నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరో మెలికపెట్టారు. రాజధానిపై స్పష్టత కోసం ఓ కమిటీ వేశామనీ, ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
కాగా, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ శాసనసభ సమావేశాల్లో భాగంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బొత్స సమాధానమిస్తూ, రాజధాని అమరావతిని మార్చే ఉద్దేశ్యం లేదన్నారు. పైగా, రాజధాని అక్కడే ఉంటుందన్నారు. దీంతో వైకాపా ప్రభుత్వానికి రాజధానిని మార్చే ఉద్దేశ్యం లేదన్న అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరూ వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్తిబాబు శనివారం మాట్లాడుతూ, అమరావతిలో నిర్మాణ దశలో ఉన్న భవనాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని తెలిపారు. అందువల్ల ఆ నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు.
అదేసమయంలో శుక్రవారం నాడు సభలోని నెలకొన్న పరిస్థితిని బట్టే అమరావతే రాజధాని అని చెప్పానని బొత్స తాజాగా చెపుతూ ఓ మెలిక పెట్టారు. రాజధానిపై స్పష్టత కోసం కమిటీ వేశామని... కమిటీ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్పష్టత వస్తుందన్నారు.
ఆ తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని వ్యాఖ్యానించారు. అమరావతి రైతులను పూర్తిగా ఆదుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని బొత్స ఆరోపించారు.
అసెంబ్లీ సమావేశాలు సజావుగా కొనసాగకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. భోగాపురం ఎయిర్ పోర్టుపై మళ్లీ టెండరింగ్ కు వెళ్లే అంశంపై ఆలోచిస్తున్నామని చెప్పారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టును రెండు ఫేజ్‌లుగా చేయాలని నిర్ణయించామని తెలిపారు.