Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

YSRCP: వైసీపీ పేరు మార్పు, జీవితకాల అధ్యక్షుడిగా జగన్ నియామకం, ఎన్నికల సంఘం ఆమోదించకపోతే ఏం జరుగుతుంది?

YCP Plenary
, శనివారం, 9 జులై 2022 (20:31 IST)
అధికార పార్టీ ఇప్పటికే ఎన్నికల శంఖారావం మోగించింది. వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవాలన్న టార్గెట్‌ని ఇప్పటికే శాసనసభాపక్ష సమావేశంలో జగన్ నిర్దేశించారు. అందుకు అనుగుణంగా గడపగపడకూ మన ప్రభుత్వం అనే పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఆయన ఆదేశాలు కూడా ఇచ్చేశారు. ఇక పార్టీ కార్యకర్తలను సన్నద్ధం చేసి, రాష్ట్ర ప్రజానీకానికి వైసీపీ విధానాల గురించి చాటిచెప్పే రీతిలో ప్లీనరీ సమావేశాలకు పూనుకున్నారు. రెండు రోజుల పాటు గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైసీపీ తన లక్ష్యాలను అందుకుందా? పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలనే జగన్ వ్యూహం ఫలించిందా?

 
పార్టీ పేరు మారింది...
వైసీపీ నాయకత్వం ముందే ప్రకటించిన విధంగా పార్టీ నిబంధనావళిలో మార్పులు తీసుకొచ్చింది. అందుకు అనుగుణంగా తమ పార్టీ రాజ్యాంగంలో సవరణలు చేస్తున్నట్టు ప్లీనరీ రెండో రోజు ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. పార్టీ ఎన్నికల అధికారి హోదాలో ఆయన చేసిన ప్రతిపాదనకు సభలో పాల్గొన్న వారి ఆమోదంతో వైఎస్ జగన్‌ని జీవితకాల అధ్యక్షుడిగా ప్రకటించారు. జగన్ తరపున 22 సెట్ల నామినేషన్లు దాఖలు కాగా, అధ్యక్ష పోస్టుకి మరెవరూ నామినేషన్లు వేయలేదని ఆయన ప్రకటించారు.

 
అధ్యక్ష నియామకంలో మార్పులతో పాటుగా పార్టీ రాజ్యాంగం సవరణల ప్రతిపాదనలకు కూడా ప్లీనరీ ఆమోదం తెలియజేసింది. పార్టీ రాజ్యాంగంలోని ఆర్టికల్ -1 ప్రకారం... యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా లేదా వైఎస్సార్సీపీగా మారుస్తూ తీర్మానం చేశారు. తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఎన్నికల సంఘం వద్ద కూడా పార్టీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా ప్రస్తావిస్తారు. అది పొడి అక్షరాల్లో వైఎస్సార్సీపీగా ఉంటుంది. తాజాగా ప్లీనరీలో చేసిన తీర్మానం ప్రకారం ఎన్నికల సంఘం ఈ రెండింటిలో ఏ పేరుకి అంగీకరిస్తే దానినే ఖరారు చేయాలని వైసీపీ భావిస్తోంది. ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా తదుపరి వైసీపీ నేతలు ఏ నిర్ణయం తీసుకుంటారన్నదానిపై కమిషన్ స్పందన చూసిన తర్వాత అవసరమయితే తుది నిర్ణయం ఉంటుందని విజయసాయిరెడ్డి బీబీసీకి తెలిపారు.

 
ఆర్టికల్ 8, 9 లో చేసిన మార్పులతో అధ్యక్షుడి ఎన్నికలకు సంబంధించిన సవరణల ద్వారా జగన్‌కి జీవితకాల అధ్యక్ష హోదా కట్టబెట్టారు. ఇక జీవితకాల అధ్యక్ష హోదా కూడా ఇప్పటివరకూ ఏ పార్టీకి లేదు. దానిని కూడా ఎన్నికల కమిషన్ గుర్తించే అవకాశం లేదని సీనియర్ అడ్వొకేట్ ఎం సుబ్బారావు అన్నారు. గతంలో ఎవరూ ఇలాంటి ప్రయత్నం చేయలేదని, నిర్ధిష్ట కాల పరిమితిలో ప్రతీ పార్టీ కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుందనే అంశాన్ని ఆయన గుర్తు చేశారు.

 
రెండు రోజుల ప్లీనరీ సందర్భంగా మొత్తం పది తీర్మానాలకు ఆమోదం తెలిపారు. తొలిరోజు మ‌హిళా సాధికార‌త‌- దిశ చ‌ట్టం, విద్యా రంగం, న‌వ‌ర‌త్నాలు- డీబీటీ, వైద్యారోగ్యం తీర్మానాలపై చర్చ జరిగింది. రెండోరోజు పరిపాలనా వికేంద్రీకరణ- పారదర్శకత, సామాజిక సాధికారత, వ్యవసాయం, పరిశ్రమలు-ప్రోత్సాహకాలు, ఎల్లో మీడియా-దుష్ట చతుష్టయం, పార్టీ రాజ్యాంగ సవరణ తీర్మానాలపై సుదీర్ఘంగా చర్చించి ఆమోదించినట్టు తెలిపారు.

 
టార్గెట్ చంద్రబాబు
వైసీపీ గత ప్లీనరీ(2017) కూడా ఇవే తేదీల్లో దాదాపుగా ప్రస్తుతం నిర్వహించిన ప్రాంతంలోనే జరిగింది. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉండగా, వైసీపీది ప్రతిపక్ష స్థానం. దానికి తగ్గట్టుగా నాటి పాలకపక్షం మీద పలు తీవ్రమైన వ్యాఖ్యలతో ప్లీనరీ సాగింది. నాయకులంతా నాటి ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. అందులో ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు విఫలమయ్యారని జగన్ మండిపడ్డారు. పోలవరం తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తామన్నారు. ఇతర అనేక సమస్యలను ప్రస్తావించారు.

 
ఈసారి కూడా టార్గెట్ చంద్రబాబు అన్నట్టుగానే ప్లీనరీలో విమర్శల పర్వం సాగింది. అయితే ఈసారి చంద్రబాబుకి తోడుగా దుష్టచతుష్టయం అంటూ మరో మూడు మీడియా సంస్థల యజమానుల మీద కూడా వైసీపీ నేతలు గురిపెట్టారు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ, టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడు మీద వ్యక్తిగతంగానూ విమర్శలు చేశారు. పలు మంత్రులు, సీనియర్ నేతలు కూడా చంద్రబాబుతో కలిపి ఈ ముగ్గురిని ఏకవచనంతో సంబోధిస్తూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. దాదాపుగా రాజకీయ పార్టీ నాయకుల మాదిరిగానే వారి మీద కూడా గురిపెట్టారు. ఇప్పటికే జగన్ పలు సందర్భాల్లో వారిని విమర్శిస్తున్నప్పటికీ ప్లీనరీ వేదికగా కూడా వారి మీద ప్రత్యేకంగా తీర్మానం పెట్టి విమర్శలకు దిగడం విశేషంగా భావించాలి. చంద్రబాబు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద కూడా విమర్శల వర్షం సాగింది. ఓవైపు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఏకరువు పెడుతూ, రెండోవైపు ప్రధాన ప్రతిపక్షాన్ని ఘాటుగా విమర్శించడమే లక్ష్యంగా ప్లీనరీ సాగింది.

 
ప్రజల సమస్యల ప్రస్తావన ఏదీ?
వైసీపీ రెండో ప్లీనరీలో రెండు రోజుల పాటు ప్రజా సమస్యలను ఏకరువు పెట్టగా, ఇప్పుడు నిర్వహించిన మూడో ప్లీనరీలో మాత్రం రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన సమస్యలను ప్రస్తావించకపోవడం విశేషం. ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశాన్ని కనీసంగా ముఖ్యమంత్రి ప్రస్తావించలేదు. పోలవరం, వెలిగొండ సహా అనేక పెండింగ్ ప్రాజెక్టుల గురించి నీటిపారుదల మంత్రి నోటి నుంచి గానీ ఇతరుల ద్వారా గానీ సభలో వినిపించిన దాఖలాలు లేవు. రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగులో ఉన్న ఇతర సమస్యలను కూడా ప్రస్తావించడానికి ప్రయత్నించినట్టుగా లేదు. పెరిగిన ధరలకు కారణం కేంద్ర ప్రభుత్వం అయితే తమ మీద నిందలు వేయడం ఏమిటంటూ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడటం విశేషం. అదే సమయంలో పెరిగిన ధరల భారాన్ని అంగీకరిస్తూనే వాటిని నియంత్రించాలనే డిమాండ్ మాత్రం వైసీపీ నేతల నుంచి రాలేదు. ఇతర అంశాలకు సంబంధించిన ప్రస్తావన కూడా వినిపించలేదు.

 
"సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం విస్తృతంగా అమలు చేస్తోంది. క్షేత్రస్థాయి వరకు నేరుగా అందిస్తూ, పథకాల పంపిణీలో అవినీతిని అదుపు చేసింది. ఫించన్ల పంపిణీ నుంచి గ్రామ సచివాలయం ద్వారా అందుతున్న ఇతర పథకాల విషయంలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. కానీ, పెరుగుతున్న ధరలు, వివిధ రకాల కొత్త పన్నుల భారం సామాన్యులకు నిరాశ కలిగిస్తోంది. చెత్తపన్ను వంటివి తీసుకొచ్చి మధ్యతరగతి మీద భారం వేస్తున్నారు. అదే సమయంలో పెట్రో, గ్యాస్ ధరల పెరుగుదల మూలంగా అన్ని రకాల నిత్యావసరాలు భారంగా మారుతున్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనడానికి వైసీపీ ప్రయత్నించకపోవడం విచారకరం. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పెద్దగా పాత్ర ఇవ్వలేదు. ప్రత్యర్థుల మీద విమర్శలు, తమ నాయకుడికి ప్రశంసలకే ప్రాధాన్యతనిచ్చారు" అంటూ సీనియర్ జర్నలిస్టు ఎస్ వెంకట్రావు అప్రాయపడ్డారు. నాడు-నేడు వంటి పథకాల గురించి, బైజూస్‌‌తో ఒప్పందం గురించి ప్రస్తావించినప్పుడు, పాఠశాలల విలీనం గురించి సాగుతున్న ఆందోళనలపై సీఎం ప్రస్తావించి ఉండాల్సిందన్నారు.

 
క్యాడర్‌ని కదిలించగలిగినట్టేనా?
వైసీపీ విపక్షంలో ఉన్న కాలంలో చాలా ఉత్సాహంగా కనిపించిన క్యాడర్‌లో ఇటీవల కొంత నిర్లిప్తత అలముకుంది. పార్టీ కార్యక్రమాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ అనేక మంది క్రియాశీలక కార్యకర్తలు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూ వస్తున్నారు. పార్టీ అధిష్టానం దీన్ని గుర్తించింది. కార్యకర్తల సమావేశాల సందర్భంగా విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు ఈ విషయాన్ని అంగీకరించారు. కార్యకర్తల శ్రేయస్సు విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ బహిరంగంగానే ప్రస్తావించారు.

 
షెడ్యూల్ ప్రకారం మరో ఏడాదిన్నర తర్వాత ఏపీలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ముందస్తు ఎన్నికలు ఖాయమనే ప్రచారం అన్ని వైపుల నుంచి సాగుతోంది. చంద్రబాబు నాయుడు లాంటి నాయకులైతే తమ కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జగన్ కూడా ఎన్నికల కాలంలో ఉన్నామనే విషయాన్ని అంతా గుర్తించాలని ఎల్పీ మీటింగులో వ్యాఖ్యానించారు. దాంతో క్యాడర్‌లో మళ్లీ ఉత్సాహం నింపి, వచ్చే ఎన్నికల నాటికి సిద్ధం చేయాల్సిన అవసరం ఆ పార్టీకి ఉంది.

 
దానికి తగ్గట్టుగానే నాయకులంతా కార్యకర్తలను ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. పేర్ని నాని వంటి వారు మాట్లాడుతూ తమను పట్టించుకోవద్దని, జగన్‌ని మాత్రమే చూడమని, ఆయన కోసం మళ్లీ అంతా కలిసికట్టుగా కదలాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా నిన్నటి వరకూ మంత్రులుగా ఉన్న మమ్మల్నే జగన్ లెక్క చేయలేదని, ఈరోజు ఎమ్మెల్యేలుగా ఉన్న వారెవరికైనా కార్యకర్తల అండ ఉంటేనే వారికి మళ్లీ టికెట్ ఇస్తారన్నది మరచిపోకూడదని కూడా కార్యకర్తలతో అన్నారు. అంతేగాకుండా జగన్‌ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ఆ బాధ్యత కార్యకర్తలదేనని కొడాలి నాని అన్నారు. వారు ఆ మాటలు చెబుతున్న సమయంలో సభలో పార్టీ శ్రేణుల నుంచి విశేష స్పందన వచ్చింది.

 
లక్ష్యం నెరవేరిందా..
రెండు రోజుల ప్లీనరీని తొలిరోజు ప్రతినిధుల సభ మాదిరిగా నిర్వహించారు. రెండో రోజు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా వేల మందిని సమీకరించారు. ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు అందుకోసం వినియోగించారు. విశాఖ, తిరుపతి నుంచి కూడా స్కూలు బస్సులు రావడం కనిపించింది. రాష్ట్రం నలుమూలల నుంచి ఆర్టీసీ బస్సుల్లో జన సమీకరణ జరిగింది. మొదటి రోజు సభలో విజయమ్మ వ్యవహారమే ప్రధానాంశంగా మారింది. దాని చుట్టూ చర్చ సాగింది.

 
రెండోరోజు భారీ సంఖ్యలో తరలివచ్చిన జనం వర్షాన్ని కూడా లెక్క చేయకుండా నాయకుల మాటలు వినేందుకు ఉత్సాహం చూపించారు. వర్షంలో తడుస్తూనే గంటల తరబడి నిలుచున్న జనం టెంట్ల బయట కనిపించారు. సభ ప్రాంగణానికి చేరుకోలేని వేలాది మంది కూడా రోడ్డు మీదనే ఉండిపోయారు. బస్సులు, ఇతర వాహనాల నియంత్రణ చేయలేకపోవడంతో ట్రాఫిక్ స్తంభించి విజయవాడ- గుంటూరు మధ్య జాతీయ రహదారిపై తీవ్ర ఆటంకం కలిగింది. చివరకు ఎన్‌హెచ్ 16ని ఆనుకుని ఉండే జనసేన, టీడీపీ ప్రధాన కార్యాలయాల ఎదుట కూడా వైసీపీ సభకు వచ్చిన వారి వాహనాలు నిలిచి ఉండటం కనిపించింది.

 
"ఎన్నికల సన్నాహాల్లో భాగంగా వైసీపీ ఈ సభను వాడుకుంది. అందుకు తగ్గట్టుగానే జనసమీకరణ చేశారు. అధికార పార్టీ కావడంతో అందుకు అనుగుణంగా భారీ ఏర్పాట్లు జరిగాయి. వాతావరణం అనుకూలించకపోవడం కొంత సమస్య అయ్యింది. వైఎస్సార్ జయంతి కోసం ప్రాధాన్యతనివ్వకుండా ఇతర సందర్భాల్లో నిర్వహించి ఉంటే భారీ బహిరంగసభ అయ్యేది. రెండు రోజుల సమావేశాల్లో జగన్ తన లక్ష్యాన్ని అందుకున్నట్టు కనిపించింది. 'వన్స్ మోర్ జగన్' అనే పిలుపు ద్వారా తదుపరి ఎన్నికలకు సిద్ధం చేసినట్టు స్పష్టమయ్యింది. అదే సమయంలో విజయమ్మ తెలంగాణకు పరిమితం అవుతానని ప్రకటించడం వంటి వివిధ పరిణామాలను బట్టి పార్టీలో మరో అధికార కేంద్రానికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తపడినట్టు కనిపిస్తోంది. తనను జీవితకాల అధ్యక్షుడిగా ప్రకటించుకోవడంలో లక్ష్యం అదేనని భావించాల్సి వస్తోంది" అంటూ రాజకీయ విశ్లేషకుడు పి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్లీనరీ సమావేశాల సందర్భంగా జిల్లాల్లో వెలుగులోకి వచ్చిన విబేధాలు రాష్ట్ర స్థాయిలో కనిపించకుండా జగన్ నాయకత్వ ప్రభావం అడ్డుకట్ట వేసిందని ఆయన బీబీసీతో అన్నారు.

 
నిందలకే పరిమితం
వైసీపీ ప్లీనరీలో చంద్రబాబుని తిట్టడానికి , మీడియాను నిందించడానికే పరిమితమయ్యారని టీడీపీ ఆరోపించింది. ఆపార్టీ సీనియర్ నేత కూన రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్లీనరీ సమావేశాలను జబర్ధస్త్ కార్యక్రమంతో పోల్చారు. నవరత్నాల పేరుతో చేసిన నవ మోసాలు గురించి కూడా ప్లీనరీలో ప్రజలకు చెబితే బాగుండేది. రైతు భరోసా రూ.13,500 ఇస్తామని కేవలం రూ.7,500 ఇస్తున్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకైనా రూ.13,500 అకౌంటులో జమ అయ్యాయా? పిట్ట కథలు చెప్పడంలో బుగ్గన దిట్ట. పంచాయతీ రాజ్ నిధులు దారి మళ్ళించిన వైసీపీ నాయకులపై 420 కేసులు పెట్టాలి. వైసీపీ నేతల ప్రచారాలన్నీ పూర్తిగా అవాస్తవాలే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సాక్షి పత్రికలో వచ్చిన దుష్ప్రచారాలపై కమిషన్ వేసి చర్యలు తీసుకుంటామని అన్నారు.

 
ప్రజాభిప్రాయాన్ని వినిపించాం...
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు జగన్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని, ప్లీనరీలో కూడా అదే ప్రస్ఫుటించిందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. "రాష్ట్రంలో జగన్‌ని అడ్డుకోవాలని చూసిన కాంగ్రెస్ కథ ముగిసింది. టీడీపీ ప్రస్థానానికి ఫుల్ స్టాప్ పడింది. ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ తిరుగులేని నాయకుడు. ఆయన పథకాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. అందుకే జగన్ పిలుపుతో లక్షల సంఖ్యలో తరలివచ్చారు. గుంటూరు, విజయవాడ నగరాల మధ్య జన సాగరంలా మారింది. ఇంతటి అభిమానం చూసి విపక్షాలకు కంటగింపుగా మారడంలో ఆశ్చర్యం లేదు. అభివృద్ధి కూడా జరుగుతోంది కాబట్టే 'ఈజ్ ఆఫ్ డూయింగ్'లో ఏపీని నెంబర్ వన్‌గా నిలబెట్టాం. టీడీపీ విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు" అంటూ ఆయన బీబీసీతో అన్నారు. తమ పార్టీలో ఉత్సాహం ఎక్కడా తగ్గలేదని, మరింత బలపడ్డామని చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీలంక ఆర్థిక సంక్షోభం: పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు