Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేంద్రం ఏం సాధించిందో చెప్పాలి: సిపిఎం డిమాండ్‌

Advertiesment
CPM demand
, బుధవారం, 13 మే 2020 (07:16 IST)
50 రోజుల లాక్‌డౌన్‌ కాలంలో కేంద్రం ఏం సాధించిందో సమాధానం చెప్పాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో మోడీ సర్కారు పూర్తిగా విఫలమైందని అన్నారు.

దేశ ప్రజలు వాస్తవంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా మోడీ సర్కారు ఇష్టారీతిన వ్యవహరిస్తోందని సీతారాం ఏచూరి విమర్శించారు. లాక్‌డౌన్‌ తరువాత ఆర్థిక రోడ్డు మ్యాప్‌తో సహా ఇతర అనేక అంశాలపై రాష్ట్రపతికి, ప్రధాన మంత్రికి, కేంద్ర ఆర్థిక మంత్రికి చాలా లేఖలు రాశామని, కానీ వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదని తెలిపారు.

సిపిఎం కేంద్ర కార్యాలయం (ఎకెజి భవన్‌) నుంచి సీతారాం ఏచూరి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. లాక్‌డౌన్‌కు ముందు దేశంలో 566 కరోనా కేసులు, 10 మరణాలు నమోదు కాగా ప్రస్తుతం 70,756 కేసులు, 2,293 మరణాలు నమోదయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.

కరోనా కాలంలో రైల్వేలు, ఇతర వ్యవహారాలన్నీ రాష్ట్రాలను కనీసం సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుందని ఏచూరి ఆగ్రహించారు.
 
''కరోనా వైరస్‌ను అరికట్టడంలో దేశాన్ని ప్రపంచం అభినందిస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. నిజమే ప్రపంచం అభినందిస్తోంది. అయితే అది కేరళ రాష్ట్రాన్ని అభినందిస్తోంది. కరోనాను అరికట్టడంలో కేరళ చర్యలు అభినందనీయం.

ప్రపంచంలోనే కరోనాపై పోరులో కేరళ ఒక మోడల్‌గా నిలిచింది. 35 అంతర్జాతీయ దిన పత్రికలు మొదటి పేజీలో కరోనాను కేరళ ఎలా ఎదుర్కొందీ, ప్రజల ప్రాణాలను ఎలా కాపాడిందీ ప్రచురించాయి.

కేరళ చేసిందీ మేము ఎందుకు చేయలేమని ప్రతి రాష్ట్రం అనుకోవాలి. కేరళ ఏ శాస్త్రీయ ప్రాతిపదికలపై కరోనాను అరికట్టిందనేది ఇతర రాష్ట్రాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేరళ చేసినట్టు ఎందుకు చేయలేదో మోడీ ప్రశ్నించుకోవాలి'' అని సూచించారు.
 
కరోనాకు వ్యతిరేకంగా పోరాడటమే ప్రస్తుతం ప్రతి ప్రభుత్వ ఎజెండా కావాలన్నారు. ఈ సమయంలో కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తూ నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. దశాబ్దాల తరబడి కార్మికులు సాధించుకున్న హక్కులకు తూట్లు పొడవటం, కార్మికుల పని గంటలు 8 నుంచి 12 గంటలకు పెంచడం దారుణమని విమర్శించారు.

ప్రజానీకానికి న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉండేలా కోర్టులు గత కొంతకాలంగా వ్యవహరించడం లేదన్నారు. అయినా పోరాటంలో ప్రతి ఒక్కరి చూపు న్యాయ వ్యవస్థపై ఉంటుందని, కార్మిక చట్టాలపైన కోర్టులను ఆశ్రయిస్తామని అన్నారు. దేశద్రోహ చట్టాలను ఉపయోగిస్తూ జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు.

జైల్లో ఉన్న వారిని విడుదల చేయాలని ఒకవైపు సుప్రీం కోర్టు చెబుతుంటే, మరోవైపు ప్రభుత్వం ఇతర కేసుల్లో ఇరికించడమేంటని ప్రశ్నించారు. మైనార్టీలు, దళితులను లక్ష్యంగా చేసుకొని అరెస్టులు చేయడం సరికాదన్నారు.

కరోనా వల్ల ఉద్యోగాలు పోకుండా చూడాల్సిన ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదన్నారు. పిఎం కేర్స్‌ ఏర్పాటు చేసి, దానికి వస్తున్న నిధులు ఎక్కడికి పోతున్నాయో సర్కారు సమాధానం చెప్పాలన్నారు.
 
రోడ్డుపై ఒక్క వలస కార్మికుడు కూడా లేరని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని, అయితే రోడ్లపై, రైల్వే ట్రక్‌లపై ఎలా ఉన్నారని ప్రశ్నించారు. న్యాయ స్థానానికి ప్రభుత్వం ఏమి చెప్పిందో...ప్రస్తుతం ఏమి జరిగిందన్నదో దేశానికి తెలియాలన్నారు. రైలు కింద పడి వలస కార్మికులు స్వచ్ఛందంగా చనిపోలేదని అన్నారు. 
 
ప్రభుత్వం ఆహారం, వసతి కల్పించకపోవడం వల్లనే వలస కార్మికులు తమ స్వస్థలాలకి కదులుతున్నారని అన్నారు. వలస కార్మికులపట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా దయనీయంగా ఉందని, వారిని కనీసం మనుషులుగా చూడటం లేదని విమర్శించారు.

వలస కార్మికులు బానిసలు కాదని, వారికి కూడా మానవ హక్కులున్నాయని ఏచూరి నొక్కి చెప్పారు. దేశంలో ప్రతి ఒక్కరికి 10 కేజీల ఆహార ధాన్యాలు ఇవ్వాలని, ఒక్కొరికీ రూ. 7,500 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్X జగన్... నేతల మధ్య నీటి యుద్ధం!