ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాచారాలకు పాల్పడే కామాంధులకు ఉరిశిక్ష విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. అత్యాచారం చేస్తే మరణ శిక్ష విధించాలని కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లోనే తీర్పు ఇవ్వాలని ప్రభుత్వం చెబుతోంది. అత్యాచార కేసుల్లో ఏడు రోజుల్లో పోలీస్ దర్యాప్తు పూర్తి చేయాలని, 14 రోజుల్లో కోర్టులో వాదనలు, 21 రోజుల్లో తీర్పు వెల్లడించాలని కేబినెట్ చెబుతోంది. ప్రస్తుతం ఉన్న 4 నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఇందుకోసం ఏపీ దిశ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకునిరానుంది. దీంతో పాటుగా ఏపీ క్రిమినల్ లా చట్టం (సవరణ) 2019కి కేబినెట్ ఆమోదం తెలిపింది. అత్యాచార కేసులకు సంబంధించి ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కేబినెట్ అభిప్రాయపడింది. ప్రత్యేక కోర్టు పరిధిలో యాసిడ్ దాడులు, అత్యాచారం కేసులు తేవాలని నిర్ణయించారు.
అదేవిధంగా, సోషల్ మీడియాలో మహిళలను కించపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, చిన్నారులను లైంగికంగా వేధిస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించాలని కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఇక చివరగా, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ... చట్టంలో సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
అంతేకాకుండా గ్రామ సచివాలయం, వాలంటీర్ డిపార్ట్‌మెంట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ పర్యవేక్షణ కోసం కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.