Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజధాని రచ్చ : దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఎందుకున్నాయి?

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (12:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో దక్షిణాఫ్రికా నమూనా అనుసరించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి మూడు రాజధానులు వస్తాయేమోనని, మూడు రాజధానులు రావాల్సిన అవసరం కనిపిస్తోందని చెప్పారు.
 
మంగళవారం రాజధాని అమరావతిలో సీఎం జగన్ అసెంబ్లీలో మాట్లాడుతూ, "దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులుంటాయి. ఆ నమూనాలో బహుశా అమరావతిలో శాసన కార్యకలాపాల రాజధాని పెట్టొచ్చు. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని పెట్టొచ్చు. యంత్రాంగమంతా అక్కడి నుంచే పనిచేసేలా ఏర్పాట్లు చెయ్యవచ్చు. కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చు. ఈ విధంగా న్యాయ రాజధాని ఓవైపు, కార్యనిర్వాహక రాజధాని మరోవైపు, శాసన రాజధాని ఇక్కడ (అమరావతిలో) ఉండొచ్చు" అన్నారు. ఇంతకూ దక్షిణాఫ్రికా దేశానికి మూడు రాజధానులు ఎందుకున్నాయి? వీటి నేపథ్యం ఏమిటి?
 
రాజ్యాంగ న్యాయస్థానం మరో నగరంలో... 
దక్షిణాఫ్రికా పరిపాలనా రాజధానిగా ప్రిటోరియా, శాసన రాజధానిగా కేప్ టౌన్, న్యాయ రాజధానిగా బ్లూమ్‌ఫౌంటెయిన్ ఉన్నాయి. రాజ్యాంగ అంశాల్లో సర్వోన్నత న్యాయస్థానమైన రాజ్యాంగ న్యాయస్థానం దక్షిణాఫ్రికాలో అతిపెద్ద నగరమైన జోహన్నెస్‌బర్గ్‌లో ఉంది. ఆ తర్వాత స్థాయి న్యాయస్థానమైన 'సుప్రీంకోర్ట్ ఆఫ్ అప్పీల్' న్యాయ రాజధాని బ్లూమ్‌ఫౌంటెయిన్‌లో ఉంది. దక్షిణాఫ్రికాలో సాంస్కతిక వైవిధ్యం ఎక్కువ. మూడు రాజధానుల ఏర్పాటు వెనక చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక కారణాలు ఉన్నాయి.
 
దక్షిణాఫ్రికా ఒకప్పుడు వలస పాలకుల పాలనలో ఉండింది. రెండో ఆంగ్లో-బోయర్ యుద్ధంలో ఓడిపోయిన బోయర్ రిపబ్లిక్‌లకు-బ్రిటిష్ సామ్రాజ్యానికి మధ్య జరిగిన చర్చల ఫలితంగా దక్షిణాఫ్రికా మూడు రాజధానులతో ఏర్పాటైంది. ఈ యుద్ధాన్ని బ్రిటన్ సామ్రాజ్యం బోయర్ యుద్ధమని పిలవగా, బోయర్లు స్వాతంత్ర్య సంగ్రామమని పేర్కొన్నారు. ఆంగ్లేయులు, బోయర్ల మధ్య యుద్ధం సాగడాన్ని దృష్టిలో ఉంచుకొని దక్షిణాఫ్రికాలో చాలా మంది దీనిని ఆంగ్లో-బోయర్ యుద్ధమని వ్యవహరిస్తారు. డచ్ మూలాలున్న దక్షిణాఫ్రికన్లే బోయర్లు. డచ్ వ్యవహారికంలో బోయర్ అంటే రైతు అని అర్థం.
 
బ్రిటిష్ కాలనీలైన కేప్, నాటల్; బోయర్ రిపబ్లిక్‌లు అయిన ట్రాన్స్‌వాల్, ఆరంజ్ ఫ్రీ స్టేట్‌ అంటే నాలుగు భూభాగాలు కలసి 1910లో యూనియన్ ఆఫ్ సౌతాఫ్రికా ఏర్పడింది. దేశంలోని అన్ని ప్రాంతాల మధ్య అధికార పంపిణీ జరగాలనే అంగీకారం, ఇతర అంశాలు మూడు రాజధానులకు కారణాలు.
 
ప్రిటోరియా: ఇప్పుడు పరిపాలనా రాజధానిగా ఉన్న ఈ నగరం బోయర్ రిపబ్లిక్‌ ట్రాన్స్‌వాల్‌కు రాజధానిగా ఉండేది. ప్రిటోరియా దక్షిణాఫ్రికాలో అతిపెద్ద నగరమైన జోహన్నెస్‌బర్గ్‌ సమీపాన ఉంది. చాలా దేశాల రాయబార కార్యాలయాలు ప్రిటోరియాలోనే ఉన్నాయి.
 
కేప్ టౌన్: శాసన రాజధాని అయిన ఈ నగరం ఒకప్పటి కేప్ కాలనీ రాజధాని. వలస పాలకుల కాలం నుంచి ఇక్కడ పార్లమెంటు ఉంది. ఇది తీర నగరం.
 
బ్లూమ్‌ఫౌంటెయిన్: న్యాయ రాజధాని అయిన ఈ నగరం బోయర్ రిపబ్లిక్ ఆరంజ్ ఫ్రీ స్టేట్‌కు రాజధానిగా ఉండేది. బ్లూమ్‌ఫౌంటెయిన్ దక్షిణాఫ్రికా మధ్యలో ఉంది. 1994లో రాజ్యాంగ న్యాయస్థానం ఏర్పాటుతో న్యాయపరమైన అధికారాలు జోహన్నెస్‌బర్గ్, బ్లూమ్‌ఫౌంటెయిన్‌ మధ్య విభజించినట్లైంది.
 
ఏపీ కన్నా ఆరున్నర రెట్లు పెద్దది... 
ఆసియా వెలుపల భారతీయులు ఎక్కువగా ఉన్న దేశాల్లో దక్షిణాఫ్రికా ఒకటి. దక్షిణాఫ్రికా విస్తీర్ణం 12,20,813 లక్షల చదరపు కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం(1,60,205 చదరపు కిలోమీటర్లు)తో పోలిస్తే దక్షిణాఫ్రికా విస్తీర్ణం ఆరున్నర రెట్ల పైనే ఉంటుంది. దక్షిణాఫ్రికా జనాభా 5.87 కోట్లు. జనాభాలో మహిళలే (51.2 శాతం) ఎక్కువ.
 
దేశంలో తొమ్మిది రాష్ట్రాలు (ప్రావిన్సులు) ఉన్నాయి. మొత్తం 11 అధికార భాషలున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో మైనింగ్, రవాణా, ఇంధనం, తయారీ, పర్యటకం, వ్యవసాయ రంగాలు ప్రధానమైనవి. అత్యంత విలువైన లోహాల్లో ఒకటైన ప్లాటినం అత్యధికంగా దక్షిణాఫ్రికాలోనే ఉత్పత్తి అవుతుంది. సౌతాఫ్రికా కరెన్సీ రాండ్. 15 రాండ్‌లు ఒక అమెరికన్ డాలర్‌తో సమానం. దాదాపు ఐదు రూపాయలు ఒక రాండ్‌తో సమానం.
 
అమెరికా, బ్రెజిల్ మోడల్‌పై ప్రతిపాదనలు... 
1994లో దక్షిణాఫ్రికా జాతి ప్రమేయంలేని ప్రజాస్వామ్యంగా మారే సందర్భంలో, ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ప్రిటోరియా కేంద్రంగానే సాగించాలని, లేదా అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ, బ్రెజిల్ రాజధాని బ్రెజీలియా తరహాలో కొత్త రాజధాని నగరాన్ని నిర్మించాలని ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత కూడా ఇలాంటి ప్రతిపాదనలు వచ్చాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments