో నిలుస్తుంటారు. మోడరేట్ అయిన టామ్.. 2016లో యూరోపియన్ యూనియన్‌లోనే ఉండాలని చెప్పారు. కన్జర్వేటివ్ పార్టీ భవిష్యత్ నాయకుల్లో టామ్ కూడా ఒకరని మొదట్నుంచీ ఆయన పేరు వార్తల్లో వినిపించేది. విదేశీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా జనవరి 2020 నుంచి ఆయన కొనసాగుతున్నారు. గత ఏడాది ఆగస్టులో అఫ్గానిస్తాన్ నుంచి పశ్చిమ దేశాలు వేగంగా వెనక్కి వెళ్లిపోవడంపై టామ్ ఉద్వేగంతో ప్రసంగమిచ్చారు. ఆ ప్రసంగంలో సైనికుల కోపం, ఆవేదన కనిపించాయి. 2017లో మీరు భవిష్యత్‌లో ప్రధాన మంత్రి అవుతారా? అనే ప్రశ్నపై స్పందిస్తూ.. ‘‘తప్పకుండా. లాటరీ టికెట్ కొనేవారు ఎవరైనా.. గెలవాలనే అనుకుంటారు కదా?’’అని ఆయన అన్నారు.

 
బెన్ వాలస్
రక్షణ మంత్రిగా పనిచేస్తున్న బెన్ వాలస్.. మాజీ సైనికుడు. ఆయన పేరు పెద్దగా వార్తల్లో కనిపించదు. అయితే, యుక్రెయిన్‌పై రష్యా దాడి నడుమ యుక్రెయిన్‌కు ఆయుధాలు, శిక్షణ ఇస్తామని బ్రిటన్ ప్రకటించడంతో ఆయన పేరు వార్తల్లోకి వచ్చింది. బ్రెగ్జిట్‌ను పూర్తిగా వ్యతిరేకించిన బెన్ 2017లో బోరిస్ జాన్సన్ ప్రచారంలో ప్రముఖ పాత్ర పోషించారు. దీంతో బెన్‌కు క్యాబినెట్ పదవి దక్కింది. జర్మనీ, సైప్రస్, బెలీజ్, ఉత్తర ఐర్లాండ్‌లలో బ్రిటన్ సైనికుడిగా బెన్ పనిచేశారు. ఉత్తర ఐర్లాండ్‌లో బ్రిటిష్ సైనికులపై ఓ బాంబు దాడిని ఆయన అడ్డుకోగలిగారు. పారిస్‌ నుంచి ప్రిన్సెస్ డయానా మృతదేహాన్ని వెనక్కి తీసొచ్చిన సైనికుల్లో బెన్ కూడా ఒకరు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తండ్రి సమాధి వద్ద అన్నాచెల్లెలు.. పలుకరింపులు కరువాయే