కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తీరప్రాంతాలతో పాటు మల్నాడులో జనజీవనం అస్తవ్యస్తమైంది.
తీర ప్రాంత జిల్లాలైన కొడగు, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడుపిల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంతాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేయాల్సిందిగా ఆదేశించింది.
పలు నివాసాలు, భవనాలు, విద్యుత్ స్తంభాలు, ఇతర ఆస్తులకు నష్టం వాటిల్లింది. మంగుళూరు జిల్లాకు 30కిలోమీటర్ల దూరంలోని పంజికల్లు గ్రామం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి.
దీంతో పొలంలో పనిచేస్తున్న ఐదుగురు కూలీలు బురదలో చిక్కుకుపోయారు. ఐదుగురిని బయటకు తీశామని.. అయితే వారిలో ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు.
వరద ప్రాంతాల్లో సర్వే నిర్వహించాల్సిందిగా అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.