Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#Ilayaraja: దళితుల కోటాలో బీజేపీ ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చిందా, విమర్శలు ఎందుకు వినిపిస్తున్నాయి

#Ilayaraja: దళితుల కోటాలో బీజేపీ ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చిందా, విమర్శలు ఎందుకు వినిపిస్తున్నాయి
, గురువారం, 7 జులై 2022 (21:41 IST)
రాజ్యసభకు ఇళయరాజాను నామినేట్ చేస్తున్నట్లు వెల్లడించిన ప్రకటనలో ఆయన్ను ‘‘దళితుడు’’గా పేర్కొన్నారు. దీనిపై సోషల్ మీడియాలో వివాదం రాజుకొంది. సంగీత దర్శకుడు ఇళయరాజాతోపాటు పరుగుల రాణి పీటీ ఉష, సంఘ సంస్కర్త వీరేంద్ర హెగ్డే, తెలుగు రచయిత కేకే విజయేంద్ర ప్రసాద్‌లను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

 
‘‘అణగారిన వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చేందుకు మోదీ చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా రాజ్యసభకు నామినేట్ చేసిన సభ్యుల్లో ఒక మహిళ, ఒక దళితుడు, ఒక మైనారిటీ (జైనులు)లకు ప్రాతినిధ్యం కల్పించారు’’అని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రకటనను ప్రభుత్వ మీడియా చానెల్‌లో విడుదల చేయలేదు. కానీ, దిల్లీలోని జర్నలిస్టులకు పంపించారు. సోషల్ మీడియాలో ఇది వైరల్ అయ్యింది. దీంతో ఇళయరాజాను దళితుడిగా పేర్కొనడంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు.

 
‘‘తనను దళితుడిగా ‘దళిత మురసు మ్యగజైన్’లో పేర్కొన్నందుకు రచయితన కేఏ గుణశేఖరన్‌పై ఇళయరాజా కేసు పెట్టారు. ఇప్పుడు బీజేపీ అంటుంటే మాత్రం ఆయనకు సంతోషంగా ఉంది’’అని అరవింద్ రాజా అనే యూజర్ ట్వీట్ చేశారు. ‘‘సంగీతంలో ఆయన దిగ్గజమైనప్పటికీ.. ఆయన్ను దళిత ఇళయరాజాగానే చూడాలని అనుకుంటున్నారు’’అని సెంథిల్‌కుమార్ అనే మరో వ్యక్తి ట్వీట్ చేశారు. ‘‘మాకు మాత్రం ఆయన మ్యూజిక్ మ్యాస్ట్రో. కానీ, వారు ఆయన్ను దళితుడిగా చూస్తున్నారు’’అని తమిళ్ కవి కరూర్‌గా అనే మరో యూజర్ వ్యాఖ్యానించారు.

 
‘‘సంగీత దర్శకుడిగా ఇళయరాజాకు ఈ నామినేషన్ తప్పకుండా ఇవ్వాలి. అందులో సందేహమే లేదు. కానీ, దళిత గుర్తింపు కింద ఇచ్చిన నామినేషన్‌కు ఆయన అంగీకరించారా?’’అని మణికందన్ రాజేంద్రన్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. అయితే, ఈ నామినేషన్ వెనుక రాజకీయ లక్ష్యాలు ఉన్నాయని దళిత పార్టీ వీసీకే చెందిన ఎంపీ రవి కుమార్ చెప్పారు. ‘‘వారు ఆయన్ను దళితుడని పిలుస్తున్నారు. ఇళయరాజా దానికి అంగీకరిస్తారా? దీని వెనుక రాజకీయ లక్ష్యాలు ఉన్నాయి. అవి ఏమిటో బీజేపీకి బాగా తెలుసు’’ అని ఆయన చెప్పారు.

 
ఇవి సంకుచిత రాజకీయాలని రవి కుమార్ విమర్శించారు. ‘‘కేవలం రాజ్యసభకు నామినేట్ చేసినంత మాత్రాన ఆయనకు తగిన గుర్తింపు వస్తుందని అనుకోవడం పొరపాటు’’అని ఆయన అన్నారు. అసలు ఇళయరాజాను దళితుడిగా వారు ఎందుకు చూపించాలని అనుకుంటున్నారని దళిత రచయిత స్టాలిన్ రాజంగం ప్రశ్నించారు. ‘‘సంగీత దర్శకుడిగా ఆయన ప్రజలకు సుపరిచితుడు. కానీ, ఇప్పుడు దళితుడు కావడం వల్ల రాజ్యసభకు ఆయన్ను పంపిస్తున్నారా? అసలు దీన్ని ఎందుకు అంత ప్రధానంగా చెబుతున్నారు?’’అని ఆయన ప్రశ్నించారు. దళితుల కోసం ఏమైనా చేయాలని అనుకుంటే, ముందుగా రాజ్యసభలో దళితులకు రిజర్వేషన్లు అమలు చేయాలని రవి కుమార్ డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్ణాటకలో భారీ వర్షాలు: జనజీవనం అస్తవ్యస్తం..ఐఎండి హెచ్చరిక