బీఎస్ఎఫ్ జవాన్లు తొమ్మిది మందికి కరోనా సోకింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఢిల్లీ నుంచి 6, త్రిపుర నుంచి 2 వరకు ఉండగా.. కోల్‌కతాలో మరో జవానుకు కొవిడ్-19 సోకినట్టు గుర్తించారు. వీరందరినీ చికిత్స నిమిత్తం కోవిడ్-19 హెల్త్ కేర్ ఆస్పత్రులకు తరలించినట్టు బీఎస్ఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది.
అలాగే కరోనా అన్ని వర్గాల వారిపై విరుచుకుపడుతోంది. డిఫెన్స్‌లో కూడా పలువురికి సోకుతోంది. తాజాగా ఈ మహమ్మారి ధాటికి ఒక సీఐఎస్ఎఫ్ అధికారి మరణించారు. కరోనా సోకిన ఓ ఏఎస్ఐ కోల్‌కతాలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇప్పటి వరకూ సీఐఎస్ఎఫ్‌లో 68 మందికి కరోనా సోకగా.. ఇద్దరు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
కాగా, భారత్‌లో కొవిడ్-19 ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 3,604 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 70,756కు పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
గత 24 గంటల్లో మరో 87 మంది ప్రాణాలు కోల్పోవడంతో... దేశ వ్యాప్తంగా కరోనా మరణాలు 2,293కు చేరుకున్నాయి. కాగా ప్రస్తుతం 46,008 మంది కోవిడ్-19 బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా... ఇప్పటి వరకు 22,454 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.