దేశంలో విస్తృతంగా వ్యాపిస్తున్న కరోనా జైళ్లనూ కమ్మేసిందని, అక్కడ సరైన ఏర్పాట్లు చేయడం కష్టమైనందున.. రాజకీయ ఖైదీలను వెంటనే బెయిల్‌పై విడుదల చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది.
ఇటీవలి కాలంలో జైళ్లలోని కొందరు రాజకీయ, మానవ హక్కుల కార్యకర్తలు కరోనా బారిన పడినట్లు వార్తలస్తున్నాయని తెలిపింది. ఈ విధంగా జనసమూహం అధికంగా ఉండే జైళ్లలోని దుర్భరమైన పరిస్థితులు, కనీస సదుపాయాల లేమి వెరసి వారి ఆరోగ్య స్థితిని మరింత దిగజార్చుతోందని పేర్కొంది.
అఖిల్ గొగోరుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోందని, వరవరరావు ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని తెలిపింది.
జైళ్లలోని ఇరుకైన, అపరిశుభ్రమైన పరిస్థితుల మధ్య కల్పిత, తప్పుడు కేసులతో జైళ్లలో మగ్గుతున్న ప్రముఖ మానవ హక్కుల కార్యకర్తలు గౌతమ్ నవలఖా, అనిల్ తెల్తుంబ్డే, సుధా భరద్వాజ్, సోమసేన్, తదితరులకు కరోనా వైరస్ సోకే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఇతర రాజకీయ ఖైదీల్లో ప్రొఫెసర్ సాయిబాబా ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో జైళ్లలోని రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది.