ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య యవారం చెడిందా?.. నిన్నటి దాకా దోస్త్ మేరా దోస్త్ అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ ఇద్దరి మధ్య చల్లని జలం పోసినా భగ్గుమంటోందా? అవుననే అంటున్నాయి కొన్ని రాజకీయ వర్గాలు.
ఎందుకు చెడిందో తెలియనప్పటికీ ఏదో జరిగిందన్నది మాత్రం ఖాయమని ఆ వర్గాలు అంటున్నాయి. అయితే ఇది జలం కారణమా? లేక మరేదైనా మనసులో పెట్టుకుని జలం వంకతో యుద్ధం మొదలెట్టారా అన్నదానిపై నా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
అయితే.. ఇదంతా కేవలం రాజకీయ నాటకమే తప్ప.. వారిద్దరి మధ్య ఎంతో సఖ్యత వుందని ఓ ప్రతిపక్ష నేత వ్యాఖ్యానించారు. అసలు ఈ జల వివాదం బయటకు రావాల్సినంత పెద్దదేమీ కాదని, ఇద్దరు సీఎంలు కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుందని వివరించారు. కానీ ఎందుకో వివాదాన్ని రక్తి కట్టిస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ఇంతకీ అసలు ఏం జరిగింది?
శ్రీశైలం నుండి కృష్ణానీటిని తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం భగ్గుమంది. తమను ఏమాత్రం సంప్రదించకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ విమర్శించారు.
బేసిన్లు.. బేషజాలు లేకుండా నీటిని పంచుకుందామన్న తన సూచనను ఆంధ్రప్రదేశ్ సర్కారు పట్టించుకోలేదని ఆయన అన్నారు. కెసిఆర్ ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే తెలంగాణా నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ బోర్డు కృష్ణా బోర్డుకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మంగళవారం ఈ విషయమై సమీక్ష నిర్వహించారు. మానవతా ధృక్పదంతో ఆలోచించాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేటాయించిన నీటినే తాము వాడుకుంటామని తెలిపారు.
టి.సర్కారు వాదన ఇది..!
అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త పాజెక్టులు చేపట్టకూడదని దీనిని ఎపి ప్రభుత్వం లెక్కచేయడం లేదని టి.సర్కారు అంటోంది. కృష్ణా బోర్డుకు ఇచ్చిన ఫిర్యాదులో ఈ విషయాన్ని పేర్కొన్న ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి అనుమతితో సంగమేశ్వరం వద్ద రోజుకు 3 టిఎంసిల నీటిని తరలించే పథకానికి ఆమోదం తెలిపారని ప్రశ్నించింది.
ఈ నిర్ణయం వల్ల తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా తీవ్రంగా నష్టపోతుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి ఎపి ప్రభుత్వ నిర్ణయం విరుద్ధమని పేర్కొంది.
అదేసమయంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 44 వేల క్యూసెక్కుల నుండి 80 వేల క్యూసెక్కులకు పెంచే పనులకు టెండర్లు పిలిచిందని, దీనిని అడ్డుకోవాలని పేర్కొంది.
వృధాగా పోయే నీటిని తరలించేందుకే .. సిఎం జగన్
తెలంగాణ ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించాలని, వరద వచ్చే పదిరోజుల్లో వృధాగా పోయే నీటిని తరలించేందుకే తాము ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. రాయలసీమ, నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో తాగునీటికి కూడా నీరులేదని, అందుకే లిఫ్టు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
శ్రీశైలం డ్యాంలో 881 అడుగుల నీటిమట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు నుండి 44 వేల క్యూసెక్కుల నీటిని తీసుకునే అవకాశం ఉందని జగన్ తెలిపారు. నీటిమట్టం 854 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడు ద్వారా ఏడువేల క్యూసెక్కుల నీరు కూడా వెళ్లదని, 841 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడు నుంచి వెయ్యి క్యూసెక్కులు వెళుతుందని జగన్ వివరించారు.
ఇంతనీటి మట్టం ఏడాదిలో కనీసం పదిరోజులు కూడా ఉండదని పేర్కొన్నారు. గతంలో వరద వచ్చిన సమయంలో 800 టిఎంసిలు సముద్రంలో కలిసిపోయాయని, వాటిని వాడుకునే విధంగా ప్లాను చేస్తున్నామని ఎపి జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువనీటిని తోడుకునేందుకు వీలుగా సామర్థ్యం పెంచుతున్నామన్నారు.