ఎన్నికలకు వెళ్లేముందు తాము ఓ మేనిఫెస్టో విడుదల చేశామనీ, దాన్ని బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి, వాటిలో పేర్కొన్న అంశాలను అమలు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం జరిగిన సభా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ, పాదయాత్రలో ప్రజల నుంచి రక రకాల సూచనలు, సలహాలు స్వీకరించాం. పాదయాత్ర అయిపోయిన తర్వాత ఎన్నికలకు వెళ్లేముందు మేనిఫెస్టోను విడుదల చేశాం. మేనిఫెస్టో అంటే టీడీపీ నాయకులకు గౌరవం లేదు. వాళ్లు దాన్ని చెత్తబుట్టలో వేశారు. ప్రజలు కొడతారేమోనని ఆన్‌లైన్లో పెట్టిన మేనిఫెస్టోను తీసేశారు. ఈ చరిత్ర టీడీపీది.
మేనిఫెస్టోనే మాకు బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెప్పి మేం మేనిఫెస్టోను విడుదలచేశాం. మేనిఫెస్టోలో ప్రతి అంశాన్ని మేం నెరవేరుస్తాం అని ప్రజలకు చూపించి ఓట్లు అడిగాం. మేనిఫెస్టోలో ఎక్కడా కూడా బియ్యానికి సంబంధించిన అంశాన్ని పెట్టలేదు. మేనిఫెస్టోలో చెప్పని కార్యక్రమాన్ని మేం చేస్తున్నాం. దీన్ని టీడీపి గుర్తు పెట్టుకోవాలి. మేనిఫెస్టోలో చెప్పని అంశాన్ని కూడా చేసి చూపించాలని తపన తాపత్రయంతో, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని పెట్టాం. చంద్రబాబు హయాంలో పంపిణీచేసిన బియ్యాన్ని ప్రజలు తినలేక పోయారు. అదే బియ్యాన్ని డీలర్ దగ్గరకు వెళ్లి అమ్మేశారు. అదే బియ్యాన్ని డీలర్లు రైస్‌మిల్లర్లకు అమ్మితే, మళ్లీ రీ పాలిష్ చేసి.. మళ్లీ ప్రజాపంపిణీలోకి వచ్చేవి.
ప్రజలు తినలేని ఈ బియ్యాన్ని ఇస్తున్నారని, ప్రజలకు నాణ్యమైన బియ్యం పంపిణీని మొదలుపెట్టాం.
శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద మొదలుపెట్టాం. గతంలో చంద్రబాబు హయామంలో ఇచ్చిన బియ్యానికి, ఇవాళ ప్యాకేజీ చేసి ఇస్తున్న బియ్యానికి పోల్చి చూడండి. ఇంతకు ముందు తినలేని పరిస్థితి నుంచి ఇవాళ ప్రతి ఒక్కరూ ఆనందంగా తింటున్నారని గర్వంగా ఈ సభలో చెప్పగలుగుతున్నాను. శ్రీకాకుళం జిల్లాలో మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నుంచి విస్తరించడానికి అన్నిరకాలుగా సన్నద్ధమవుతున్నాం. చంద్రబాబు హయాంలో పంపిణీచేసిన బియ్యానికి, ఇవాళ సప్లై చేస్తున్న నాణ్యమైన బియ్యానికి తేడా అక్షరాల రూ.1400 కోట్ల రూపాయలు అధికంగా ఖర్చుచేయబోతున్నాం.
నాణ్యమైన బియ్యం ప్రతి పేదవాడికీ అందించాలని, ప్రతి పేదవాడు నాణ్యమైన బియ్యం తినాలని, అమ్ముకునే పరిస్థితి రాకూడదనే చేస్తున్నాం. అచ్చెన్నాయుడు, రామానాయుడు ఈ బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అమలు చేయడంలేదని అడుగుతున్నారు. దాని అర్థం ఏంటంటే.. నాణ్యమైన బియ్యాన్ని శ్రీకాకుళంలో ఇస్తున్నామని వారిక్కూడా అర్థం అవుతోంది. గతంలో చంద్రబాబు హయాంలో మొత్తం బియ్యాన్ని కొనుగోలుచేసి పెట్టారు. ఆ బియ్యాన్ని ఏప్రిల్ మాసంలోగా పంపిణీచేసేసి, ఖరీఫ్-రబీ సీజన్‌లో స్వర్ణ లేదా అదే తరహా నాణ్యమైన బియ్యాన్ని కొనుగోలు చేయమని ఆదేశాలు జారీచేశాం.
ఆరు నెలలు కూడా నిల్వపెట్టి.. ఈ బియ్యాన్ని ఇవ్వబోతున్నాం. నాణ్యమైన బియ్యాన్ని ఇవ్వడానికి అదనంగా రూ.1400 కోట్లు ఖర్చు అవుతుంది. ఇదివరకు బియ్యంలో 25 శాతం నూకలు ఉండేవి. ఇప్పుడు నాణ్యమైన బియ్యంలో నూకలు శాతం కేవలం 15 శాతం మాత్రమే ఉంది. గతంలో బియ్యం డామేజ్ 3 శాతం ఉంటే.. దీన్ని 0.75 శాతానికి మించకూడదని స్పష్టంచేస్తున్నాం. డిస్కలర్ గతంలో 3 శాతం ఉంటే.. ఇప్పుడు 0.75 శాతం మించకూడదని చెప్తున్నాం. షాకీ గ్రెయిన్స్ ఇంతకుముందు 5శాతం ఉండేది. ఇప్పుడు ఒక శాతం మించి ఉండకూడదని చెప్తున్నాం.
ఇవన్నీ చేయడం వల్ల బియ్యంలో క్వాలిటీ పెంచడం వల్ల ప్రజలు అమ్ముకోవాలనే ఆలోచన చేయడం లేదు.
ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో ప్రజలంతా తింటున్నారు. అన్ని జిల్లాల్లోకూడా ఇదే రకమైన క్వాలిటీతో కూడిన బియ్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తాం. నాణ్యమైన బియ్యానికి, సన్న బియ్యానికి తేడా తెలియక కన్‌ఫ్యూజ్ అవొద్దు. నాణ్యమైన బియ్యం విషయంలో గతంలో తానేం చెప్పానో వీడియోను అసెంబ్లీలో ప్రదర్శించారు. మేనిఫెస్టోలో చెప్పని విషయాన్ని కూడా అమలు చేస్తున్నాం. దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈర్ష్యపడుతున్నారు. దుగ్ద చూపిస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో పేర్కొన్నారు.