మంచు ఇంట్లో చెలరేగిన మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. సినీ నటులు మంచు మోహన్ బాబు, ఆయన ఇద్దరు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్‌ల మధ్య ఆస్తి గొడవలు చెలరేగి, పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి. ఈ క్రమంలో ఓ మీడియా చానల్ ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేయడంతో ఆయనపై హత్యాయత్న కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన ఏక్షణమైనా అరెస్టు కావచ్చు. ఈ వివాదం ఇలా కొనసాగుతూనే ఉండగా, మంచు మనోజ్ తాజా ఆరోపణలతో మరో వివాదం తెరపైకి వచ్చింది.
విష్ణు.. తన ఇంటి వద్ద జనరేటర్‌లో పంచదార పోయించి విద్యుత్ సరఫరా నిలిపివేయించాడని మనోజ్ ఆరోపిస్తూ ప్రకటన విడుదల చేశారు. తాను సినిమా షూటింగుకు వెళ్లిన సమయంలో విష్ణు.. తన అనుచరులు రాజ్ కొండూరు, కిరణ్, విజయ్ రెడ్డిలతో పాటు కొందరు బౌన్సర్లతో ఇంట్లోకి ప్రవేశించి జనరేటర్లలో పంచదార పోయించాడని, దీంతో రాత్రి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని మనోజ్ పేర్కొన్నాడు.
జనరేటర్ సమీపంలోనే వాహనాలు, గ్యాస్ కనెక్షన్ ఉన్నాయని, వారి చర్యలతో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉండటంతో భయపడ్డామన్నారు. ఈ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నానని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని మనోజ్ ప్రకటనలో పేర్కొన్నారు.