Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోడ దూకేందుకు సిద్ధమైన టీడీపీ ఎమ్మెల్యేలు... అడ్డుకున్న పవన్.. థ్యాంక్స్ చెప్పిన బాబు

గోడ దూకేందుకు సిద్ధమైన టీడీపీ ఎమ్మెల్యేలు... అడ్డుకున్న పవన్.. థ్యాంక్స్ చెప్పిన బాబు
, మంగళవారం, 10 డిశెంబరు 2019 (13:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా, రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలన్న తలంపులో ఏపీ మఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇందులోభాగంగా, టీడీపీ తరపున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలను తనవైపునకు తిప్పుకోవడం వల్ల ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు విపక్ష హోదా లేకుండా చేయాలని ప్లాన్ వేశారు. 
 
ఇందులోభాగంగా, వివిధ రకాల వ్యాపారాలు కలిగిన పలువురు టీడీపీ ఎమ్మెల్యేలతో వైకాపా నేతలు సంప్రదించారు. అధికార పార్టీ కోరడంతో టీడీపీ ఎమ్మెల్యేలు కూడా గోడ దూకేందుకు సిద్ధమయ్యారు. అయితే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారికి అడ్డుకట్టగా నిలబడ్డారు. ఫలితంగా గోడ దూకుదామని భావించిన టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు వెనక్కి తగ్గారు. దీంతో పవన్‌ కళ్యాణ్‌కు చంద్రబాబు పరోక్షంగా ధన్యవాదాలు తెలిపారు. 
 
అసలు ఈ గోడ దూకడం వెనుక ఉన్న కథను పరిశీలిస్తే, రాజకీయాల్లో జంప్ జిలానీలు ఉండటం సర్వసాధారణం. ముఖ్యంగా, విపక్ష ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి దూకేస్తుంటారు. ఇలాంటి వారికి ప్రజాసేవ కంటే తమ స్వలాభాలు, వ్యాపారాలే ముఖ్యంగా ఉంటాయి. స్వలాభం ఎటువైపు ఉంటే అటువైపు దూకేందుకు సై అంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చిన చిక్కు ఇలాంటి వ్యాపారస్తులతోనే.
 
ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పావులు కదిపింది. ఐదుగురు ఎమ్మెల్యేలతో టచ్‌లోకి వెళ్లింది. వారికున్న వ్యాపారాలపై కన్నేసింది. నయానో భయానో వారిని తమ దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. 
 
సదరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా తమ జీవనాధారమైన వ్యాపారంపై దెబ్బకొడితే ఆర్థిక మూలాలు కదులుతాయనే ఉద్దేశంతో గోడ దూకేందుకు సిద్ధమయ్యారు. రేపోమాపో గోడ దూకాలని నిర్ణయించుకున్నారు కూడా. వైసీపీ నేతలు ఈ మేరకు మీడియాకు సంకేతాలిచ్చారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీకి శాసనసభలో ప్రతిపక్ష హోదా పోతుందనీ, చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా పీకేస్తామనీ బహిరంగంగానే చెప్పారు.
 
ముఖ్యంగా, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం రోజున ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొని షాక్‌ ఇవ్వాలని వైసీపీ పెద్దలు స్కెచ్‌ గీశారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే నలుగురు ఎమ్మెల్యేలతో టీడీపీకి రాజీనామా చేయించి వైసీపీలో చేరకుండా తటస్థంగా కూర్చోబెట్టాలన్నది వైసీపీ నేతల ప్రధాన వ్యూహం. అంతా సక్రమంగా సాగితే శాసనసభ సమావేశాల తొలి రోజునే ఈ ప్లాన్ పక్కాగా అమలయ్యేది. 
 
కానీ, ఈలోపు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ రూపంలో తెలుగుదేశానికి మేలు జరిగింది. వైకాపాకు షాక్ తగిలింది. దీంతో అప్పటివరకూ గోడ దూకుదాం అనుకుంటున్న ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారు. ఇటీవల తిరుమలలో పవన్ మాట్లాడుతూ, 'బీజేపీతో తనకేమీ తగాదా లేదనీ, అమిత్‌షా అంటే ఎంతో గౌరవమనీ, జగన్‌కు అమిత్‌షా అంటే భయమనీ' వ్యాఖ్యానించారు. 
 
'2019 ఎన్నికల్లో తాను తెలుగుదేశం, బీజేపీలతో కలిసి పోటీచేసి ఉంటే వైసీపీ అధికారంలోకి వచ్చేదా?' అంటూ సూటిగా ప్రశ్నించారు. 'తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం వేలకోట్ల రూపాయలు ఖర్చుచేసినప్పటికీ పరాజయం పాలయ్యారనీ, ఆయన ఊళ్లు పట్టుకుని తిరుగుతున్నారనీ' వ్యాఖ్యానించారు. 
 
పవన్‌ తాజా వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చోపచర్చలకి దారితీశాయి. బీజేపీతో తాను కలిసే ఉన్నానన్న అర్థం వచ్చేలా పవన్‌ మాట్లాడటం, చంద్రబాబు పట్ల సానుకూల వ్యాఖ్యలు చేయటంతో విశ్లేషకుల దృష్టి అటు మళ్లింది. 'భవిష్యత్ రాజకీయం ఎలా ఉండబోతుందో రాష్ట్ర ప్రజలకు పవన్‌ పరోక్ష సంకేతాలు ఇచ్చారని' వారు అంచనా వేస్తున్నారు. 
 
అధికారంలో ఉన్న వైసీపీకి ఇప్పటికే కొన్ని వర్గాలు వ్యతిరేకంగా మారటం, ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో గోడ దూకాలనుకున్న టీడీపీ ఎమ్మెల్యేలకు జ్ఞానోదయం కలిగిందని కొందరు చెబుతున్నారు. భవిష్యత్ దృశ్యం కళ్లముందు కనిపించటంతో వారు పునరాలోచనలో పడ్డారని టీడీపీలోని కొన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మందుబాబుల కోసం లిక్కర్ కార్డులు.. ఫేక్ లిక్కర్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్