ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్టు ఈలాన్ మస్క్ ప్రకటించారు. ఒప్పందంలో పలు నిబంధనలను ట్విట్టర్ ఉల్లంఘించిందని మస్క్ ఆరోపించారు. ఫేక్ అకౌంట్లు, స్పామ్‌ల గురించి సరైన సమాచారం ఇవ్వని కారణంగానే 44 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు మస్క్ ప్రకటించారు. అపర కుబేరుడు ఈలాన్ మస్క్‌కు, ట్విట్టర్‌కు మధ్య దీర్ఘ కాలంగా కొనసాగుతున్న కథలో ఇది తాజా మలుపు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ట్విట్టర్‌ను సొంతం చేసుకునేందుకు 44 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నారు మస్క్. అయితే, కొనుగోలు ఒప్పందాన్ని అమలు చేయడానికి చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు ట్విట్టర్ తెలిపింది. "ఈలాన్ మస్క్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అంగీకరించిన ధర వద్ద, నిబంధనలతో అమలుచేసేందుకు ట్విట్టర్ బోర్డు కట్టుబడి ఉంది" అని ఆ సంస్థ చైర్మన్ బ్రెట్ టేలర్ తెలిపారు. ఈ అంశంలో చట్టపరంగా ముందుకు సాగుతామని అన్నారు.