Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 19 April 2025
webdunia

మా ఇంటిని ముంచడంపై ఉన్న శ్రద్ధ ప్రాజెక్టుల నింపడంపై లేదు : చంద్రబాబు

Advertiesment
AP Assembly
, బుధవారం, 11 డిశెంబరు 2019 (18:57 IST)
వైకాపా పాలకులకు మా ఇంటిని ముంచడంపై ఉన్న శ్రద్ధ ప్రాజెక్టుల నింపడంపై లేదని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ యేడాది వర్షాలు విస్తారంగా కురిశాయన్నారు. ఆ కారణంగా ఏర్పడిన వరద నీటితో కృష్ణానది కరకట్టకు సమీపంలో ఉన్న మా ఇంటిని ముంచేందుకు అమితాసక్తి చూపించారని ఆరోపించారు. ఈ నీటితో ప్రాజెక్టులు నింపాలన్న ధ్యాస లేకుండా పోయిందన్నారు. 
 
అంతేకాకుండా, వర్షాల కారణంగా వరదలు వస్తే ఒక వారం రోజులపాటు శ్రీశైలం వద్దే ఆ నీటిని ఆపేసి, ఆ తర్వాతే దిగువకు వదిలారని, తన ఇంటిని ముంచాలన్న దురుద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. తన ఇల్లు ముంపు ప్రాంతంలో ఉందని నిరూపించడానికి కుట్రపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు.
 
వారం రోజుల పాటు ఆపేసిన నీటిని ఒక్కసారిగా విడుదల చేయడంతో లంక గ్రామాలన్నీ నీట మునిగాయని, కానీ తన నివాసాన్ని ముంచాలని చూపించిన శ్రద్ధ రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని అందించడంపై చూపించి ఉంటే బాగుండేదని అన్నారు. ఆ నీటిని రాయలసీమకు తీసుకెళ్లాలని ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదని విమర్శించారు.
 
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైసీపీపై విమర్శలు గుప్పించారు. మందబలం చూసుకుని గర్వం ప్రదర్శిస్తున్నారని, మెజారిటీ ఉన్నది ప్రజల్ని హింసించడానికి కాదని, ప్రజా జీవితాల్ని అస్తవ్యస్తం చేయడానికి కాదని హితవు పలికారు. 
 
అసెంబ్లీలో కొవ్వెక్కిన చందంగా ప్రవర్తిస్తున్నారని, ప్రజలంటే లెక్కలేనితనం అని మండిపడ్డారు. ఆర్టీసీ చార్జీలను పెంచుతూ ఓ పిడుగులా ప్రజలపై వేశారని, కనీసం సభ పవిత్రతను దృష్టిలో పెట్టుకుని ఓ ప్రకటన కూడా చేయలేదని విమర్శించారు.
 
ఈ ఏడునెలల పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, కనీస గిట్టుబాటు ధరలు లేక పండించిన పంటను రోడ్డుపై పెట్టుకుని, రోజుకు రూ.500 ఇచ్చి కాపలాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితికి వచ్చారని, వర్షం పడితే భయపడే పరిస్థితికి వచ్చారని తెలిపారు. 
 
అలాగే, ఏపీ అసెంబ్లీలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని, స్పీకర్ ప్రవర్తన చూస్తే ఎంతో నిర్లక్ష్యంగా ఉందన్నారు. ఆ చేతులు ఊపడం, కూర్చోమనడం, వెళ్లిపొమ్మనడం ఓ పద్ధతి లేని వ్యవహారం అంటూ సభాపతి తమ్మినేని సీతారాంపై విమర్శలు చేశారు.
 
'ఇదేంటని నేను ప్రశ్నిస్తే పది మందికి మాట్లాడే అవకాశం ఇచ్చి నన్ను తిట్టించారు. చివర్లో అయినా నా వాదన వినిపిద్దామనుకుంటే అవకాశం ఇస్తానని చెప్పి, ఇవ్వకుండానే టీ బ్రేక్ ప్రకటించి లోపలికి వెళ్లిపోయారు' అంటూ చంద్రబాబు మండిపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్యాచారానికి ఉరే సరి... ఏపీలో కొత్త చట్టం.. పేరు "ఏపీ దిశ"